కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మున్సిపల్, జిల్లా పరిషత్, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, టీడీపీలకు ఒకే రకమైన గుణపాఠం చెబుతారని వైఎస్‌ఆర్‌సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి తెలిపారు. ఆదివారం కడపలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర పాలక మండలి సభ్యులు డీసీ గోవిందరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్‌బాష, బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి జయరాములుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించడం చేతగాక మూడు సంవత్సరాలుగా వాయిదా వేసుకుంటూ వచ్చిందన్నారు. మైనార్టీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడింది టీడీపీనే అన్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోయాయన్నారు. రాష్ట్రపతి పాలన ఉన్నందునే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికలతోపాటే మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయన్నారు. 2008లో టీడీపీ తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. అప్పట్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పుట్టనే లేదన్నారు.కొందరు మాజీ మంత్రులు ఇన్నాళ్లు అధికారాన్ని అనుభవించి విభజనకు అన్ని రకాలుగా సహకరించడం ద్వారా రాష్ట్రానికి చేయాల్సిన నష్టమంతా చేశారన్నారు. వారు చేరినంత మాత్రాన టీడీపీది బలం కాదని, వాపేనని తెలిపారు.
అభ్యర్థులను ప్రకటించలేని దీనస్థితిలో
టీడీపీ, కాంగ్రెస్ :
జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేని దీన స్థితిలో కాంగ్రెస్, టీడీపీ ఉన్నాయని రఘురామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. తమ పార్టీ నుంచి ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్నారని, అందరినీ సంతృప్తిపరచడం కష్టమవుతున్నందున ప్రభుత్వం ఏర్పడ్డాక వారికి న్యాయం చేస్తామని చెబుతుండటంతో అందరూ త్యాగాలకు సిద్ధపడుతున్నారన్నారు.
రాష్ట్రం మళ్లీ కలిసే అవకాశముంది :
రాష్ట్ర విభజన ఇంకా పూర్తి కాలేదని జూన్‌లో అపాయింటెడ్ డేట్ ప్రకటించినందున కొత్త ప్రభుత్వాన్ని బట్టి పరిస్థితి మారవచ్చని, రాష్ట్రం కలిసి ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినందున రాజ్యాంగ బెంచ్‌లో న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందన్నారు.
గుణపాఠం తప్పదు
Published Mon, Mar 10 2014 2:30 AM | Last Updated on Tue, Oct 30 2018 7:25 PM