- పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
తిరువూరు (కృష్ణా జిల్లా) : అప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్రాన్ని పాలిద్దామనుకుంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆటలు ఇక సాగవని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కృష్ణాజిల్లా తిరువూరు వెళ్లిన ఆయన డీసీసీ కార్యదర్శి దోమతోటి నాగేశ్వరరావు సంతాప సభలో పాల్గొన్నారు. రఘువీరా మాట్లాడుతూ.. ప్రభుత్వం కంటే పార్టీయే ముఖ్యమన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, కార్యకర్తల్ని అక్రమ సంపాదనతో బలోపేతం చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా తమదే అధికారమని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
నిరంకుశ విధానాలు అనుసరిస్తే ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో బాబు ప్రభుత్వం అథఃపాతాళానికి వెళ్లడం ఖాయమని, ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాస్వామిక విలువలకు పాతరేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మశ్రీ, విజయవాడ పార్లమెటరీ నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ అవినాష్, తిరువూరు నియోజకవర్గ కన్వీనర్ రాజీవ్ పాల్గొన్నారు.