
విస్తరణలో సామాజిక అన్యాయం: రఘువీరా
సాక్షి, అమరావతిః మంత్రివర్గ విస్తరణతో సీఎం చంద్రబాబు కుల సమీకరణాలకే పెద్దపీట వేశారని ఏపీ పీసీసీ అధ్యక్ష్యులు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. ముస్లింలకు, వెనుకబడిన కులాలకు, గిరిజనలను విస్మరించి సామాజికంగా అన్యాయం చేశారని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నలుగురికి నీతులు చెప్పడానికి ముందు ఆ వ్యక్తి నైతిక విలువలు కలిగి ఉండాలని అందరికీ చెప్పే చంద్రబాబు ఆ విలువలకు తిలోదాకలిచ్చారని ఆయన దుయ్యబట్టారు. సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తప్పుపట్టిన చంద్రబాబు నేడు అదేపని చేసి రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలిచ్చారని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం బాధాకరమని రఘువీరా అన్నారు.