చెదిరిన స్వప్నం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆశలపై కేంద్ర మంత్రి మండలి నీళ్లు చల్లింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదిస్తూ తీర్మానించడంతో రఘువీరా చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి పదవి కలగానే మిగిలిపోయింది. వివరాల్లోకి వెళితే.. రోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించడాన్ని స్ఫూర్తిగా తీసుకున్న రఘువీరా.. తెలుగుజాతిని రెండు ముక్కలు చేస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవడానికి తహతహలాడారు.
పీసీసీ చీఫ్ బొత్స, అప్పటి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మినారాయణతో కలిసి ఫిబ్రవరి 21న గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. సీఎం కిరణ్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొద్దని కోరారు. తమ నలుగురిలో ఒకరికి అవకాశం ఇస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు విన్నవించారు. అనంతరం ఆ నలుగురూ కిరణ్‌ను వ్యతిరేకిస్తున్న మంత్రులను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి అధినేత్రి సోనియా, కాంగ్రెస్ కోర్ కమిటీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ఒత్తిడి తెచ్చారు. తనకు సన్నిహితులైన కేంద్రమంత్రులు వీరప్ప మెయిలీ, మల్లికార్జున ఖర్గేల ద్వారా లాబీయింగ్ కూడా చేశారు.
తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్‌తో కూడా అధినేత్రిపై తనకు సీఎం పదవి ఇప్పించేలా ఒత్తిడి తెచ్చారు. కానీ శుక్రవారం కేంద్ర మంత్రి మండలి రఘువీరా ఆశలను అడియాశలు చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు లేవని తేల్చి... రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదిస్తూ తీర్మానం చేసింది. ఏడాదిన్నర క్రితం రంగారెడ్డి జిల్లాలో ఓ డిస్టిలరీ కొనుగోలు వ్యవహారంలో సీఎం కిరణ్‌తో విభేదాలు వచ్చినప్పటి నుంచి ఆ పదవిపై కన్నేసి వ్యూహాత్మంగా అడుగులు వేశారు. హంద్రీ-నీవా ట్రయల్ రన్‌ను పురస్కరించుకుని నవంబర్ 17, 2012న కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకూ భగీరథ విజయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు.
ఆ పాదయాత్రకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురిని రప్పించుకుని తన పరపతి చాటుకున్నారు. ఇది గమనించి సీఎం కిరణ్.. శైలజానాథ్‌కు సహకారం పెంచారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యలతో సాన్నిహిత్యం పెంచుకుని ఏడాది కాలంగా సీఎం పదవి కోసం ప్రయత్నించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తన కలను సాకారం చేసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో ఆయన డీలా పడ్డారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.