
రోడ్లు హెరిటేజ్ డబ్బులతో వేశారా?
విజయవాడ: వెయ్యి రూపాయల ప్రజల సొమ్ముతో పింఛన్ ఇస్తూ టీడీపీ ఓటేయమంటున్న చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నీతులు చెప్పేవారు ముందు నీతిగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తేనే చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి అయ్యి కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. అన్ని ప్రయోజనాలు పొందిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఎంత కృతజ్ఞతతో ఉండాలి? అంటూ ప్రశ్నించారు.
వెయ్యి రూపాయలు ప్రభుత్వ డబ్బులతో పింఛన్ ఇస్తూ టీడీపీకి ఓటు వేయమంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం? చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారు. బాబు తన మాటల పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్లు ఏమైనా హెరిటేజ్ డబ్బులతో వేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మైనార్టీ, గిరిజనుల హక్కులను చంద్రబాబు కాల రాస్తున్నారని, మంత్రి వర్గంలో వారికి స్థానం కల్పించకపోవడం అన్యాయమని రఘువీరరెడ్డి అన్నారు.