'ఇద్దరు సీఎంలు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ చేత సమగ్రంగా దర్యాప్తు చేయించాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఏపీసీసీ నేతలు గవర్నర్ నరసింహన్తో సమావేశమై ఓటుకు నోటు వ్యవహారం, జల ప్రాజెక్టుల విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏ1గా చేర్చాలని చెప్పారు. ఈ కేసులో తిరుగులేని సాక్ష్యాలున్నాయని, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలన్నారు.
కేసీఆర్ ఎమ్మెల్యేలను కొన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని రఘువీరా పేర్కొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల్లో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇద్దరు సీఎంలను పిలిపించి చట్ట ప్రకారం వ్యవహరించేలా చూడాలని గవర్నర్ను కోరినట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా ప్రాజెక్టులు నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరని రఘువీరా రెడ్డి చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించాలని గవర్నర్ను కోరినట్టు తెలిపారు.