లోగుట్టు రఘువీరాకే ఎరుక!
Published Sat, Aug 10 2013 2:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎస్పీ శ్యాంసుందర్ వివాదాస్పద వ్యాఖ్యల్లో దాగిన అంతరార్థం సమైక్య ఉద్యమాన్ని అణచివేయడమేనా? సీమను విభజించి.. ‘రాయల తెలంగాణ’ ఏర్పాటుకు అడ్డంకులను తొలగించేందుకే ఎస్పీని మంత్రి రఘువీరా పావుగా వినియోగించుకుంటున్నారా? ప్రజల మనోభిప్రాయాలను గుర్తించి.. సమైక్య ఉద్యమంలో కదం తొక్కుతున్న వైఎస్సార్‌సీపీ నేతలను భయపెట్టి కట్టడి చేయడం ద్వారా సమైక్యవాదులను కూడా దారికి తెచ్చుకోవచ్చని మంత్రి భావిస్తున్నారా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మంత్రి రఘువీరా ఒత్తిళ్లకు తలొగ్గిన ఎస్పీ శ్యాంసుందర్ అధికార పార్టీ నేత తరహాలో రాజకీయ ప్రకటనలు చేస్తుండటమే ఇందుకు తార్కాణమని వారు స్పష్టీకరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ పక్షాలు, కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపిన నిమిషాల్లోనే సీమాంధ్రలో సమైక్య ఉద్యమం పురుడు పోసుకుంది. ఇంతింతై... అన్నట్లు ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోన్న సమయంలోనే ప్రజల మనోభిప్రాయాలను గౌరవించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
దీంతో వారికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో ఉద్యమభేరి మోగడం.. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కాంగ్రెస్, టీడీపీ అధిష్టానవర్గాలు రాజీనామా డ్రామాలకు తెరతీశాయి. ఆ క్రమంలోనే టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో మంత్రులు మినహా తక్కిన వారు పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేందుకు వెళ్లిన వారిని ఉద్యమకారులు అడ్డుకున్న విషయం విదితమే. ఇది పసిగట్టిన కాంగ్రెస్ అధిష్టానం టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై సీమ విభజనకు కుట్ర పన్నింది. అనంతపురం, కర్నూలు జిల్లాలను సీమ నుంచి విభజించి.. తెలంగాణలో కలపాలని నిర్ణయించింది. రాయల తెలంగాణ డిమాండ్‌ను అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజాప్రతినిధులే చేసేలా కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళిక రచించింది. ఆ ప్రణాళికలో భాగంగానే కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాయల తెలంగాణను డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కూడా అదే తరహా డిమాండ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేస్తోంది. రాయల తెలంగాణ డిమాండ్ చేస్తే జిల్లాలోకి అడుగుపెట్టే అవకాశమే ఉండదని గ్రహించిన మంత్రి రఘువీరా.. ముందుగా సమైక్య ఉద్యమాన్ని అణచి వేయడానికి పూనుకున్నారు. ఇందు కోసం ఎస్పీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎస్పీ... కాంగ్రెస్ కార్యకర్తగా మారిపోయారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
ఎస్పీ నోట రాజకీయ ప్రకటనలు
రఘువీరా ఒత్తిళ్లకు తలొగ్గిన ఎస్పీ శ్యాంసుందర్ సమైక్యవాదులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా లాఠీ ఝుళిపించి.. సమైక్యవాదులను చావబాదడమే అందుకు తార్కాణం. ఎస్పీ నోట రాజకీయ ప్రకటనలు వెలువడుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఆయన కదిరిలో విలేకరులతో మాట్లాడుతూ ‘రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని కూల్చిన వాళ్లు అక్కడే ఉన్న వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేయలేదు. దీన్ని బట్టి ఒక పార్టీకి చెందిన వాళ్లే ఇదంతా చేశారనే అనుమానం ఎవరికైనా వస్తుంది’ అంటూ వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జూలై 31న అనంతపురంలో సమైక్యవాదులు భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. కాంగ్రెస్‌కు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నేత అయిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసే సమయంలో ప్రత్యేక కెమెరాతో పోలీసులు వీడియోను చిత్రీకరించారు.
ఆ వీడియో దృశ్యాలను పరిశీలిస్తే.. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిందెవరన్నది అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇక జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎస్పీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడంపై జనం నివ్వెరపోతున్నారు. మంత్రి ఒత్తిడి వల్లే ఆయన ఆ రకమైన వ్యాఖ్యలు చేశారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డిసహా 20 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై బైండోవర్ కేసులు పెట్టడం కూడా అందులో భాగమేననే అభిప్రాయం విన్పిస్తోంది.
భయోత్పాతంతో అణగదొక్కగలరా?
వైఎస్సార్‌సీపీ నేతలను భయపెట్టి.. అక్రమ కేసులు బనాయించి కట్టడి చేయడం ద్వారా సమైక్యవాదులను భయోత్పాతానికి గురిచేయాలని మంత్రి రఘువీరా వ్యూహం రచించారు. అందులో భాగంగానే ఇటీవల తన సొంతూరులో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు ఎస్పీపై ఒత్తిడి తెచ్చి.. ఆ వ్యూహాన్ని అమలు చేయిస్తున్నారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. సమైక్య ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచి వేసిన వెంటనే ‘రాయల తెలంగాణ’ డిమాండ్‌తో ఢిల్లీ బాట పట్టాలని మంత్రి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తీసుకున్న సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ను కూడా రద్దు చేయించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మంత్రి దన్నుతో ఎస్పీ శ్యాంసుందర్ వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకోవడంపై డీఐజీ బాలకృష్ణకు అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేశారు. కదిరిలో ఎస్పీ చేసిన వ్యాఖ్యలను డీఐజీకి వివరించారు. ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన సీడీని కూడా అందించారు. దీనిపై డీఐజీ స్పందిస్తూ సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే విలేకరులకు వెల్లడించారు. సోమవారం రాయలసీమ రేంజ్ ఐజీ రాజీవ్ రతన్, డీజీపీ దినేష్‌రెడ్డిలకు కూడా ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించారు.
Advertisement
Advertisement