Royal Telangana
-
...లేదంటే మహా ఉద్యమమే
=తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ =నేడు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ ప్రతిపాదన విరమించుకోవాలి.. లేదంటే తెలంగాణ ఉద్యమం మహా ఉద్యమంగా మారుతుం దని తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ బుధవారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు చేస్తే సివిల్‌వార్ తీసుకొస్తామం టూ ఏపీ ఎన్జీవోస్ నాయకుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ.. పోరాటం ఎలా చేయాలో ఈ ప్రాంత బిడ్డలకు తెలుసన్నారు. హైదరాబా ద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని తిరగదోడి రాయల తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నాటి బంద్‌లో ఉద్యోగులంతా పాల్గొంటున్నామని, అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షు డు కోల రాజేష్ కుమార్ మాట్లాడుతూ రాయల తెలంగాణను నిరసిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట వెయ్యి మంది ఉద్యోగులతో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న మోసాలను అడ్డుకుంటామన్నారు. మహాధర్నాలో ఉద్యోగులంతా పాల్గొనాలని కోరారు. నిరసన కార్యక్రమంలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి షేక్ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు దాస్యానాయక్, టీఎన్జీవోస్ నాయకులు ఈగ వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, రాంకిషన్, సోమయ్య, ధరంసింగ్, శ్రీనివాస్, శ్యాంసుం దర్, సలీం, వేణు, రమేశ్, రత్నాకర్‌రెడ్డి, కిరణ్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు బంద్
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా గురువారం జరిగే జిల్లా బంద్‌లో అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే వినయభాస్కర్ పిలుపు నిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, ఆర్టీసీ పూర్తిగా సహకరించాలని కోరారు. కాగా, బంద్‌కు సీపీఐ పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొనాలని కోరారు. బీజీపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్ సందర్భంగా ఆటోలు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ ఆటోడ్రైవర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ తెలిపారు. ఆర్టీసీ టీఎంయూ గౌరవ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, రీజినల్ సెక్రటరీ డీఆర్రెడ్డి, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిన్నా శివకుమార్, కక్కెర్ల అనిల్‌కుమార్ బంద్‌కు మద్దతు తెలిపారు. -
రగిలిన ఓరుగల్లు
=ఊరూరా ఆందోళనలు =మానవహారాలు.. దీక్షలు.. ర్యాలీలు =మహబూబాబాద్‌లో రైలు పట్టాలపై నిరసన =ఎంపీ రాజయ్యను అడ్డుకున్న తెలంగాణవాదులు వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఓరుగల్లు భగ్గుమంది. కేంద్రం తీరుపై తెలంగాణవాదులు నిప్పులు చెరిగారు. ఊరూరా నిరసనలు చేపట్టారు. టీఆర్ఎస్, టీజేఏసీ, విద్యార్థులు, యువకులు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, డాక్టర్లు, ప్రజాసంఘాల నాయకులు ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాలెక్కిన పోరు.. మహబూబాబాద్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రైల్వే స్టేష న్లో పట్టాలపై నిరసన చేపట్టారు. నిరసనతో రైళ్ళరాకపోకలకు అంతరాయం కలిగింది. జై తెలంగాణ, రాయల తెలంగాణను ఒప్పుకోమంటూ నినదించారు. ఆందోళనకారులను అడ్డు తొలగించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. న్యాయవాదుల ఆధ్వర్యంలో కోర్టు వద్ద దీక్షలు నిర్వహించారు. ఎంపీకి తెలంగాణ సెగ భూపాల్పల్లి మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తెలంగాణ సెగ తగిలింది. రాయల తెలంగాణ వద్దంటూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ వచ్చేందుకు పాటుపడాలని విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. భూపాల్పల్లి, రేగొండ, ఘన్పూర్, శాయంపేట, చిట్యాల మండలాల్లో విద్యార్థులు, యువకులు ర్యాలీలు నిర్వహించారు. హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేసి రాస్తారోకో నిర్వహించారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశారుు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. లంబాడి విద్యార్థి సంఘం నిరసన వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని కాంగ్రెస్ అనేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాయల తెలంగాణకు ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల 72గంటల దీక్ష రెండోరోజూ కొనసాగింది. కేయూలో విద్యార్థులు, పీడీఎస్యు ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేశారు. ఆటాపాటలతో సెంటర్ హోరెత్తింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని చిన్నపెండ్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి మండల కేంద్రాల్లో విద్యార్ధులు నిర్వహించిన రాస్తారోకోలు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. తొర్రూరులో న్యాయవాదులు దీక్షలు నిర్వహించారు. పాలకుర్తి, తొర్రూరు, రాయపర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండల కేంద్రాల్లో టీఆర్ఎస్వీ, యూత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో దుగ్గొండి మండలం గిర్నిబాయిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని తేల్చిచెప్పారు. నర్సంపేటలో న్యాయవాదుల ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం మండలాల్లో విద్యార్థులు, యువకులు, టీఆర్ఎస్ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు అజ్మీరా చందూలాల్ పాల్గొన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై పరకాలలో తెలంగాణవాదులు భగ్గుమన్నారు. భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిక్షపతి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలకు ఘోరీ కట్టాలని పిలుపునిచ్చారు. గీసుగొండ, ఆత్మకూరు మండలాల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. డోర్నకల్, మరిపెడ, కురవి, నర్సింహులపేట మండలాల్లో విద్యార్థులు, టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. రాయల తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం, పర్వతగిరి, హసన్‌పర్తి, మడికొండల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. రాయలతెలంగాణని వ్యతిరేకిస్తూ వడుప్సా, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టి మానవహారం ఏర్పాటు చేశారు. -
తెలంగాణపై జిఓఎం తుది నివేదిక ఖరారు
-
రాయల్ తెలంగాణకు నేను వ్యతిరేకం: జైపాల్ రెడ్డి
-
రేపు ఢిల్లీ వెళ్లనున్న డీఎస్
రాయల తెలంగాణ ప్రతిపాదనపై చర్చలు జోరందుకున్నాయి. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. రాయల తెలంగాణ గురించి కూడా ఆలోచిస్తోంది. ఈ విషయంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ హైకమాండ్‌తో చర్చించనున్నారు. ఆదివారం సాయంత్రం డీఎస్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ విషయం గురించి రాయల సీమ నేతలతో సంప్రదిస్తున్నారు. కాగా రాయల తెలంగాణపై కాంగ్రెస్‌లోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశం గురించి తనకు తెలియదని.. సోనియా గాంధీతో సమావేశానంతరం కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పారు. రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
రాయల తెలంగాణ అంగీకరించం
తిరుపతి, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ డిమాండ్ వెనుక కొందరి స్వార్థప్రయోజనాలు దాగి ఉన్నాయని దీనిని తాము అంగీకరించమని సమైక్యవాదులు అంటున్నారు. ‘రాయల తెలంగాణ’ నాటకాన్ని ఆడిస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని అనుమానిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ సీపీ ప్రాబల్యాన్ని రాయలసీమలో నిలువరించేందుకు ఈ కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ జిల్లాలో 119 రోజులుగా సాగుతున్న నిరసన కార్యక్రమాలు మంగళవారం కూడా యధాతథంగా కొనసాగాయి. మదనపల్లెలో స్థానిక హోప్ హైస్కూల్లో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే కష్ట, నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 119 సంఖ్య ఆకారంలో కూర్చొని సమైక్య నినాదాలు చేశారు. అనంతరం పురవీధుల్లో భారీ ర్యాలీ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తాము అంగీకరించేది లేదని జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు. తిరుపతి తుడా సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షలో తాతయ్యగుంట ప్రాంతానికి చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ పట్టణ కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి దీక్షలో ఉన్నవారికి సంఘీభావం ప్రకటించారు. రాయల తెలంగాణ నాటకాన్ని ఆడిస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. సాయంత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కార్యకర్తలతో దీక్ష విరమింపచేశారు. న్యాయవాదులు కోర్టు విధుల బహిష్కరణను కొనసాగించారు. తిరుపతిలో మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టౌన్‌క్లబ్ సర్కిల్ నుంచి ప్రధాన వీధుల మీదుగా తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ సాగింది. రాయల తెలంగాణ ప్రతిపాదన వె నుక కుట్ర దాగి ఉందని మబ్బు చెంగారెడ్డి ఆరోపించారు. పుంగనూరులో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఎన్టీఆర్ సర్కిల్లో జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అలాగే ఇంద్రప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కొనసాగాయి. పలమనేరులో వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగాయి. శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ కార్యకర్తలు రిలే దీక్ష కొనసాగించారు. -
సీమ కాంగ్రెస్‌లో ‘రాయల’ చిచ్చు!
రాయల తెలంగాణ కోసం కర్నూలు, అనంత నేతల యత్నాలు మేడం అపాయిట్మెంట్ కోసం యత్నిస్తున్న కోట్ల అనంత వెంకట్రామిరెడ్డి నివాసంలో రఘువీరా, కోట్ల మంతనాలు రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోవడంతో కర్నూలు, అనంతపురం జిల్లాల కాంగ్రెస్ నేతలు మళ్లీ ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. విభజన అనివార్యమైతే తమ రెండు జిల్లాలను తెలంగాణలోనే కొనసాగించాలే తప్ప సీమాంధ్రలో విలీనం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మరోసారి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మంగళవారం కోట్ల నివాసంలో మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్ సమావేశమై ఈ అంశంలో హైకమాండ్ పెద్దలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోనియాగాంధీ అపాయిట్మెంట్ కోరినప్పటికీ ఇంకా ఖరారు కాకపోవడంతో టీజీ, ఏరాసు హైదరాబాద్ వెళ్లిపోయారు. మరోవైపు నిన్నటి వరకు రాష్ట్రం సమైక్యంగా ఉంచడం మినహా మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని నినదించిన అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్వరం మారింది. ఆయన మంగళవారం తన నివాసంలో మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్‌కు మధ్యాహ్న విందునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ జిల్లా ప్రజల నుంచి రాయల తెలంగాణ డిమాండ్ వస్తోందని చెప్పారు. కేంద్రం లేదా కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తే మద్దతిచ్చే విషయంపై ఆలోచిస్తామని చెప్పారు. సాయిప్రతాప్ మాత్రం రాష్ట్రాన్ని విడదీయడం కంటే సమైక్యంగా కొనసాగించి పదేళ్ల పాటు అభివృద్ధి చేసిన తరువాతే విభజన గురించి ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘రాయల తెలంగాణ’ వెనుక వేరే ఉద్దేశం? ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నిహితులు మాత్రం రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక వేరే దురుద్దేశాలున్నాయని అభిప్రాయపడ్డారు. హైకమాండ్ పెద్దలు దీని వెనుక పథక రచన చేసినట్లు కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరిగితే మెజారిటీ సభ్యుల అభిప్రాయాలు వ్యతిరేకంగా ఉండే పరిస్థితి కన్పించడంతో రాయల తెలంగాణ పేరుతో కొందరిని, పదవుల పేరుతో మరికొందరిని విడదీసి మెజారిటీ అభిప్రాయాలు బిల్లుకు అనుకూలంగా వచ్చేలా చేయాలన్నదే హైకమాండ్ పెద్దల లక్ష్యంగా కన్పిస్తోందన్నారు. ఇప్పటికే సీమాంధ్రకు చెందిన పలువురు మంత్రులు విభజన విషయంలో రాజీపడి హైకమాండ్ లైన్లో వెళుతున్నారని, రాయల తెలంగాణ పేరుతో మరికొంతమందిని సమైక్య భావనకు దూరం చేయాలనే వ్యూహంతోనే తెరపైకి మళ్లీ ఈ అంశాన్ని తెచ్చారని పేర్కొంటున్నారు. సమైక్యం కోసం పోరాడుతా: శైలజానాథ్ సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ కోసం తన పోరాటం కొనసాగిస్తానని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కన్వీనర్ సాకే శైలజానాథ్ తెలిపారు. తాను ఎవర్నీ మభ్యపెట్టడంలేదని, కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)తో భేటీకి హాజరైన తర్వాత తనకేమీ పశ్చాత్తాపం లేదని అన్నారు. ఏవో సొంత ఆలోచనలతో రాయల తెలంగాణ అనకుండా వాస్తవాల ఆధారంగా డిమాండ్ చేయాలని మంగళవారం హైదరాబాద్‌లో అన్నారు. -
రాయల తెలంగాణపై సోనియాను కలుస్తాం:జేసీ
హైదరాబాద్: రాయల తెలంగాణ అంశంపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవాలనుకుంటున్నట్లు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రాయల తెలంగాణ కోసం కేంద్రమంత్రులు కిషోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రయత్రిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తదితర విషయలపై సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తమకు ప్రత్యేక రాష్ట్రం అవశ్యం గురించి తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపకపోతే భవిష్యత్తులో ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తలెత్తే అవకాశం ఉందన్నారు. దీనిపై టీ.కాంగ్రెస్, టీఆర్ఎస్. బీజేపీ నేతలను కలిసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీమాంధ్రకు కర్నూలును రాజధానిగా చేయకపోతే రాయలసీమ అసంతృప్తికి గురౌవుతుందన్నారు. రాయల తెలంగాణకు కోస్తాంధ్ర నేతలు కూడా సహకరించాలని జేసీ విజ్ఞప్తి చేశారు. -
రాయల తెలంగాణ ప్రతిపాదనతో రాక్షసానందం
=సీఎం, చంద్రబాబు భావితరాల విలన్లు =రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే జగన్ తాపత్రయం =వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సాక్షి, తిరుపతి : రాయల తెలంగాణను తెరపైకి తెచ్చి రాక్షసానందం పొందేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, శ్రీని వాసులు అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వారు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు రాయల తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని చెప్పారు. ఆ ప్రతిపాదన తీసుకువస్తే, ప్రజలే వీరి నాలుకలు తెగ్గోస్తారని హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు కారణమైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు భావితరాల దృష్టిలో విలన్లు కావడం ఖాయమన్నారు. కర్ణాటక రా ష్ట్రంతో ఇప్పటికే కృష్ణా జలాల సమస్యను ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన గాలేరు- నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీఎం ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 48 గంటల పాటు రహదారుల దిగ్బంధం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విరుచుకుపడ్డారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇందు లో భాగంగానే ఈనెల 16 నుంచి దేశ వ్యాప్తం గా ఆయన పర్యటించి, అన్ని జాతీయ పార్టీల నాయకులను కలుసుకుంటారని చెప్పారు. సమైక్య ఉద్యమాన్ని రాష్ట్రపతి గుర్తించాలని కో రారు. విభజన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావాలనే జగన్మోహన్రెడ్డి పిలుపు కు ఆయా పార్టీల నాయకులు స్పందించాలని కోరారు. విభజన బిల్లు శాసనసభకు వస్తే అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. యూపీఏ ఇస్తున్న ప్యాకేజీలు సీమాంధ్రలో అమలవుతాయనే నమకం ఏముందని ప్రశ్నించారు. -
రాయల తెలంగాణకే జేసీ ఓటు
హైదరాబాద్: ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. సీఎం మార్పు అనేది ఊహాగానామే అని ఆయన కొట్టిపారేశారు. సీఎం కిరణ్ అధిష్టాన విధేయుడని వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నప్పటికి విభజన పక్రియలో హైకమాండ్ డైరెక్షన్ ప్రకారమే ఆయన నడుచుకుంటారని అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణ కావాలని మొదటినుంచి కోరుతున్నానని వెల్లడించారు. ఈ అంశంతో పాటు ఇతర రాజకీయ అంశాలను చర్చించేందుకే కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో హైకమాండ్ పెద్దలు సమావేశమౌవుతున్నారేమోనని అన్నారు. మహబూబ్‌నగర్ బస్సుప్రమాద ఘటనపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. -
లోగుట్టు రఘువీరాకే ఎరుక!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎస్పీ శ్యాంసుందర్ వివాదాస్పద వ్యాఖ్యల్లో దాగిన అంతరార్థం సమైక్య ఉద్యమాన్ని అణచివేయడమేనా? సీమను విభజించి.. ‘రాయల తెలంగాణ’ ఏర్పాటుకు అడ్డంకులను తొలగించేందుకే ఎస్పీని మంత్రి రఘువీరా పావుగా వినియోగించుకుంటున్నారా? ప్రజల మనోభిప్రాయాలను గుర్తించి.. సమైక్య ఉద్యమంలో కదం తొక్కుతున్న వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టి కట్టడి చేయడం ద్వారా సమైక్యవాదులను కూడా దారికి తెచ్చుకోవచ్చని మంత్రి భావిస్తున్నారా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మంత్రి రఘువీరా ఒత్తిళ్లకు తలొగ్గిన ఎస్పీ శ్యాంసుందర్ అధికార పార్టీ నేత తరహాలో రాజకీయ ప్రకటనలు చేస్తుండటమే ఇందుకు తార్కాణమని వారు స్పష్టీకరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ పక్షాలు, కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపిన నిమిషాల్లోనే సీమాంధ్రలో సమైక్య ఉద్యమం పురుడు పోసుకుంది. ఇంతింతై... అన్నట్లు ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోన్న సమయంలోనే ప్రజల మనోభిప్రాయాలను గౌరవించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో వారికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో ఉద్యమభేరి మోగడం.. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కాంగ్రెస్, టీడీపీ అధిష్టానవర్గాలు రాజీనామా డ్రామాలకు తెరతీశాయి. ఆ క్రమంలోనే టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో మంత్రులు మినహా తక్కిన వారు పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేందుకు వెళ్లిన వారిని ఉద్యమకారులు అడ్డుకున్న విషయం విదితమే. ఇది పసిగట్టిన కాంగ్రెస్ అధిష్టానం టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై సీమ విభజనకు కుట్ర పన్నింది. అనంతపురం, కర్నూలు జిల్లాలను సీమ నుంచి విభజించి.. తెలంగాణలో కలపాలని నిర్ణయించింది. రాయల తెలంగాణ డిమాండ్‌ను అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజాప్రతినిధులే చేసేలా కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళిక రచించింది. ఆ ప్రణాళికలో భాగంగానే కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాయల తెలంగాణను డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కూడా అదే తరహా డిమాండ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేస్తోంది. రాయల తెలంగాణ డిమాండ్ చేస్తే జిల్లాలోకి అడుగుపెట్టే అవకాశమే ఉండదని గ్రహించిన మంత్రి రఘువీరా.. ముందుగా సమైక్య ఉద్యమాన్ని అణచి వేయడానికి పూనుకున్నారు. ఇందు కోసం ఎస్పీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎస్పీ... కాంగ్రెస్ కార్యకర్తగా మారిపోయారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ నోట రాజకీయ ప్రకటనలు రఘువీరా ఒత్తిళ్లకు తలొగ్గిన ఎస్పీ శ్యాంసుందర్ సమైక్యవాదులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా లాఠీ ఝుళిపించి.. సమైక్యవాదులను చావబాదడమే అందుకు తార్కాణం. ఎస్పీ నోట రాజకీయ ప్రకటనలు వెలువడుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఆయన కదిరిలో విలేకరులతో మాట్లాడుతూ ‘రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని కూల్చిన వాళ్లు అక్కడే ఉన్న వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేయలేదు. దీన్ని బట్టి ఒక పార్టీకి చెందిన వాళ్లే ఇదంతా చేశారనే అనుమానం ఎవరికైనా వస్తుంది’ అంటూ వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జూలై 31న అనంతపురంలో సమైక్యవాదులు భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. కాంగ్రెస్‌కు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నేత అయిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసే సమయంలో ప్రత్యేక కెమెరాతో పోలీసులు వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియో దృశ్యాలను పరిశీలిస్తే.. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిందెవరన్నది అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇక జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎస్పీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడంపై జనం నివ్వెరపోతున్నారు. మంత్రి ఒత్తిడి వల్లే ఆయన ఆ రకమైన వ్యాఖ్యలు చేశారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డిసహా 20 మంది వైఎస్సార్సీపీ నేతలపై బైండోవర్ కేసులు పెట్టడం కూడా అందులో భాగమేననే అభిప్రాయం విన్పిస్తోంది. భయోత్పాతంతో అణగదొక్కగలరా? వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టి.. అక్రమ కేసులు బనాయించి కట్టడి చేయడం ద్వారా సమైక్యవాదులను భయోత్పాతానికి గురిచేయాలని మంత్రి రఘువీరా వ్యూహం రచించారు. అందులో భాగంగానే ఇటీవల తన సొంతూరులో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు ఎస్పీపై ఒత్తిడి తెచ్చి.. ఆ వ్యూహాన్ని అమలు చేయిస్తున్నారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. సమైక్య ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచి వేసిన వెంటనే ‘రాయల తెలంగాణ’ డిమాండ్‌తో ఢిల్లీ బాట పట్టాలని మంత్రి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తీసుకున్న సోనియాగాంధీ అపాయింట్మెంట్ను కూడా రద్దు చేయించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మంత్రి దన్నుతో ఎస్పీ శ్యాంసుందర్ వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకోవడంపై డీఐజీ బాలకృష్ణకు అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేశారు. కదిరిలో ఎస్పీ చేసిన వ్యాఖ్యలను డీఐజీకి వివరించారు. ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన సీడీని కూడా అందించారు. దీనిపై డీఐజీ స్పందిస్తూ సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే విలేకరులకు వెల్లడించారు. సోమవారం రాయలసీమ రేంజ్ ఐజీ రాజీవ్ రతన్, డీజీపీ దినేష్‌రెడ్డిలకు కూడా ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. -
రాయల తెలంగాణ అనలేదు: కోట్ల
-
రాయల తెలంగాణ అనలేదు: కోట్ల
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరామని కాంగ్రెస్ నాయకుడు, రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. తమ ప్రాంత నేతలతో పాటు సోనియాను కలిసిన తర్వాత ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేకుంటే మూడు రాష్ట్రాలు చేయాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల తమ ప్రాంతంలో తాగునీటి సమస్య వస్తుందని తెలిపామన్నారు. హైకమాండ్ ముందు రాయల తెలంగాణ ప్రతిపాదన చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాజీనామాలతో సమస్యలు పరిష్కారమైతే తాను రాజీనామాకు సిద్ధమేనని ప్రకటించారు. హైపవర్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించనున్నట్టు తెలిపారు. త్రిసభ్య కమిటీ తమ సమస్యలు పరిష్కరిస్తుందని నమ్మకాన్ని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ దిశగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సోమవారం వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తమ జిల్లాను తెలంగాణలోనే కలిపేందుకు వారు మొగ్గు చూపుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే తాము సమైక్యాంధ్రకు కట్టుబడ్డామని, కలిసుండేందుకు వీలుకాకపోతే తమకు ప్రత్యేకంగా గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి స్పష్టం చేయడంతో ఈ ఊహాగానాలకు అడ్డుకట్ట పడింది. -
మూడు ముక్కలాట! - రచన, దర్శకత్వం: కాంగ్రెస్ హైకమాండ్
డబ్ల్యూ. చంద్రకాంత్, సాక్షి-న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానం మరో దుష్ట పన్నాగానికి తెరతీస్తోంది. ఒకవైపు తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని, సీమాంధ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని చెబుతూనే మరోవైపు రాయల తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు వెనుకనుండి ఆజ్యం పోసే ప్రయత్నాల్లో ఉంది. రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర మంటలు రేకెత్తించడమే కాంగ్రెస్ కుట్రలోని లక్ష్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో వైరిపక్షాలను నిరోధించేందుకు, తాను లబ్ధి పొందే క్రమంలో.. కాంగ్రెస్ రాష్ట్రాన్ని మూడుముక్కలు చేసేందుకు కూడా వెనుకాడబోదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఇందుకు తగిన వ్యూహాన్ని రూపొందించి ఆ మేరకు పావుల్ని నడిపిస్తున్నారని చెబుతున్నారు. అనంతపురానికి చెందిన కాంగ్రెస్ నేతలు తొలుత రాయల తెలంగాణ రాగం అందుకోగా ఇప్పుడు కర్నూలు నేతలు కూడా ఇదే డిమాండ్‌తో గళం విప్పారు. అనంతపురం నేత జేసీ దివాకర్‌రెడ్డి వంటి వారిని ప్రోత్సహించిన రాష్ట్ర ఇన్చార్జి తాజాగా సోమవారం కర్నూలు జిల్లా నేతలను తన ఇంటికి పిలిపించుకున్నారు. సాగునీటి అవసరాలు, డిమాండ్లతో పాటు పొరుగున ఉన్న కృష్ణా బేసిన్ అంశాలను ప్రస్తావిస్తూ.. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలని జేసీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే డిమాండ్‌ను భుజానికెత్తుకున్న కర్నూలు నేత, రైల్వేశాఖ సహాయ మంత్రి కె.సూర్యప్రకాశ్‌రెడ్డితో పాటు మరో ఎంపీ, రాష్ట్ర మంత్రి ఒకరు, పలువురు ఎమ్మెల్యేలు దిగ్విజయ్ నివాసానికి వెళ్లారు. సుమారు గంటసేపు ఆయనతో మంతనాలు కొనసాగించారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కర్నూలును తెలంగాణలో కలపాలనే డిమాండ్‌ను ఆయన ముందుంచారు. అయితే రాయలసీమలో వేర్పాటువాద ఉద్యమ వేడి రగిలించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు వేసిన పథకంలో ఇది భాగమని స్పష్టంగా తెలిసిపోతోంది. వాస్తవానికి తెలంగాణపై నిర్ణయానికి ముందే కాంగ్రెస్ పెద్దలు రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఓ రెండు తెలుగు చానెళ్ల ద్వారా ఇన్నాళ్లూ విస్తృత ప్రచారం కల్పించారు. అయితే 10 జిల్లాలతో కూడిన తెలంగాణకు సోనియాగాంధీ మొగ్గు చూపిన నేపథ్యంలో కొంత మౌనం పాటించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాజాగా మరోసారి పార్టీ అధ్యక్షురాలికి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు పార్టీవర్గాల సమాచారాన్ని బట్టి అవగతమవుతోంది. రాయల తెలంగాణతో రాజకీయంగా సంఖ్యాపరమైన అసమతుల్యతను పూడ్చవచ్చని సదరు నేతలు సోనియాకు చెబుతున్నట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణ రాష్ట్ర బిల్లుగా తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కూడా ఇది మార్గం సుగమం చేస్తుందని వారు వివరిస్తున్నారు. వీరి విజ్ఞప్తికి అధిష్టానం ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుందో తెలియనప్పటికీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణకే పరిమితం అవుతామని కాంగ్రెస్ స్పష్టంగా ఎక్కడా చెప్పని విషయం మరవరాదని విశ్లేషకులంటున్నారు. రాయల తెలంగాణ రాష్ట్ర ప్రత్యామ్నాయం పరిశీలనలోనే ఉందని దిగ్విజయ్ కూడా చెప్పారంటున్నారు. తెలంగాణ కు చెందిన కొందరు ముఖ్యులతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన పార్టీ నేతల నుంచి హామీ పొందిన నేపథ్యంలోనే ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేశారంటున్నారు. ఈ రెండు జిల్లాలను తెలంగాణలో క లపనున్న విషయం ఆయా జిల్లాల మంత్రులకు ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు టెలిఫోన్లో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 147 చొప్పున అసెంబ్లీ, 21 చొప్పున లోక్‌సభ స్థానాలు ఉండేలా చూడటమే ఇందులోని లక్ష్యమని చెబుతున్నారు. మూడు ముక్కలతోనే ప్రయోజనం ఎక్కువ రెండురకాల ఆలోచనలతో రాయల తెలంగాణపై విస్తృత చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు చెబుతున్నారు. 42 లోక్‌సభ సీట్లను రెండు సమాన భాగాలు చేయడం ఇందులో ఒకటి. రాయల తెలంగాణ చేసిన పక్షంలో ఇందులో 21 సీట్లు, ఆంధ్రప్రదేశ్ంలో 21 సీట్లు సమానంగా ఉంటాయి. ఇలా వీలుకాని పక్షంలో రాయలసీమ ప్రాంతంలో బలమైన ఉద్యమాన్ని సృష్టించడం ద్వారా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్న వారిని ప్రోత్సహించి రాష్ట్రాన్ని మూడుగా విభజించేలా చూడటం మరొకటని అంటున్నారు. కొందరు రాయలసీమ ప్రాంత నేతలతో పాటు ఎంఐఎం, టీఆర్ఎస్లు కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండటంతో.. రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కోరడం మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు అంచనా వేస్తున్నారు. దిగ్విజయ్‌తో పాటు సీనియర్ నేత పి.చిదంబరం వంటి వారి ఆశీస్సులు కూడా ఈ పథకానికి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం వల్లే ప్రయోజనం ఎక్కువని వారు సోనియాకు చెబుతున్నట్లు సమాచారం. గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లు కూడా ఈ ‘పథకాన్ని’ సమర్థిస్తున్నట్టు చెబుతున్నారు.