రగిలిన ఓరుగల్లు | Flaming movement | Sakshi
Sakshi News home page

రగిలిన ఓరుగల్లు

Published Thu, Dec 5 2013 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM

Flaming movement

=ఊరూరా ఆందోళనలు
 =మానవహారాలు.. దీక్షలు.. ర్యాలీలు
 =మహబూబాబాద్‌లో రైలు పట్టాలపై నిరసన
 =ఎంపీ రాజయ్యను అడ్డుకున్న తెలంగాణవాదులు

 
 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఓరుగల్లు భగ్గుమంది. కేంద్రం తీరుపై తెలంగాణవాదులు నిప్పులు చెరిగారు. ఊరూరా నిరసనలు చేపట్టారు. టీఆర్‌ఎస్, టీజేఏసీ, విద్యార్థులు, యువకులు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, డాక్టర్లు, ప్రజాసంఘాల నాయకులు ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు నిర్వహించారు. ఈ ఆందోళన
 కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
 పట్టాలెక్కిన పోరు..
 మహబూబాబాద్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రైల్వే స్టేష న్‌లో పట్టాలపై నిరసన చేపట్టారు. నిరసనతో రైళ్ళరాకపోకలకు అంతరాయం కలిగింది. జై తెలంగాణ, రాయల తెలంగాణను ఒప్పుకోమంటూ నినదించారు. ఆందోళనకారులను అడ్డు తొలగించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. న్యాయవాదుల ఆధ్వర్యంలో కోర్టు వద్ద దీక్షలు నిర్వహించారు.
   
 ఎంపీకి తెలంగాణ సెగ
 భూపాల్‌పల్లి మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తెలంగాణ సెగ తగిలింది. రాయల తెలంగాణ వద్దంటూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ  వచ్చేందుకు పాటుపడాలని విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. భూపాల్‌పల్లి, రేగొండ, ఘన్‌పూర్, శాయంపేట, చిట్యాల మండలాల్లో విద్యార్థులు, యువకులు ర్యాలీలు నిర్వహించారు.  
     
 హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేసి రాస్తారోకో నిర్వహించారు. టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశారుు.  తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు.  తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. లంబాడి విద్యార్థి సంఘం నిరసన వ్యక్తం చేసింది. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని కాంగ్రెస్ అనేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాయల తెలంగాణకు ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల 72గంటల దీక్ష రెండోరోజూ కొనసాగింది. కేయూలో విద్యార్థులు, పీడీఎస్‌యు ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేశారు. ఆటాపాటలతో సెంటర్ హోరెత్తింది.
     
 స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని చిన్నపెండ్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి మండల కేంద్రాల్లో విద్యార్ధులు నిర్వహించిన రాస్తారోకోలు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.  
     
 తొర్రూరులో న్యాయవాదులు దీక్షలు నిర్వహించారు. పాలకుర్తి, తొర్రూరు, రాయపర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్వీ, యూత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
     
 టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దుగ్గొండి మండలం గిర్నిబాయిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా ఇంచార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని తేల్చిచెప్పారు. నర్సంపేటలో న్యాయవాదుల ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు.
     
 ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం మండలాల్లో విద్యార్థులు, యువకులు, టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు అజ్మీరా చందూలాల్ పాల్గొన్నారు.
     
 రాయల తెలంగాణ ప్రతిపాదనపై పరకాలలో తెలంగాణవాదులు భగ్గుమన్నారు. భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిక్షపతి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలకు ఘోరీ కట్టాలని పిలుపునిచ్చారు. గీసుగొండ, ఆత్మకూరు మండలాల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు.
     
 డోర్నకల్, మరిపెడ, కురవి, నర్సింహులపేట మండలాల్లో విద్యార్థులు, టీఆర్‌ఎస్ యూత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. రాయల తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు.
     
 వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం, పర్వతగిరి, హసన్‌పర్తి, మడికొండల్లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. రాయలతెలంగాణని వ్యతిరేకిస్తూ వడుప్సా, టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టి మానవహారం ఏర్పాటు చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement