ఆశల సౌధం నుంచి.. ఆత్మహత్యల వైపు... | Students Suicides Rises Across India | Sakshi
Sakshi News home page

ఆశల సౌధం నుంచి.. ఆత్మహత్యల వైపు...

Published Mon, Feb 27 2023 2:02 AM | Last Updated on Mon, Feb 27 2023 11:48 AM

Students Suicides Rises Across India - Sakshi

►నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న మంచిర్యా­ల జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష (21) శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్ని పరీక్ష­ల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ తనువు చాలించాడు. 

►హైదరాబాద్‌ జీడిమెట్లకు చెందిన డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థిని దివ్య (21) శనివారం ఉరేసుకొని చనిపోయింది. కు­టుంబç­Üభ్యులతో కలసి సంజయ్‌గాంధీనగర్‌లో ఉండే దివ్య ఇంటి వెనుకాలే ఉరేసుకొని చనిపోవడం అందరినీ కలిచివేసింది.

►వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ధారావత్‌ ప్రీతి సీనియర్‌ వేధిస్తున్నాడంటూ ఈనెల 22న ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నం చేసింది. మృత్యువుతో పోరాడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఆదివారం రాత్రి కన్నుమూసింది. 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను అందుకోలేకపోతున్నామన్న ఒత్తిడి.. సీనియర్ల వేధింపులు.. ఆరోగ్య సమస్యలు.. కారణాలేవైతేనేం.. క్షణికావేశంలో విద్యార్థులు అనేక మంది ఆశల సౌధం నుంచి ఆత్మహత్యల ఒడిలోకి జారుతున్నారు. బంగారు భవిష్యత్‌ను బలి చేసుకుంటున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 1995 నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకు దేశవ్యాప్తంగా 1,88,229 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

మొత్తం ఆత్మహత్యల్లో గత 12 ఏళ్లలోనే 55.28% (1,04,053 మంది) విద్యార్థులు అసువులు బాశా రు. 2019లో మొత్తం జరిగిన 10,355 ఆత్మహత్యల్లో మహారాష్ట్రలో 1,487, మధ్యప్రదేశ్‌ (927), తమిళనాడు (914), కర్ణాటక (673), ఉత్తరప్రదేశ్‌ (603)లో కలిపి 44% మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఆత్మహత్యలు తక్కువగానే ఉన్నాయి.

రాష్ట్రంలో 2018లో 401 మంది, 2019లో 426, 2020లో 430, 2021లో 459 మంది ఐదో తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ వివరాలను 2022 డిసెంబర్‌లో విడుదల చేసిన నివేదికలో ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక 2021 ప్రకారం 
దేశ వ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రతికూల పరిస్థితులను తట్టుకొనేలా చూడాలి
ఆత్మహత్యల నివారణపై ఓ ఉద్యమం జరగాలి. ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకొనేలా నైతిక బలాన్ని, శక్తిని ఇవ్వడానికి ప్రయత్నించాలి. ప్రధానంగా విద్యార్థులు ఒత్తిళ్లకు దూరంగా చదువుకొనేలా చూడాలి. ప్రాథమిక విద్యలో పిల్లలు సెల్‌ఫోన్లకు అతుక్కోకుండా తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్లో మార్పులను గమనించాలి. ఏదైనా బాధలో ఉంటే సానుకూలంగా ఓదార్చాలి. అనారోగ్య సమస్యలు ఉంటే కౌన్సెలింగ్, చికిత్సలు లేకుండా నిరుత్సాహపరచకూడదు.
– డాక్టర్‌ బి.కేశవులు, మానసిక వైద్య నిపుణుడు

ఆత్మహత్య నిర్ణయం వద్దు..
ఏదైనా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన, నిర్ణయం తీసుకుంటే మానుకోవాలి. రెండు రోజుల తర్వాత కూడా అదే ఆలోచన ఉంటే దాని నుంచి బయటపడే మార్గం అన్వేషించాలి. ప్రతి సమస్యకూ పరిష్కార మార్గం ఉంటుంది. మనం చేయకపోతే ఇతరులు చేస్తారు. అంతే తప్ప నా జీవితం ఇంతే.. నాకు ఎప్పుడూ ఇంతే అనే భావాలను మనసులోకి రానివ్వొద్దు. ఎవరైనా ఒకే విషయాన్ని పదేపదే ఆలోచిస్తే వారిని ఆ విషయం నుంచి బయటకు తీసుకురావడానికి కౌన్సెలింగ్‌ అవసరం.
– ఏవీ రంగనాథ్, పోలీస్‌ కమిషనర్, వరంగల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement