
ఈ రైలూ ఎల్లిపోయె..!
శ్రీకాకుళం సిటీ:బడ్జెట్ రైలులో శ్రీకాకు ళం జిల్లాకు బెర్త్ దొరకలేదు.. ఆసలు ఆ రైలు జిల్లాలో ఎక్కడా ఆగనే లేదు. గత కొన్నేళ్లుగా జిల్లావాసులకు ఇదే అనుభవం ఎదురవుతున్నా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్‌కు ఏదేదో చేసేస్తామని కేంద్ర, రాష్ట్ర పాలకులు చేసిన ఆర్భాటంతో ఈసారి ఎంతోకొంత మేలు జరుగుతుందని జిల్లా ప్రజలు ఆశపడ్డారు. మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఈ ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లా ప్రజల అవసరాలు తీర్చే ఒక్క లైను గానీ, ఒక్క రైలుగానీ.. చివరికి బెర్తుల కోటా పెంపు, అదనపు హాల్టులు చిన్నపాటి కోర్కెలను సైతం తీర్చేందుకు రైల్వే మంత్రి ప్రయత్నించలేదు. ఈ బడ్జెట్‌లో జిల్లాకు కొంత సంబంధం ఉన్న అంశం ఒక్కటే కనిపించింది.
అదే కొత్తగా ప్రతిపాదించిన విశాఖ-పరదీప్ వీక్లీ రైలు. జిల్లా మీదుగా
ఇది ప్రయాణించినా వీక్లీ ఎక్స్‌ప్రెస్ అయినందున జిల్లాలో హాల్టులు ఉంటాయో లేదో తెలియదు. విభజన తర్వాత ఏర్పడిన కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రైల్వే వంటి కీలక రవాణా వ్యవస్థల్లో మరింత మెరుగైన సౌకర్యాలు, కొత్త ప్రాజెక్టులు అత్యావశ్యకం. శ్రీకాకుళం వంటి వెనుకబడిన జిల్లాలో రైల్వే సౌకర్యాలు మెరుగుపడితే పారిశ్రామికం గా అభివృద్ధి చెందే అవకా శం కూడా ఉం టుంది. అయి తే రైల్వే మం త్రి ఈ విష యం పట్టించుకోలేదు. మన జిల్లా, రాష్ట్ర ప్రజాప్రతినిధుల నిర్లిప్తత కూడా ఈ నిర్లక్ష్యానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నెరవేరని డిమాండ్లు
రైల్వేల పరంగా జిల్లా నుంచి ఎన్నో డిమాండ్లు.. మరెన్నో ప్రతిపాదనలు ఏళ్ల తరబడి ఫైళ్లలో మగ్గిపోతున్నాయి. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న మత్య్సకారులు ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి ఉపాధి కోసం వెళ్తుంటారు. అలాగే ఒడిశా సరిహద్దులో ఉన్న ఆంధ్ర ప్రాంతాల నుంచి రాయ్‌పూర్, భిలాయ్, తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. జిల్లా నుంచి ఈ ప్రాంతాలకు నేరుగా రైలు సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. శ్రీకాకుళం-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-పలాస ఈఎంయు ఇచ్ఛాపురం వరకు పొడిగింపు, పలాస-రాయగడ రైళ్లు వేయాలన్న డిమాండ్ ఉంది. కోణార్క్, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైళ్లకు నౌపడ జంక్షన్‌లో హాల్ట్ ఇవ్వాలని స్థానికులు చాలా కాలంగా కోరుతున్నారు. ఇక జిల్లా మీదుగా నడుస్తున్న షిర్డీ-హౌరా, చెన్నై- షాలీమార్, తిరుపతి- సంత్రగచ్చి, చెన్నై- గువహతి, విశాఖ-దిఘా, విల్లుపురం-ఖరగ్‌పూర్, పాండిచ్చేరి- హౌరా, రామేశ్వరం-భువనేశ్వర్, హౌరామైసూర్ తదితర 9 రైళ్ల కు ఎక్కడా హాల్ట్‌లు లేవు. ఈ రైళ్లను ఆమదాలవలస, పలాసల్లో నిలపాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గత ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన గుణుపూర్-విశాఖపట్నం పాసింజర్ రైలు ఇంతవరకు ప్రారంభానికే నోచుకోలేదు.
కలగానే రాజాం లైను
పారిశ్రామిక పట్టణంగా పేరున్న రాజాంకు ప్రధాన రైల్వేలైనుతో కలిపేలా.. పొందూరు నుంచి రైల్వే లైను వేయాలన్న ప్రతిపాదన కలగానే మిగిలిపోతోంది. 2011-12 బడ్జెట్‌లో ఈ లైను ఏర్పాటుపై సర్వే చేస్తామని ప్రస్తావించారు. అయితే ఇంతవరకు ఒక్క పైసా కూడా విదల్చలేదు సరికదా.. కొత్త బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. ఈ లైను నిర్మిస్తే శ్రీకాకుళం, విజ యనగరం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం స్టేష న్లను ఆదర్శ స్టేషన్లుగా తీర్చిదిద్దుతామని గత బడ్జెట్‌లో ప్రకటిం చినా.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది.
ప్రత్యేక కమిటీయే తారకమంత్రమా?
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెండింగు ప్రాజెక్టుల పూర్తికి, కొత్త ప్రాజెక్టుల మంజూరుకు ప్రత్యేక కమిటీ వేశామని చెప్పి రైల్వే మంత్రి చేతులు దులుపుకొన్నారు. అన్నింటికీ అదే తారక మంత్రం అన్న ట్లు ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయా లు తీసుకుంటామని తేల్చేశారు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు మేలు చేకూర్చే విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటు, కొత్త రైళ్లు, ఇతర ప్రాజెక్టుల మంజూరీలన్నీ ఆ కమిటీ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడ్డాయన్నది స్పష్టమైపోయింది.
మొండి చెయ్యి చూపారు
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఈ బడ్జెట్‌లో ప్రకటిస్తారని ఆశించిన ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వే మంత్రి అసంతృప్తి మిగిల్చారు. కొత్త రైళ్లు, ప్రాజెక్టుల విషయంలోనూ మొండి చెయ్యి చూపారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తామని నమ్మబలి కి, ఇప్పుడు మోసం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు, విశాఖ, శ్రీకాకుళం ఎంపీలు ఈ విషయంలో విఫలమయ్యారు. విశాఖ రైల్వే జోన్‌తోపాటు పలు రైల్వే ప్రాజెక్టుల సాధనకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. -ఎం.వి.ఎస్.శర్మ, ఎమ్మెల్సీ