17న రైల్వే సేవలకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టికెట్ రిజర్వేషన్, టికెట్ల రద్దు, 139 నంబర్ ద్వారా విచారణ... తదితర కార్యకలాపాలు ఈనెల 17న (ఆదివారం) ఏడు గంటల పాటు నిలిచిపోనున్నాయి. సాంకేతికపరంగా అనుకోని అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయాలు ఏమేరకు పనిచేస్తాయో తెలుసుకునే క్రమంలో రైల్వే అధికారులు ఈ సేవలను నిలుపు చేయబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (పీఆర్‌ఎస్)ను నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు.
‘డిజాస్టర్ రికవరీ డ్రిల్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పీఆర్‌ఎస్ ప్రధాన సర్వర్ చెన్నైలో ఉంది. దాని ఆధారంగానే దక్షిణ మధ్య రైల్వేలో ఈ-టికెటింగ్, రైల్వే చార్టుల తయారీ, టికెట్ల రద్దు, టికెట్ మొత్తం చెల్లింపు, 139 నంబర్ ద్వారా విచారణ.. తదితరాలన్నీ జరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మరో వ్యవస్థ కూడా దక్షిణ మధ్య రైల్వేకు అందుబాటులో ఉంది. ఏదైనా భారీ సాంకేతిక సమస్య తలెత్తి చెన్నై సర్వర్ సేవలు నిలిచిపోతే, ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏ మేరకు పనిచేస్తుందో పరిశీలించాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా చెన్నై సర్వర్‌ను షట్ డౌన్ చేయనున్నారు.
ప్రత్యామ్నాయ వ్యవస్థలో లోపాలున్నట్టు తేలితే వెంటనే దాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ఆదివారం డ్రిల్ నిర్వహిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా అందే సేవలు నిలిచిపోయినా... రైల్వే స్టేషన్‌లలో మాన్యువల్ కౌంటర్ల ద్వారా టికెట్ల జారీ కొనసాగుతుందని, అవసరమైన చోట్ల అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. టికెట్ల రద్దు, డబ్బులు తిరిగి ఇవ్వటం లాంటివి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే క్రమంలోనే ఇది జరుగుతున్నందున దీనికి సహకరించాలని కోరారు.