
రైల్‌రోకో 11కి వాయిదా
సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంత నేతలు నిర్వహించ తలపెట్టిన రైల్‌రోకో వాయిదా పడింది. రంజాన్ నేపథ్యంలో తమ కార్యాచరణలో పలు మార్పులు చేసినట్లు సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ వెల్లడించింది. రాష్ట్ర విభజన నిరసన ఉద్యమాల కార్యాచరణ ప్రణాళికపై గురువారమిక్కడ సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో జేఏసీ గౌరవాధ్యక్షుడు పి.నరసింహారావు, కన్వీనర్ ఎన్.శామ్యూల్, జేఏసీ జిల్లా కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులుతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, రాతంశెట్టి రామాంజనేయులు, పోలూరి వెంకటరెడ్డి, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, టీడీపీ తరఫున ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కాంగ్రెస్ నేత రాయపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశం పది తీర్మానాలు చేసింది.
- సీమాంధ్రకు ప్యాకేజీలు అవసరంలేదు. రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలి
- రాజకీయ నాయకులు రాజీనామాలు చేసి జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకోవాలి
- చట్టబద్ధత లేని ‘ఆంటోనీ’ కమిటీని గుర్తించడంలేదని.. ఆ కమిటీని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయం
- మండల, నియోజకవర్గాలు, గ్రామాల వారీగా జేఏసీలు ఏర్పాటు చేయాలి
- ఈ నెల పదో తేదీ నుంచి గుంటూరు మార్కెట్ సెంటర్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలి
- 11న రైల్‌రోకోలు
- 12న విద్యార్థులతో భారీ ర్యాలీలు
- 13న గుంటూరు జిల్లావ్యాప్త బంద్, నిరసన ర్యాలీలు
- కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఆంటోనీ కమిటీని బహిష్కరించాలి
- అన్ని రాజకీయపార్టీలు కలసి ఉద్యమానికి మద్దతు పలకాలి