రాజంపేట, న్యూస్‌లైన్: రైల్వే బడ్జెట్ విషయంలో జిల్లాకు మళ్లీ మొండి చెయ్యే ఎదురైంది. మాటలను కోటలు దాటించే రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి హామీలు నీటిమూటలే అయ్యాయి. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రాయలసీమ నుంచి ప్రాతనిథ్యం వహిస్తుండటంతో బడ్జెట్ విషయంలో జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. రైల్వేశాఖా మంత్రి మల్లికార్జున ఖర్గే గందరగోళం మధ్య బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు కనీస న్యాయం జరగలేదు. కాచిగూడ- తిరుపతి డబుల్‌డెక్కర్ రైలును బైవీక్లీగా జిల్లా మీదుగా నడిపించనున్నారు.
అలాగే కాచిగూడ-నాగర్‌కోయిల్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్, ముంబై-చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ జిల్లా మీదుగా నడవనున్నది. బడ్జెట్‌లో నందలూరు రైల్వేపరిశ్రమ ఊసేఎత్తలేదు. కొత్త మార్గాల గురించి కానీ.. ప్రతిపాదనలో ఉన్న పొడిగింపు రైళ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన రైళ్లు ఇంకా పట్టాలెక్కలేదు. కాచిగూడ- మంగళూరు, చెన్నై-నాగర్‌సోల్, బనగానపల్లె-ఎర్రగుంట్ల రైళ్లు బడ్జెట్ కాగితాల్లోనే ఉండిపోయాయి. కడప-బెంగళూరు, కృష్ణపట్నం-ఓబులవారిపల్లె, ఎర్రగుంట్ల-నంద్యాల రైలుమార్గాలకు మళ్లీ అరకొర నిధులే కేటాయించారు. దీంతో ఈ రైలు మార్గాల నిర్మాణం ఏళ్ల తరబడి కొనసాగుతునే ఉంది.
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మళ్లీ మొండిచేయి
Published Thu, Feb 13 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement