రైల్వే బడ్జెట్‌కు కసరత్తు
సాక్షి, కరీంనగర్ : రైల్వేరంగానికి సంబంధించి ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతున్నప్పటికీ జిల్లాలో మాత్రం ప్రగతి కనిపించడంలేదు. జిల్లా మీదుగా కన్యాకుమారి, న్యూఢిల్లీ రైలుమార్గం వెళ్తున్నా జిల్లాకేంద్రానికి, రాష్ట్ర రాజధానికి మధ్య రైలు మార్గం లేదు. ప్రతిసారీ ఎంపీలు ఇస్తున్న ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో ఆమోదం పొందటంలేదు. కొత్తమార్గాలకు సంబంధించిన ప్రతిపాదనలు సర్వేల దశ దాటడం ఆమోదం పొందటంలేదు. కొత్తమార్గాలకు సంబంధించిన ప్రతిపాదనలు సర్వేల దశ దాటడంలేదు.
ప్రధాన రైల్వేస్టేషన్లలోనూ కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావడంలేదు. రెండు దశాబ్దాలు గడిచినా పెద్దపల్లి రైలు మార్గం గమ్యానికి చేరుకోలేకపోయింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్, కరీంనగర్ నుంచి హసన్‌పర్తి, రామగుండం నుంచి మణుగూరు లైన్ల కోసం ప్రతి బడ్జెట్‌కు ముందు ప్రజాప్రతినిధులు విన్నవిస్తున్నారు. కొత్తపల్లి- మనోహరాబాద్ లైను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటినుంచి కోరుతున్నా ఫలితం లేదు. నిజామాబాద్ రైలు మార్గాన్ని త్వరితంగా పూర్తి చేయాలని ముగ్గురు ఎంపీలు ప్రతిసారీ రైల్వేశాఖ మంత్రులను కలిసి కోరుతున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎంపీలు చేస్తున్న కొత్త ప్రతిపాదనలు రైల్వేశాఖకు గణనీయమైన ఆదాయం సమకూర్చిపెట్టేవే అయినా, వీటిని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.
2010లో ఎంపి వివేక్ మణుగూరు ప్రతిపాదనను రైల్వేమంత్రి దృష్టికి తీసుకుపోగా సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా ఇదే తంతు సాగుతుంది. స్వయానా ప్రధాని శంకుస్థాపన చేసిన పెద్దపల్లి, నిజామాబాద్ రైలుమార్గం పూర్తికాలేదు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వరకు పనులు పూర్తయినా అక్కడ నుంచి ముందుకు సాగడంలేదు. మొత్తం 178 కిలోమీటర్లున్న ఈ మార్గం జిల్లాలో 122 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 56 కిలోమీటర్ల పొడవుంది. తీవ్ర జాప్యం వల్ల అంచనా వ్యయం రెట్టింపయ్యింది. ఇప్పటికే 560 కోట్లు ఖర్చు చేయగా మరో 385 కోట్లు అవసరమని అంచనా వేశారు. భూసేకరణలో ఇబ్బందులతో పాటు సకాలంలో నిధులు అందక అలస్యమవుతుంది. ఈ ఏడాదయినా రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ప్రాధాన్యం దక్కేలా ఎంపీలు ప్రయత్నించాలని భావిస్తున్నారు.