- పుష్కరాలను పట్టించుకోని రైల్వే శాఖ
- తరుముకొస్తున్న గడువు
- పట్టించుకోని ఎంపీలు
నరసాపురం అర్బన్ : గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది అంచనాలకు మించి భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడం కలవరపెడుతోంది. పుష్కరాలు సమీపిస్తున్నా రైల్వే శాఖలో అధికారుల్లో ఇంతవరకూ చలనం కనిపించడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఇబ్బంది కలగకుండా రైల్వే శాఖ ఏం చేయబోతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని ఎంపీల తీరు కూడా అదే చందంగా ఉంది. పుష్కర స్నానాలు ఆచరించేందుకు జిల్లాలోని కొవ్వూరు తరువాత నరసాపురం పట్టణానికి యాత్రికులు పెద్దసంఖ్యలో తరలివస్తారు.
కొవ్వూరు, నరసాపురం, పోలవరం, తాళ్లపూడి, పెనుగొండ, ఆచంట, యలమంచిలి మండలాల్లో పుష్కర స్నాన ఘట్టాలున్నాయి. ఈ ప్రాంతాలకు భక్తులు చేరుకోవాలంటే నిడదవోలు, కొవ్వూ రు, పాలకొల్లు, నరసాపురం ప్రాం తాలు ముఖ్యమైనవి. ఇంత ప్రాముఖ్యత గల ైరె ల్వే స్టేషన్లలో సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. సాధారణ రోజుల్లోనే అరకొర వసతులతో నెట్టుకొస్తున్న ఈ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుష్కర పర్వంలో అసంఖ్యాకంగా వచ్చే భక్తులకు ఇప్పుడున్న సౌకర్యాలను నాలుగైదు రెట్లు పెంచితేనే గాని సరిపోని పరిస్థితి. ఈ విషయంలో రైల్వే శాఖ ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తోంది. ఇతర శాఖల పుష్కరాల నేపథ్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, యాత్రికులకు సౌకర్యాల కోసం నిధులు మంజూరయ్యాయని, పనులు ప్రారంభిస్తున్నామని ప్రకటనలైనా ఇస్తున్నాయి. రైల్వే శాఖ నుంచి పుష్కరాలపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. మూడు నెలల క్రితం జిల్లాలోని వివిధ రైల్వే స్టేషన్లను పరిశీలించేందుకు వచ్చిన రైల్వే డీఆర్‌ఎం పుష్కరాల నేపథ్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తామని ప్రకటించారు. ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
అన్నీ సమస్యలే..
మెయిన్‌లైన్, బ్రాంచ్ లైన్లకు సంధానకర్తగా ఉన్న నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్‌లో సమస్యలు కూత పెడుతున్నాయి. జిల్లాలో ఇది కీలకమైన రైల్వే స్టేషన్. నిత్యం ఈ స్టేషన్ మీదుగా 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్‌లో విశ్రాంతి భవనం, టాయ్‌లెట్స్, మంచినీటి సదుపాయాలు అరకొరగా ఉన్నాయి. పుష్కరాల నేపథ్యంలో వీటి సంఖ్యను మూడు రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. స్టేషన్‌లో పార్కింగ్ సదుపాయం అంతంత మాత్రంగానే ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తామని ఎంతోకాలంగా రైల్వే శాఖ ఊరిస్తూ వస్తోంది. కొవ్వూరు రైల్వే స్టేషన్‌కు సంబంధించి ఒక ప్లాట్‌ఫామ్‌పై ఆరు, మరో ఫ్లాట్‌ఫాంపై మూడు టాయ్‌లెట్స్ ఉన్నా యి. స్టేషన్‌లో ఉన్న ఏకైక విశ్రాంతి భవనం మూతపడింది. స్టేషన్‌లో అదనంగా షెడ్లు, టాయ్‌లెట్స్, మంచినీటి వసతి కల్పించాల్సి ఉంది. ప్రతిరోజు ఈ స్టేషన్ నుంచి 40 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. పుష్కరాలకు జిల్లాలో కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేస్తారు.
నరసాపురం రైల్వేస్టేషన్ ఒక విధంగా జిల్లాలోనే పెద్దది. విజయవాడ తర్వాత కోచ్‌ల నిర్వహణ ఈ స్టేషన్‌లోనే జరుగుతుంది. అభివృద్ది విషయంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. స్టేషన్‌లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ఏడాది క్రితం నిర్మించిన టాయిలెట్స్ పనిచేయడం లేదు. పుష్కరాల నాటికి అదనంగా మరో రెండు టాయిలెట్స్ నిర్మించాల్సి ఉంది. ప్రతిరోజూ స్టేషన్‌లో 300కు పైగా రిజర్వేషన్‌లు జరుగుతుంటాయి. సింగిల్ రిజర్వేషన్ కౌంటర్ మాత్రమే పని చేస్తోంది. మంచినీటి సౌకర్యానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టేషన్‌లో మరో ప్రధాన సమస్య ఫిట్‌లైన్ విస్తరణ. ఇది చివరి స్టేషన్ కావటం వల్ల ఫిట్‌లైన్ విస్తరణ జరగకపోవడంతో రైళ్లను ట్రాక్ మీదకు తీసుకొచ్చేందుకు గంటల తరబడి షంటిగ్ చేయాల్సి వస్తోంది. ఫిట్‌లైన్ విస్తరణ చేయకపోతే ఇక్కడి నుంచి కొత్త రైళ్లు గానీ, తాత్కాలికంగా రైలు సర్వీస్‌లను పెంచడంగానీ కుదరదు. ఈ సమస్యలపై రైల్వేశాఖ నోరు మెదపటం లేదు.
పట్టించుకోని ఎంపీలు
రాజమండ్రికి సంబంధించి అక్కడి ఎంపీ మాగంటి మురళీమోహన్ రైల్వేశాఖ ద్వారా పుష్కర అబివృద్ధి పనులు చేయించుకోవడంలో మొదటి నుంచీ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచే రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకువచ్చి భారీగా నిధులు రప్పించడంలో విజయవంతమయ్యారు. ఇప్పటికే రాజమండ్రి రైల్వే అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం కాగా, కొన్ని పనులు కూడా ప్రారంభమయ్యాయి. మన జిల్లా ఎంపీలు ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే జిల్లాలో రైల్వే శాఖ ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఈ వారంలో విజయవాడలో కీలక సమావేశం జరగనుందని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ సమావేశంలో అయినా జిల్లాలో రైల్వేశాఖ ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఓ ప్రణాళిక రూపొందే దిశగా జిల్లాలోని ఎంపీలు కృషి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
రైల్వే.. వెవ్వే..
Published Wed, Feb 11 2015 5:42 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM
Advertisement