రైల్వే స్టేషన్ టు సీఐ హౌస్
► పార్కింగ్‌లో ఉంచిన బైక్ నేరుగా సీఐ ఇంటికి
► బండిని దర్జాగా వాడుకుంటున్న సీఐ
► బాధితుని ద్వారా విషయం వెలుగులోకి
ఆదోని(కర్నూలు): రూల్ అమలు చేసేది తామే కదా.. ఎవరేం చేస్తారనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆదోని టూ టౌన్ సీఐ గంటా సుబ్బారావు స్థానిక రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో ఉంచిన బైక్‌ను ఏకంగా తన ఇంటికి తరలించారు. అంతేనా దానికి పోలీస్æ స్కిక్కర్ అతికించి మరీ దర్జాగా వినియోగించుకుంటున్నా రు. బాధితుని ద్వారా విషయం సోమవారం మీడియాకు తెలియడంతో హడావుడిగా బైక్‌పై ఉన్న పోలీస్ స్టిక్కర్ తీయించేసి దాంతో సంబంధం లేదని బుకాయించారు. ఇందుకు సంబంధించి బాధితుడు బోయ నరేష్ అందించిన వివరాల మేరకు.. ఆదోని బోయ గేరికి చెందిన బోయ నరేష్ మే నెల చివరి వారంలో తన మిత్రుడు ప్రకాష్‌తో కలిసి చెన్నై వెళ్లాడు.
ఈ సమయంలో తన హీరో హొండా బైక్(ఏపీ 21 ఎఎ 0622)ను రైల్వే స్టేషన్ స్టాండ్‌లో పార్కింగ్ చేసి వెళ్లాడు. పక్షం రోజుల తర్వాత తిరిగొచ్చి న నరేష్ బైక్ కోసం స్టాండు నిర్వాహకుడిని ఆరా తీశాడు. చాలా రోజులుగా స్టాండ్‌లోనే ఉండడంతో టూటౌన్ పోలీసులకు అప్పగించినట్లు తెలుసుకుని బైక్‌ను తీసుకెళ్లిన కానిస్టేబుల్ సింగ్‌తో మాట్లాడగా సీఐని కలవాలని సూచించా రు. ఈ మేరకు అతడు సీఐ గంటా సుబ్బారావును కలిసి ఫిర్యాదు చేయగా పొంతనలేని ప్రశ్నలతో పదేపదే తిప్పించుకోవడంతో అనుమానం వచ్చిన నరేష్ నెల తర్వాత అతని ఇంటికి వెళ్లి చూడగా బైక్ కనిపించింది. విషయాన్ని మీడియాతోపాటు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే సీఐ సదరు బైక్‌పై అంటించిన పోలీస్ స్టిక్కర్‌ను తీయించి ఇంటి నుంచి స్టేషన్‌కు తెప్పించారు.
మూడు రోజుల క్రితమే నా వద్దకు వచ్చాడు
బైక్ పోయిందంటూ నరేష్ నా వద్దకు మూడు రోజుల క్రితం వచ్చాడు. అయితే ఆ బైక్ కర్నూలుకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి పేరుపై ఉండడంతో రికార్డులు తీసుకురమ్మన్నాను. పర్చేజింగ్ డీడ్ ఉందని చూపించగా ఒరిజినల్స్ చూపించాలని చెప్పాను. తెస్తే పరిశీలించి బైక్ అప్పగిద్దామనుకున్నా. ఆలోగా ఇలా జరిగింది. (బైక్ ఎక్కడుందని విలేకరులు ప్రశ్నించగా ఎక్కడో ఒక చోట ఉంటుందిలే అంటూ బయటకు వెళ్లిపోయారు). – గంటా సుబ్బారావు, సీఐ
వాస్తవమైతే చర్యలు తప్పవు...
బైక్‌ను ఇంట్లో పెట్టుకోవడం, సొంత అవసరాలకు వాడుకోవడం సరికాదు. బండి యజమాని ఎవరో తెలియకపోతే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. బాధితుడు సంప్రదిస్తే రికార్డులు పరిశీలించి, అవసరమైతే కేసు నమోదు చేసి న్యాయం చేయాలి. అయితే సీఐ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారనే ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ చేస్తాం. వాస్తవమని తేలితే చట్టపరమైన చర్యలకు ఎస్పీకి సిఫారసు చేస్తాం. కేసు నమోదు చేసి విచారించిన తరువాత బాధితుడికి బైక్ అప్పగిస్తాం. – కొల్లి శ్రీనివాసరావు, ఆదోని డీఎస్పీ