మంత్రుల చాంబర్లలోకి మళ్లీ వాన! | Rain again into the Ministers chamber | Sakshi
Sakshi News home page

మంత్రుల చాంబర్లలోకి మళ్లీ వాన!

Published Tue, Aug 21 2018 3:04 AM | Last Updated on Tue, Aug 21 2018 3:04 AM

Rain again into the Ministers chamber - Sakshi

మంత్రి చాంబర్‌లో ఊడి పడ్డ సీలింగ్‌ , మంత్రి గంటా చాంబర్‌లో కారిన వర్షపు నీరు

సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ప్రపంచం గర్వించే రీతిలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించామని చెబుతున్న సీఎం చంద్రబాబు మాటల్లోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని మంత్రుల బ్లాకులు చిల్లులు పడ్డ కుండల్లా కారాయి. సోమవారం పలువురు మంత్రుల బ్లాకుల్లో సీలింగ్‌ ఊడి పడడంతో వాన నీటికి ఫర్నీచర్‌ తడిసిపోయింది. తాత్కాలిక సచివాలయంలోని 4, 5వ బ్లాకుల్లో ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్‌రెడ్డి, దేవినేని ఉమ చాంబర్‌లలో సీలింగ్‌ ఊడిపడటంతోపాటు ఏసీల్లోకి వర్షపు నీరు చేరింది. సీలింగ్‌ నుంచి వర్షపు నీరు కారడంతో సిబ్బంది విధులకు ఆటంకం ఏర్పడింది. హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది ఆగమేఘాల మీద పేషీల్లోని నీటిని తొలగించారు. అసెంబ్లీ భవనంలోనూ పలు చోట్ల సీలింగ్‌ ఊడిపోయి వర్షపు నీరు చేరుతోంది.

వర్షం కురిస్తే కారడమే...
అతి తక్కువ వ్యవధిలో అసెంబ్లీ, సెక్రటేరియట్‌ నిర్మించి రికార్డు సృష్టించామని సీఎం చంద్రబాబు, మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ తరచూ గొప్పలు చెబుతూ వస్తున్నారు. అయితే వర్షం పడిన ప్రతిసారీ సచివాలయంలోని బ్లాకులు ధారాళంగా లీకేజీ కావడం నిర్మాణాల్లోని డొల్లతనాన్ని రుజువు చేస్తోంది. రూ. వందల కోట్లతో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలు నీరుగారడంపై అధికారులు పెదవి విరుస్తున్నారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా నిర్మాణాలు చేపట్టిన సంస్థపై సర్కారు చర్యలు చేపట్టకుండా ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగడం గమనార్హం. 

గతేడాది ప్రతిపక్షనేత చాంబర్‌లోకి వాన నీళ్లు..
2017 జూన్‌లో కురిసిన వర్షాలకు సచివాలయం నిర్మాణంలోని డొల్లతనం మొదటిసారిగా బయటపడింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కేటాయించిన చాంబర్‌లోకి లీకేజీ వల్ల ధారాళంగా నీరు చేరింది. చాంబర్‌లో సీలింగ్‌ ఊడిపడడంతో ఫర్నీచర్, ఫైళ్లు తడిసిముద్దయ్యాయి. ఏసీ, రూఫ్‌ లైట్ల నుంచి వర్షపు నీరు కారడంతో సిబ్బంది బకెట్లతో తోడారు. ఈ ఘటన తర్వాత నిర్మాణాల్లో లోపాలపై సమగ్రంగా విచారిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఆ విషయాన్ని గాలికొదిలేసింది. 

మొదటి నుంచి అనుమానాలే...
తాత్కాలిక సచివాలయం పనులు ప్రారంభమైన నాటి నుంచి నిర్మాణంలో లోపాలపై నిపుణులు సందేహాలు వెలిబుచ్చుతూనే ఉన్నారు. నల్లరేగడి భూమిలో నిర్మాణాలు చేపట్టాలంటే పునాదులు పట్టిష్టంగా ఉండాలని గట్టిగా సూచించారు. ఎంత హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో వర్షం పడిన ప్రతిసారీ సచివాలయంలో ఏదో ఒక బ్లాక్‌ కారుతోంది. తాత్కాలిక సచివాలయం ఆవరణలో వర్షపు నీరు భారీగా నిల్వ ఉంటోంది.

కమీషన్ల దాహంతోనే లీకులు...
సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఒక్కో చదరపు అడుగుకు తొలుత రూ. మూడు వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం తర్వాత వివిధ కారణాలు చూపిస్తూ ఈ మొత్తాన్ని నాలుగు రెట్లకు పెంచింది. చదరపు అడుగుకు రూ.10 వేలకు పైగా ఖర్చుతో చేపట్టిన భవనాలు చిన్న వర్షానికే కారుతుండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై, కేరళలలో మాదిరిగా కుండపోత వర్షం పడితే తాత్కాలిక సచివాలయం భవనాల పరిస్థితిని తలుచుకుంటేనే భయమేస్తోందని రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ల కోసం నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం భారీగా పెంచినట్లు చేస్తున్న ఆరోపణలకు ప్రస్తుత సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం పాటించకుండా, ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడంతో తరచూ చాంబర్లు కారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement