ముంచెత్తిన మునేరు
- ఒక్కసారిగా వచ్చిపడ్డ వరద నీరు
- లంకల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు, 38 గొర్రెలు
- సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు
- మునేరు గేట్లు ఎత్తివేత
నందిగామ రూరల్/ పెనుగంచిప్రోలు/ వత్సవాయి : తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ కృష్ణలోని మునేరు వాగు ఉగ్రరూపం దాల్చి లంకలను ముంచెత్తింది. శనివారం ఉదయం ఒక్కసారిగా వచ్చి పడిన వరద నీరు సమీప ప్రాంత వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నందిగామ మండలం రాఘవాపురం సమీపంలో మునేటి మధ్యలోనున్న లంకలో చిక్కుకుపోయిన ముగ్గురు గొర్రెల కాపర్లు, 38 గొర్రెలను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు తీసు కొచ్చారు.
అలాగే పశువులను మేపడానికి వెళ్లి లంకలో చిక్కుకున్న కంచికచర్ల మండలంలోని మోగులూరుకు చెందిన దున్నా జాన్ అనే వ్యక్తిని స్థానిక అధికారులు నాటుపడవ సాయంతో రక్షించారు. వరద ప్రవాహానికి పెనుగంచి ప్రోలులోని శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద మునేరులో వ్యాపారులు వేసుకున్న పాకలు కొట్టుకుపోయాయి. మునేరు కాజ్‌వే వద్ద వరద నీరు దాదాపు 8 అడుగుల పైన ప్రవహిస్తోంది. వరదనీరు ఎక్కువ కావడంతో వత్సవాయి మండల పరిధిలో ఉన్న మునేరు కాలువ గేట్లను ఎత్తివేశారు.
గొర్రెల కాపర్లు సురక్షితం...
నందిగామ మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన మంచ్యాల వెంకటేశ్వరరావు, మంచ్యాల పవన్, యరగొర్ల శ్రీను తెల్లవారు జామున 4.40గంటలకు 38 గొర్రెలు, మేకలు వాటి పిల్లలను నందిగామలో జరిగే సంతలో విక్రయించేందుకు మునేటి మార్గం ద్వారా కాలినడకన బయల్దేరారు. మునేటిలో కొంత దూరం వచ్చిన తరువాత ఒకేసారి సుమారు 5అడుగుల ఎత్తున మునేరుకు వరద నీరు వచ్చింది. దీంతో వారు సమీపంలోని లంక వద్దకు చేరుకుని బంధువులకు సమాచారమిచ్చారు.
స్థానిక అధికారులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు డీఎస్‌పీ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది సహాయంతో ఎయిర్‌బోట్ ద్వారా వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకు రాగలిగారు. అయితే మునేరులో వరదనీరు తాగడం వల్ల 38 గొర్రెలలో రెండు మృతి చెందాయి. కాగా మునేరుకు వరద నీటిని కాలువలకు వదలడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, కూలీలు పొలాల బాట పట్టారు. నందిగామ తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావు, సీఐ భాస్కరరావు, ఎస్‌ఐ ఏసుబాబు, ఫైర్ ఆఫీసర్ క్రాంతికుమార్ సహాయక చర్యలు పూర్తయ్యేంతవరకు మునేటి వద్దే ఉండి పర్యవేక్షించారు.
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సందర్శన...
రాఘవాపురం సమీపంలో మునేటి లంక వద్ద వరద నీటిలో గొర్రెలు, మేకలతో పాటు వాటి యజమానులు చిక్కుకున్నారనే సమాచారం తెలియగానే వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు రాఘవాపురం గ్రామానికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కాలికి బలమైన గాయాలైనప్పటికీ ఆపదలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు చాలా సేపు మునేటి వద్దే ఉండిపోయారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు పెసరమల్లి సురేష్, మంచ్యాల చంద్రశేఖర్, రామకృష్ణ, పరిమికిషోర్ ఉన్నారు.