'రాజా రవీంద్ర అతిగా మద్యం సేవించారు'
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో శనివారం రాత్రి పట్టుబడిన సినీనటుడు రాజా రవీంద్ర మోతాదుకు మించి మద్యం సేవించినట్టు పోలీసులు తెలిపారు. తాము పరీక్షించినప్పుడు అతడి రక్తంలో ఆల్కహాల్ శాతం(బీఏసీ) నాలుగింతలు అధికంగా ఉందని వెల్లడించారు. అనుమతించిన దానికంటే ఆల్కహాల్ శాతం అధికంగా ఉండడం వల్లే అతడిపై కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. రాజా రవీంద్ర బీఏసీ 113ఎంజీ/100ఎమ్ఎల్ గా ఉందని పేర్కొన్నారు. సాధారణంగా బీఏసీ 30ఎంజీ/100ఎమ్ఎల్ వరకు అనుమతిస్తారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రాజా రవీంద్ర శనివారం రాత్రి 11.30 గంటలకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు. ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్ వైపు నలుపు రంగు స్కోడా కారులో (ఏపీ 20ఏపీ 1111) ప్రయాణిస్తున్న రాజా రవీంద్రను కూడా ఆపి పరీక్షించగా, ఆయన మద్యం సేవించినట్లు తేలింది. పోలీసులు ఆయన కారును స్వాధీనం చేసుకుని, ఆయనపై కేసు నమోదు చేశారు.