రాజమండ్రి : రాజమండ్రిలో రెండతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నిన్న రాత్రి పట్టణంలోని నూనెకొట్టు వీధిలో ఓ భవనం కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య రెండుకు పెరిగింది. శిథిలాల కింద ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు చిక్కుకోవటంతో వారిని శిథిలాల నుంచి సురక్షితంగా వెలికి తీశారు. అయితే వారిలో కుటుంబ యజమాని ఆకుల ఆంజనేయులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి చనిపోయిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం జశ్వంత్ (2) చికిత్స పొందుతు మృతి చెందాడు.
సహాయక చర్యలు ఈ రోజు తెల్లవారుజాము 3.30గంటల వరకూ కొనసాగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆకుల ఆంజనేయులు భార్య వెంకటరత్నం ప్రస్తుతం ఆస్పత్రికలో చికిత్స పొందుతోంది. వారి కుమారుడు హనుమాన్, అతని భార్య విజయలక్ష్మి, మనుమడు భార్గవ్(4), సురక్షితంగా ఉన్నారు. కాగా ఈ ప్రమాదం నుంచి వాచ్మెన్ సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. భవనం కూలుతుండగా వాచ్మెన్ భయంతో బయటకు పరుగులు తీసినట్లు తెలిపారు.
ఈ రెండతస్తుల భవనాన్ని పదేళ్ల క్రితం నిర్మించారు. అయితే దీని పక్కన ఖాళీస్థలంలో కొత్తగా ఇల్లు నిర్మించేందుకు గొయ్యి తవ్వడంతో భవనం ఆవైపు కూలిపోయింది. అందుకు అనుమతి ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే బిల్డర్పై కేసు నమోదు చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించామని, అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.