కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : అది పదమూడేళ్ల క్రితం నిర్మించిన భవనం. అయితే కాసులకు కక్కుర్తిపడిన టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చిన అనుమతితో దాని పక్కనే సెల్లార్ కోసం తీసిన గొయ్యే ఆభవనం కూలడానికి కారణమైంది. స్థానిక మొయిన్ రోడ్డులోని నాళం భీమరాజు వీధి నూనెకొట్లు వీధిలోని మూడు అంతస్తుల భవనం బుధవారం అర్ధరాత్రి కూలిపోవడానికి పక్కనే సెల్లార్ నిర్మాణం కారణమని తేలింది. కూలిన భవనం పక్కన బిల్డర్ కోడూరి శాంతారామ్ భవన నిర్మాణంలో భాగంగా సెల్లార్ నిర్మించేందుకు 18 అడుగుల లోతున గొయ్యి తవ్వించారు. దాంతో పక్కనున్న భవనం కూలి శిథిలాల కింద ఆరుగురు చిక్కుకుపోయారు. వారిని అతి కష్టం మీద బయటకు తీయగలిగారు. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు.
మూడు గంటల పాటు నరక యాతన
గాఢ నిద్రలో ఉన్న వారు ఒక్క సారిగా భవనం కూలి శిధిలాల క్రింద చిక్కుకొని మూడు గంటల పాటు నరక యాతన అనుభవించారు. అర్ధరాత్రి భవనం కూలిపోవడంతో శిథిలాల కింద బాధితులు ఎక్కడ ఉన్నారనేది గుర్తించేందుకు చాలా కష్టడవలసి వచ్చింది. ఫిన్‌లెన్స్ ఫొటోగ్రాఫర్ సుబ్బారావు కూలిన భవనం శ్లాబ్‌ను గునపంతో కొడుతూ వెళ్లగా ఒక చోట అరుపులు వినిపించాయి. దాంతో ఆ చోటు గుర్తించి అక్కడ శ్లాబ్‌కు గ్యాస్ కట్టర్లు, ఇనుప గ్లాడర్స్‌తో రంధ్రం చేసి ఆ రంధ్రం గుండా అగ్ని మాపక శాఖ ఉద్యోగి గణేష్, నగర పాలక సంస్థ ఉద్యోగులు ఇద్దరు లోనికి ప్రవేశించి లోపల చిక్కుకున్నవారిని బయటకు తీశారు. రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ టి. రవి కుమార్ మూర్తి, నగర పాలక సంస్థ కమిషనర్ వి. రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ వి. రవీంద్రలు సంఘటనా స్ధలంలో ఉండి సహాయక చర్యలు చేపట్టారు.
నిబంధనలు పాటించని బిల్డర్
భవన నిర్మాణంలో పాటించవలసిన నిబంధనలు పాటించకపోవడంతో సంఘటన చోటు చేసుకుంది. టౌన్ ప్లానింగ్ అప్రూవల్ అయిన తరువాత భవనానికి చుట్టు పక్కల మూడు నుంచి ఐదు అడుగులు ఖాళీ స్ధలం వదిలి మిగిలిన స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలి. అయితే బిల్డర్ ఉన్న స్థలం మొత్తం కూడా కవర్ చేస్తు గొయ్యి తవ్వారు. ఒక వైపు లోతుగా గొయ్యి తవ్వడం వల్ల భవనం అటువైపు ఒరిగిపోయి కూలిపోయింది. భవన నిర్మాణం చేస్తున్న సమయంలో మున్సిపల్ అధికారులకు సమాచారం అందించకుండా బిల్డర్ నిర్మాణం చేపట్టారు.
మున్సిపల్ అధికారుల చేతివాటం
మున్సిల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా భవనానికి ప్లాన్ మంజూరు చేసినట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్లాన్ అప్రూవల్ ఇచ్చి నిర్మాణం జరుగుతున్న సమయంలో నిర్మాణానికి సంబందించి పనులు పరిశీలించవలసిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. అయితే ఇక్కడ మున్సిపల్ అధికారులు పర్యవేక్షణ లేకుండానే నిర్మాణం పనులు చేపట్టారు. అంతలోతుగా గొయ్యి తవ్వితే తమ భవనం కూలే ప్రమాదం ఉందని మృతుడు ఆంజనేయులు బిల్డర్ దృష్టికి తీసుకువెళ్లగా అతను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఆంజనేయులు భయపడినట్టే అతని భవనం కూలిపోయింది.
టౌన్ ప్లానింగ్ అధికారుల సస్పెన్షన్
భవనం కూలడానికి పరోక్షంగా కారకులైన టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండే చేశారు. నగర పాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసరావు, బిల్డింగ్ ఇనస్పెక్టర్ లక్ష్మి నారాయణలను సస్పెండ్ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. బిల్డింగ్ ప్లాన్ ను రద్దు చేశామని, అలాగే బిల్డర్ లెసైన్సును కూడా రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు.
పరుపే మమ్మల్ని రక్షించింది
రాత్రి పదిన్నరకు మూడో అంతస్తులో నిద్రకు ఉపక్రమించాం. మంచంపై నా రెండో కుమారుడు జస్వంత్ పడుకున్నాడు. పెద్దబ్బాయి భార్గవ్, నా భార్య విజయలక్ష్మి, నేను కింద పడుకున్నాం. కొంత సేపటికి భవనం వాలుతున్నట్టు అనుమానం కలిగింది. ఏదో జరుగుతోందని లేచేందుకు ప్రయత్నించా. అంతే ఇంతలో ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోయింది. ముందుగా మాపై మంచం చెక్కలు, పరువు పడిపోయాయి. వాటిపై రాళ్లు పడ్డాయి. స్తంభం కిందపడిపోవడం, ఆ తర్వాత శ్లాబు దానిపై పడిపోవడంతో ఆ మధ్యఖాళీలో పరువుమాత్రమే మాపై ఉంది. మాకిది పునర్జన్మే.
- ఆకుల హనుమంతు
కొట్టుమిట్టాడుతూ అరిచాడు
జస్వంత్ మంచంపై పడుకున్నాడు. ఏదో గాలిశబ్దం వస్తుందనుని లేచి చూసేసరికి భవనం కూలిపోయింది. పైకిలేచేందుకు వీలులేకుండా మాపై భవన శిథిలాలు ఉన్నాయి. నా భర్త, పెద్ద కుమారుడు భార్గవ్ నా పక్కనే అచేతన స్థితిలో పడిఉన్నారు. రెండో కుమారుడు జస్వంత్ కోసం తల కదిపి చూశాను అంతా చీకటి ఏమీ కనిపించడం లేదు. ఇంతలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఓవైపునుంచి అమ్మా..అమ్మా..అంటూ పెద్దపెద్దగా జస్వంత్ అరవడం వినిపించింది. కొద్దిసమాయానికి ఆ అరుపులు ఆగిపోయాయి. ఇంతలో అధికారులు రావడం, లైటింగ్ ఏర్పాటుచేయడం కనిపించాయి. వెంటనే గట్టిగా రక్షించండంటూ అరిచాను. నా రెండో బిడ్డ దక్కకుండా పోయాడు. నా బిడ్డ అరిచిన అరుపులు ఇప్పటికీ నా చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి.
- ఆకుల విజయలక్ష్మి
ఇటుకల శబ్దం అనుకున్నా...
నేను నా భర్త ఆంజనేయులు రెండో అంతస్తులో నిద్రిస్తున్నాం. ఇంతలో ఏవో శబ్దాలు రావడం ప్రారంభమైంది. పక్కనే భవనం నిర్మిస్తున్నారు కదా ఏవో ఇటుకలు సరఫరా చేసుకుంటున్నారనుకున్నా. శబ్దాలు మరింత ఎక్కువయ్యాయి. ఏంటా అని లేచి బయటకు వద్దామనుకునే లోపు మా భవనం పక్కకు ఒరిగిపోతోంది. దీంతో కిందపడిపోయాను. నా భర్త నాపై పడిపోయాడు. అతనిపై ఏవో చెక్కలు, తలుపు పడిపోయాయి. అధికారులు వచ్చి శిథిలాలకింద ఉన్న మమల్ని బయటకుతీసి ఆస్పత్రిలో చేర్పించారు. నాకళ్లెదుటే నా భర్త దీనస్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించడం తట్టుకోలేకపోయాను.
- ఆకుల వెంకటరత్నం
కాసుల కోసం కక్కుర్తి..ఉసురుతీసింది
Published Fri, Aug 23 2013 3:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement