
సాక్షి, అమరావతి/లండన్ : ఏపీ రాజధాని అమరావతి డిజైన్ల విషయంలో టాలీవుడ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి రంగంలోకి దిగారు. రాజధాని డిజైన్ల విషయంపై ఏపీ మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అధికారులతో కలిసి రాజమౌళి శుక్రవారం లండన్ వెళ్లారు. గత నెలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ సందర్భంగా అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లపై రాజమౌళి చర్చించిన విషయం తెలిసిందే. తాను రాజధాని అమరావతికి కన్సల్టెంట్‌ను కాదని, డిజైనర్ సూపర్‌వైజర్‌గా తాను నియమితుడిని అయినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్న రాజమౌళి.. డిజైన్ల విషయంలో సాయం చేస్తానని స్పష్టం చేశారు.
ఇటీవల లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లను తిరస్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని మంత్రి నారాయణను అదేశించారు. దీంతో రాజమౌళిని లండన్ తీసుకెళ్లడానికి సీఆర్‌డీఏ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే డిజైన్ల కోసం మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు గత మూడు నెలల నుంచి వరుసగా లండన్ పర్యటనలు జరిపినా డిజైన్లు మాత్రం ఖరారు కాలేదు. ఈ క్రమంలో డిజైన్ల విషయంలో ఈసారి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో రాజమౌళితో కలిసి సమావేశమై రాజధాని డిజైన్ల విషయంపై చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు భావాలు, అభిప్రాయాలను నార్మన్ ఫోస్టర్ సంస్థకు తెలియజెప్పి ఈ డిజైన్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజమౌళి యత్నిస్తున్నారు. అయితే మంత్రి నారాయణ బృందం నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో జరిగిన భేటీలో పాత డిజైన్లలో మార్పులపై చర్చించారా, లేక కొత్త డిజైన్లు రూపొందించాలని సూచించారో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment