సామాన్యుడిపై కక్ష సాధింపు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
తిరువతి: ప్రభుత్వం సామాన్యుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం కరెంటు చార్జీలు, డీజిలు, పెట్రోలు ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తోంది. బొగ్గు ధరలు తగ్గినా విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోంది. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్నా, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోలు, డీజిలు ధరలపై లీటరుకు *4 ఆధారిత పన్ను (వ్యాట్) విధించింది.
దీని ప్రభావం నిత్యావసర పస్తువులతో పాటు అన్ని వర్గాలపై పడుతుంది. ఎస్సీ కాలనీల్లో విద్యుత్ మీటర్లు ఉన్నా బకాయిలు చెల్లించలేదని కేసులు పెడుతున్నారు. 2004 నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. రైతులంటే ఈ ప్రభుత్వానికి విలువ లేదు. రైతులు, సామాన్య ప్రజలపైన కక్ష సాధింపు చర్యలకు ఒడిగడుతోంది. అన్నదాతలపై కక్షసాధింపు చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజల తరపున పోరాటాలు చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదు’’అని హెచ్చరించారు.