రాజమండ్రి రూరల్ : రోబోటిక్స్ శాస్త్ర పరిజ్ఞానంలో ఫ్రాన్స్ దేశంలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు రాజమండ్రికి చెందిన యువకుడికి ఆహ్వానం అందింది. రోబో టెక్నాలజీలో ఆధునికతకు మరింత పదును పెట్టేందుకు ఫ్రాన్స్ దేశంలోని మోరిట్ పిల్లర్ ప్రాంతం లో ఏటా సమ్మర్ స్కూల్ ఇన్ సర్జికల్ రోబోటిక్స్ పేరుతో సదస్సు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫ్రాన్స్‌లో జరిగే ఆరో సర్జికల్ రోబో సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి రోబో రంగంలో నిపుణులను, ఇంజనీర్లను ఆహ్వానించారు. దీనిలో భాగంగా రాజమండ్రికి చెందిన యువకుడు కె.ఎస్.కె.వి. ఆదిత్యకు ఈ అరుదైన అవకాశం దక్కింది. ఆదిత్య కేరళలోని అమృత విశ్వ విద్యాలయంలోని బీటెక్ పూర్తి చేసి బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థలో రీసెర్చ్ అసిస్టెంట్ గా, కొరియా దేశంలో సెంటర్ ఫర్ బయోనిక్స్ లో రీసెర్చ్ ట్రెయినీగా పనిచేశారు. 2012లో స్విట్జర్లాండ్ దేశంలో జరిగిన బయో ఇల్ స్పెయిర్ రోబోటిక్స్ పేరిట జరిగిన సదస్సులో కూడా పాల్గొన్నారు. రెండు కంపెనీలపై పేటెంట్ హక్కులు కలిగి ఉండడం విశేషం. అతడి తండ్రి కె.ఆర్. కుమార్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ వద్ద పీఏగా పనిచేస్తున్నారు. తల్లి నాగవల్లి టీచర్‌గా పనిచే స్తున్నారు.