‘స్వగృహ’ అప్పులు రూ. 2,100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లెక్కలను అధికారులు రూపొందిస్తున్నారు. పేద ప్రజలకు తక్కువ ధరకే ఆధునిక వసతులున్న ఇళ్లను నిర్మించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పథకం.. ప్రభుత్వ పర్యవేక్షణ లేక దివాలా తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి హైదరాబాద్‌లో రూపుదిద్దుకున్న 3 ప్రాజెక్టులు మినహా.. మిగతా చోట్ల ఖాళీ స్థలాలే ఆస్తులుగా ఉన్నాయి. వీటి విలువలను లెక్కగట్టే పనిలో ఉన్న అధికారులు.. అప్పులు, ఇప్పటి వరకు ప్రాంతాల వారీగా జరిగిన ఖర్చు వివరాలను లెక్కగట్టారు. ప్రస్తుతం స్వగృహ కార్పొరేషన్‌కు బ్యాంకు అప్పులు, వడ్డీ, కాంట్రాక్టర్లకు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు రూ. 2,100 కోట్లు ఉన్నట్లు తేల్చారు.
ఇందులో బ్యాంకుల అప్పు రూ. వేయి కోట్లు, వడ్డీ బకాయిలు రూ. 350 కోట్లు, భూమి విలువ, ఇతర ఫీజులు కలిపి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయి రూ. 350 కోట్లు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 400 కోట్లుగా లెక్కించారు. ఇక ఇప్పటివరకు కార్పొరేషన్ పెట్టిన ఖర్చును రూ. 2,000 కోట్లుగా లెక్కేశారు. పోచారం, బండ్లగూడ, జవహర్‌నగర్‌లలో ఒక్కోటి 2,500 అపార్ట్‌మెంట్లతో ఇళ్ల ప్రధాన నిర్మాణం పూర్తయినందున ఖర్చులో తెలంగాణ వాటా రూ. 1,800 కోట్లుగా తేల్చారు. సీమాంధ్రలో చేసిన ఖర్చు మొత్తం రూ. 200 కోట్లని లెక్కల్లో పేర్కొన్నారు.