రాజీవ్ యువకిరణాల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగాలన్న సీఎం కిర ణ్ ప్రకటన.. నేతిబీర చందంగా మారింది. ఓవైపు ఉద్యోగాలు లేకపోగా.. మరోవైపు శిక్షణ కేంద్రాలు మూత పడుతున్నాయి. యువతలో నైపుణ్యం పెంపొందించి వారికి ఉపాధి కల్పించాల్సిన సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఖర్చు చేసిన రూ.కోట్లు వృథా అయ్యాయి.
సాక్షి, నల్లగొండ: రాజీవ్ యువకిరణాల పథకం ఆది నుంచి బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. ఏటా లక్షమందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రెండున్నరేళ్ల క్రితం పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద నమోదు చేయించుకున్న నిరుద్యోగుల విద్యాస్థాయిని బట్టి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉద్యోగాలు ఇప్పించడం ఈ పథకం ఉద్దేశం.
అభ్యర్థులకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా లబ్ధిపొందిన సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో నిధుల వృథా తప్ప నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు. దీన్ని గుర్తించిన సర్కారు... శిక్షణను నిలిపివేయాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇకపై ఎలాంటి శిక్షణ కేంద్రాలను ప్రారంభించొద్దని అ ధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారం.
ఇంటి దారి...
కొన్ని శిక్షణ సంస్థలు అభ్యర్థుల సంఖ్యను ఎక్కువగా చూపి జిమ్మిక్కులు చేశాయి. లేని అభ్యర్థుల పేరిట నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో శిక్షణ సంస్థల్లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చారు. అయినా సత్ఫలితాలు దక్కలేదు. ఉద్యోగాలు ఇప్పిస్తేనే డబ్బు చెల్లిస్తామని ప్రభుత్వం మెలిక పెట్టింది. దీంతో కొన్ని సంస్థలు చిరుద్యోగాలు చూపించి మమ అన్నాయి. నెలకు రూ.3 వేల వేతనాల కోసం పొద్దంతా పనిచేయలేక ఉద్యోగం నుంచి అభ్యర్థులు వైదొలిగారు. తిరిగి వారందరినీ తీసుకొచ్చి కొలువుల్లో చేర్పించాలని అధికారులకు సర్కారు సూచించింది. క్షేత్రస్థాయిలో వారికోసం అధికారులు తిరిగినా లాభం లేకపోయింది. ఇలాంటి ఒడిదుడుకులు అడుగడుగునా ఎదురయ్యాయి.
మసక ‘కిరణాలు’
Published Thu, Feb 6 2014 3:29 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement