పెద్దల సభ (రాజ్యసభ)లో స్థానం కోసం జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో ఆశావహుల ఆరాటం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
‘పెద్ద’రికం దక్కేనా?
Published Thu, Jan 23 2014 5:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :పెద్దల సభ (రాజ్యసభ)లో స్థానం కోసం జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో ఆశావహుల ఆరాటం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. టీడీపీలో ఎప్పటి నుంచో రాజ్యసభ సీటు కోసం పోరాడి, పోరాడి న యనమల రామకృష్ణుడు చివరకు ఎమ్మెల్సీతో సరిపెట్టుకోక తప్పిం ది కాదు. ఇప్పుడు ఆ పార్టీ తరఫున రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశంపై మరో సీనియర్ నేత మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఆశ పెట్టుకున్నారు. మూడు రోజుల క్రితం చిక్కాల హైదరాబాద్‌లో అధినేత చంద్రబాబును కలిసి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉండడం, నిజాయితీపరుడనే పేరు, రామచంద్రపురం ఉప ఎన్నికలో ఇష్టం లేకున్నా పార్టీ ఆదేశాన్ని శిరసావహించి, పోటీ చేసి ఓటమి పాలవడం, కోస్తా జిల్లాల్లో కాపు సామాజికవర్గానికి పెద్దపీట వేస్తామంటున్న చంద్రబాబు మాటలు...వీటన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని తనకు అవకాశం ఇవ్వాలని చిక్కాల కోరుతున్నారు. ముందు జిల్లాలో పార్టీ ముఖ్యులైన యనమల రామకృష్ణుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు వంటి నాయకులతో మాట్లాడాకే రాజ్యసభ సీటు కోసం చంద్రబాబును అభ్యర్థించారని చిక్కాల అనుచరులు చెబుతున్నారు.
వైఎస్సార్ సీపీలా బీసీలకు అవకాశం ఇవ్వాలి..
కాగా బలహీనవర్గాలకు చెందిన కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్‌ఎస్) కూడా పెద్దల సభకు వెళ్లాలని ఆశ పడుతున్నారు. అధికారంలో లేకున్నా పార్టీ వెన్నంటి నిలుస్తూ వస్తున్న తమ సామాజికవర్గానికి సరైన గుర్తింపు లభించడం లేదనే ఆవేదన బీసీల్లో బలమైన శెట్టిబలిజల నుంచి వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పునరేకీకరణలతో వచ్చే ఎన్నికల్లో కొత్తపేట అసెంబ్లీ టిక్కెట్టును త్యాగం చేయాల్సి వస్తుందని సుబ్రహ్మణ్యం భావిస్తున్నారు. దాదాపు ఇవే సంకేతాలు అందుతున్న క్రమంలో ఎప్పుడో ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న భరోసాపై పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రెసిడెంట్‌గా కూడా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంకు పెద్దగా నమ్మకం లేదని అనుచరవర్గం అంటోంది. దీని కంటే రాజ్యసభలో చోటిస్తే జిల్లా నుంచి తొలిసారి బీసీలకు ఆ అవకాశం ఇచ్చినట్టయి, బీసీలు పార్టీకి చేరువవుతారని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రస్థాయిలో వచ్చిన ఒక్కగానొక్క ఎమ్మెల్సీ పదవినీ బీసీలలో వెలమ సామాజికవర్గం నుంచి ఆదిరెడ్డి అప్పారావుకు ఇవ్వడాన్ని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం వర్గం గుర్తుకు తెస్తోంది.
‘ఆత్మప్రబోధం’పై చైతన్యరాజు ఆశ!
టీడీపీలో పరిస్థితి ఇలా ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీలో మరో రకమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర శాసనసభలో ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా రాజ్యసభలో మూడు స్థానాలు ఖాయమంటున్నారు. నాలుగో స్థానం కోసం తాను రేసులో ఉంటానని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మంగళవారం అసెంబ్లీ లాబీలో పాత్రికేయుల సమక్షంలో ప్రకటించడం గమనార్హం. నాలుగో అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలను కోరనున్నట్టు ఆయన చెప్పారు. క్షత్రియ సామాజికవర్గంలో పట్టున్న చైతన్యరాజు తన కుమారుడు, అమలాపురం కిమ్స్ ఎండీ రవికిరణ్‌వర్మను ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు.
తండ్రీ, కుమారులు ఇద్దరూ ఏకకాలంలో ఎమ్మెల్సీలుగా ఉన్న క్రమంలో చైతన్యరాజు రాజ్యసభకు వెళ్లాలని అభిలషిస్తున్నారు. తన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించకున్నా ఎమ్మెల్యేల మద్దతుతో బరిలో నిలుస్తానన్న చైతన్యరాజు ప్రకటన జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అధిష్టానానికి తమ సమైక్య అభిమతాన్ని చాటేందుకు రాజ్యసభ ఎన్నికలను అవకాశంగా చేసుకోవాలంటున్న ఎమ్మెల్యేల మద్దతు తనకు లభిస్తుందన్న ధీమా ఆయనలో వ్యక్తమవుతోంది. చైతన్యరాజు ప్రకటించిన సమయంలో అసెంబ్లీ లాబీలోనే ఉన్నపెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ గతంలో ఇందిరాగాంధీ సూచించినట్టు ఆత్మప్రబోధానుసారం ఓటేద్దామనడం కూడా చైతన్యరాజు అభిమతానికి అనుగుణంగా ఉంది. జిల్లా నుంచి టి.రత్నాబాయి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తుండగా, గతంలో.. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత, దివంగత బోళ్ల సత్యనారాయణ రాజ్యసభలో ప్రాతినిధ్యంవహించారు. ఈసారి ఆ రెండు పార్టీల నుంచి పెద్దల సభలో అవకాశం ఎవరికైనా దక్కుతుందో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement