
సీఎం ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో గాంధీ భవనలో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్ర విభజన వల్ల ఏమైన సమస్యలు ఉంటే కాంగ్రెస్ అధిష్టానం ముందు చెప్పుకోవాలని ఆయన సీఎం కిరణ్కు సూచించారు.
అంతేకాని ప్రెస్మీట్ పెట్టి మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానానికి రోడ్డు మ్యాప్ సమర్పించినప్పుడు రాష్ట్ర విభజన వల్ల కలిగే అనర్థాలను వివరించలేదా ఆని విహెచ్ ఈ సందర్భంగా కిరణ్ను ప్రశ్నించారు. అన్ని విషయాలు తెలిసి, ఓ బాధ్యతయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం సరికాదన్నారు.
తెలంగాణ ఇవ్వాలని గతంలోనే సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న సంగతిని వీహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, సీఎం కిరణ్ వ్యవహారిస్తున్న తీరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుందని వి.హనుమంతరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఎన్నిసార్లు క్షేత్రస్థాయిలో చర్చలు జరపాలని ప్రశ్నించారు.