రాఖీ సందడి | rakhi celebrations | Sakshi
Sakshi News home page

రాఖీ సందడి

Published Mon, Aug 19 2013 2:51 AM | Last Updated on Fri, Nov 9 2018 4:53 PM

rakhi celebrations

 దోమ, న్యూస్‌లైన్: పల్లెల్లో అప్పుడే రాఖీ పండుగ సందడి మొదలైంది. ఈ నెల20న (మంగళవారం) పండుగ జరుపుకొనేందుకు ఉద్యోగాలు, చదువుల నిమిత్తం పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఉండే ఆడపడుచులు, పెళ్లిళ్లై అత్తవారింటికి వెళ్లిన వారు కాస్త ముందుగానే సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ఆదివారం అందరికీ సెలవు ఉండడం, ఒక్క సోమవారం సెలవు పెడితే మంగళవారంతో కలుపుకుని మొత్తం మూడు రోజులు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉండడంతో చాలామంది శనివారం సాయంత్రానికే సొంత గ్రామాలకు చేరుకున్నారు. వారంతా తమ సోదరులకు కట్టేందుకు రాఖీల కొనుగోలులో నిమగ్నమయ్యారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
 
 మార్కెట్లలో రకరకాల రాఖీలు...
 వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా మార్కెట్‌లో ఈ ఏడాది సరికొత్త ఆకృతుల్లో రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. గడియారాల రూపంలో ఉండే రాఖీలు, పూల ఆకారం, డైమండ్ ఆకృతి, గొలుసులు, బ్రాస్‌లెట్ల రూపంలో, పూసల దండలతో ఉన్న రాఖీలు దర్శనమిస్తున్నాయి. రూ.10 మొదలుకొని రూ.3వేల వరకు ధర పలుకుతున్నాయి. రాఖీల దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ కనబడుతున్నాయి.
 తాండూరులో ఘనంగా రక్షాబంధన్
 తాండూరు టౌన్: ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ్ ఆధ్వర్యంలో ఆదివారం తాండూరులోని కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మహేంద ర్‌రెడ్డి, డీసీసీబీ జిల్లా  చైర్మన్ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీలు వారిని సన్మానించి, రాఖీలు కట్టారు. అనంతరం ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బ్రహ్మకుమారి సమాజ్ వారు శాంతి ప్రచారకులుగా దేశవిదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గడించారన్నారు. దైవం తోడు లేకుండా ఏ కార్యాన్ని చేయలేమని, శాంతి, అహింసా మార్గాల్లోనే అందరి మనసులు గెలుచుకోవచ్చని వారిని చూసి నేర్చుకోవాలన్నారు. డీసీసీబీ జిల్లా చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నిస్వార్థ సేవతో దైవమార్గాన్ని ప్రబోధిస్తున్న సోదరీమణులు అందరికీ ఆదర్శనీయులని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన సేడం, చించోళి, గుల్బర్గా, రంగారెడ్డి జిల్లా సమాజ ప్రతినిధులు రత్న, కళ, జగదేవి, గిరిజ, విద్య తదితరులను తాండూరు సమాజసభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు రవిగౌడ్, వెంకటయ్య, భద్రన్న, పెన్నా సిమెం ట్స్ జీఎం హరిశ్చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement