ర్యాలీ నిర్వహిస్తున్న పీఆర్‌టీయూ నాయకులు
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్):ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బీవై రామయ్య పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకృష్ణదేవరాయ కూడలిలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సుమారు 80 మంది ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డితో కలిసి బీవై రామయ్య వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేస్తుంటే సీఎం చంద్రబాబు ఉద్యమకారులపై కేసులు పెట్టి జైళ్లకు పంపారని గుర్తుచేశారు. జగన్ పోరాటలకు సీఎం మైండ్ బ్లాక్ అయిందని, ఆలోచనా శక్తి సన్నగిల్లి ఏమి మాట్లాడుతున్నారో తెలియని స్థితికి వచ్చారన్నారు. రూ.3.50 లక్షల కోట్ల అవినీతి పాల్పడినట్లు లెక్కలు ఉన్నాయని, ఇవి కేంద్రం దగ్గర కూడా ఉన్నాయన్నారు. సీఎం జైలుకు వెళితే బయటికి వచ్చేపరిస్థి«తి ఉండదన్నారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ సైతం పేర్కొన్నారన్నారు.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై జగన్‌తో చర్చిస్తామన్నారు. ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడుతూ ప్రత్యేక హోదానే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రత్యేక హోదాను సాధించుకోలే పోతున్నామన్నామని విమర్శించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీనే ముద్దుంటూ కబుర్లు చెప్పిన సీఎం ఇప్పుడు మాటమార్చడం ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామ చేస్తారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన వారంలోపు సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని జగన్ ఇదివరకే ప్రకటించారని.. దాన్ని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు వైష్ణవ కరుణానిధిమూర్తి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్క రోజు నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. అంతకు ముందు పీఆర్‌టీయూ నాయకులు జెడ్పీ నుంచి శ్రీకృష్ణదేవరాయ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. దీక్షలను ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి ఓంకార్‌యాదవ్, కోశాధికారి నారాయణనాయక్‌లు దీక్షలకు మద్దతు ప్రకటించారు. పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, రామకృష్ణ, గోపాల్, ఫయాజ్, బుగ్గన్న, జిల్లా నాయకులు నాగభూషణ్‌గౌడ్, లక్ష్మినారాయణ, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment