సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు క్లిష్టతరమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రమాదవశాత్తు మహిళ కుడివైపు తొడలో దిగి ఎడమవైపు తుంటెలోంచి బయటకు వచ్చిన ఇనుప కమ్మెను తొలగించడంతో పాటు, దెబ్బతిన్న అవయవాలను సరిచేశారు. దీనికి 5 గంటల సమయం పట్టింది. ఇనుప కమ్మె మూడు అంగుళాల వెడల్పు, అంగుళం మందం ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 లక్షలు వ్యయం అయ్యే శస్త్ర చికిత్సను ప్రభుత్వ వైద్యులు ఉచితంగా నిర్వహించారు.
గుంటూరుకు చెందిన మేడా ఏసమ్మ(50) అవనిగడ్డ సమీపంలోని పులిగడ్డలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో మచిలీపట్నం వెళ్లే ఆటో ఎక్కింది. ఆటో కొద్దిదూరం వెళ్లాక వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను పక్కనుంచి ఢీకొంది. బస్సు బాడీకి ఉండే ఇనుప కమ్మె ఏసమ్మ కుడివైపు తొడలో దిగి ఎడమవైపు తుంటెలో బయటకు వచ్చింది.
స్థానికులు ఇనుప కమ్మెను కోసి, చికిత్స కోసం మచిలీపట్నం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు విజయవాడకు తరలించారు. ఏడుగురు వైద్యులు రాత్రి 10 గంటలకు సర్జరీని ప్రారంభించి వేకువ జామున 3 గంటలకు విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్ర చికిత్స విభాగాధిపతి డాక్టర్ కె.శివశంకరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మాధవి, డాక్టర్ విజయలక్ష్మి, ఆర్థోపెడిక్ వైద్యులు అయ్యప్ప, అనస్థీషియన్ డాక్టర్ నీరజ, ప్రయివేటు వైద్యులు యూరాలజిస్ట్ డాక్టర్ ధీరజ్, వస్క్యులర్ సర్జన్ డాక్టర్ శ్రీహర్ష శస్త్ర చికిత్సలో పాల్గొన్నారు.
అబ్జర్వేషన్ అవసరం
ఆమె యూరిన్ బ్లాడర్ పగిలిపోవడంతో పాటు, కుడివైపు తొడలో రక్తనాళాలు తెగిపోయాయి. పెల్విస్ ఎముక విరిగింది. తొలుత యూరిన్ బ్లాడర్‌ను సరిచేశాం. కుడివైపు యూరేటర్‌ను తీసి, స్టెంట్ అమర్చి బ్లాడర్‌ను సరిచేశాం. తెగిన రక్తనాళాలను అతికించడంతో పాటు, విరిగిన తుంటె ఎముకను సరిచేశారు. నాలుగు రోజులు ఇన్‌ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చు. – డాక్టర్ కె.శివశంకరరావు, శస్త్ర చికిత్స విభాగాధిపతి
Comments
Please login to add a commentAdd a comment