సాక్షి, విశాఖపట్నం : ఏకంగా రాష్ట్రపతి భవన్‌లోనే బస. రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో తలపండిన వారితో సమాలోచనలు..సమాచార మార్పిడికి అవకాశం..అభినందలు. ఇది ఏ కొద్దిమంది పెద్దలకో అందుబాటులో ఉండే అంశం. కానీ పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ . విద్యార్థుల్లోని అరుదైన ప్రతిభా పాటవాలను గుర్తించి ..వారికి పోటీ నిర్వహించి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి భారత రాష్ట్రపతి భవన్‌లో బస చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.
ప్రధానంగా పదో తరగతి విద్యార్థులతో అద్భుతమైన ఆలోచనలు, ప్రయోగాలు చేయించి వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాల సమర్పణకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కాసింత స్వేచ్ఛనిస్తే అద్భుతాలు సృష్టించగలరు. తమ మది లోని భావాలను ఆవిష్కరిస్తారు. ప్రతి విద్యార్థి చదువుకుంటూనే విభిన్న రంగాల్లో రాణించాలంటూ భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలామ్ ఎన్నోమార్లు సూచించారు.
ఈ దిశలో విద్యార్థులను ప్రయోగాల్లో తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. విద్యార్థులు సృజనాత్మకతతో మంచి ప్రయోగాలను చేయాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. ఉత్తమ ప్రయోగాలు చేసిన విద్యార్థులకు దేశ ప్రథమ పౌరుడు, భారత రాష్ట్రపతి భవన్‌లో బస చేసే అవకాశాన్ని జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ అవకాశం కల్పిస్తుంది. తాను పొందిన జ్ఞానాన్ని దేశాధ్యక్షుడితో పాటు, కేంద్ర మంత్రులు, శాస్త్రసాంకేతిక రంగాల్లో తలపండిన వారితో సమాలోచనలు, సమాచార మార్పిడికి అవకాశం, వారి నుంచి అభినందనలు అందుతాయి.
ఈ అరుదైన అవకాశం ఏ కొద్దిమంది పెద్దలకో లభిస్తుంది. కాని పాఠశాల విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్. భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పదో తరగతి విద్యార్థులు ప్రయోగాలు చేసి వాటిని ఈ నెల 31వ తేదీలోపు IGST@ NIF INDIA.org వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు విద్యార్థులు జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థను ఇంటర్నెట్ ద్వారా సంప్రదించవచ్చు.
అర్హులు ఎవరంటే...
- పోటీకి దేశంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న అన్ని తరగతులు, ప్రధానంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
విద్యార్థులు వివిధ అంశాలకు సం బంధించిన తమ ఆవిష్కరణలు, పరిష్కార మార్గాలను తయారు చేయడమే ప్రాథమిక సమాచారం ఉద్దేశం, ఆవిష్కరణ లక్ష్యం. ఎలాం టి ప్రయోజనాలున్నాయనే విషయాలపై ప్రాథమిక సమాచారాన్ని ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాల నుంచి ఈ మెయిల్ ద్వారా, ఐఎ ఖీః Nఐఊ ఐNఈఐఅ.ౌటజ ఇంటర్నెట్ ద్వారా లేదా తపాలా ద్వారా పంపవచ్చు. తపాలా చిరునామా ఆయా పాఠశాలల నుంచి అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంపిక ఇలా...
ఇన్‌స్పైర్ వంటి వేడుకలకు పరిమిత సంఖ్యలోనే ప్రతిపాదనలు ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమానికి అపరిమిత సంఖ్యలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తమకు తోచిన అంశాలపై ప్రతి పాదనలు సిద్ధం చేసి సమర్పించడమే తరువాయి. తొలుత విద్యార్థి పంపిన ఆవిష్కరణలను నిపుణుల కమిటీ ఎంపిక చేసి సమాచారమిస్తుంది. జాతీయ స్థాయిలో పరిశీలనకు తుది ఎంపికకు పంపిస్తారు. అక్కడ కూడా ఎంపికయ్యాక విద్యార్థికి ఆహ్వానం పంపిస్తారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు దేశ రాజధానిలోని భారత రాష్ట్రపతి నివాసంలో బస కల్పించి ప్రధానమంత్రి, ఇతర మంత్రులు సహా భారత ప్రభుత్వంలో శాస్త్ర, సాంకేతిక రంగాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశాలు, మేధోమదనానికి అవకాశం కల్పిస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి పది మార్కులు బోనస్‌గా లభిస్తుంది.
ఏఏ అంశాలంటే...
- సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు. ప్రధానంగా వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలపై విద్యార్థి స్పందనను ఆహ్వానిస్తారు. అంశం ఎలాంటిదైనా తమ ఆవిష్కరణ సాధ్యాసాధ్యం విషయంలో కాసింత సానుకూలత ఉంటే సరిపోతుంది.
- నిత్య జీవితంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు సాంకేతికంగా పరిష్కారం కోసం కృషి చేసే ఆవిష్కరణల కోణం.
- సమాజంలో తలపండిన వారి అనుభవాలకు సాంకేతికత జోడించి అందుబాటులోకి తెచ్చే అవకాశాల గురించిన ఆలోచనలు.
- ఇంటి పక్కనే ఉన్న ప్రతిభావంతులు లేదా సమాజం గుర్తించని బాలమేధావుల ఆలోచనలు, వారి ఆవిష్కరణలు గురించిన సమాచారం అందించాలి.
పోటీలు ఎలా ఉంటాయి..?
సాంకేతిక విద్య పరిశోధనల గురించిన పోటీ ఇది. నాలుగైదు అంశాలకు సంబంధించిన విషయాలపై పాఠశాలల విద్యార్థులు స్పందించి తమ పరిధిలో సొంతంగా ఆలోచించి, ఉన్నంతలో మెరుగైన అంశాల గురించిన సమాచారాన్ని వేదికకు పంపించాలి. ఈ అంశాలకు సంబంధించిన ఆవిష్కరణలు కేవలం స్వతంత్రంగా ఆలోచించినవే కావాలి. ఇంటర్నెట్ లేదా ఇతరత్రా వాటి నుంచి సేకరించి ఉండకూడదు. ఈ విషయమై సదరు విద్యార్థి ఆవిష్కరణ స్వయంగా చేసిందేనని, ఎవరినీ అనుకరించడం లేదా అనుసరించడం లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించలేదని విద్యార్థి, తల్లిదండ్రులు ధ్రువీకరించాలి.
Comments
Please login to add a commentAdd a comment