National Innovation Foundation
-
బాలశాస్త్రవేత్తలకు రాష్ట్రపతి భవన్ ఆహ్వానం
సాక్షి, విశాఖపట్నం : ఏకంగా రాష్ట్రపతి భవన్‌లోనే బస. రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో తలపండిన వారితో సమాలోచనలు..సమాచార మార్పిడికి అవకాశం..అభినందలు. ఇది ఏ కొద్దిమంది పెద్దలకో అందుబాటులో ఉండే అంశం. కానీ పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ . విద్యార్థుల్లోని అరుదైన ప్రతిభా పాటవాలను గుర్తించి ..వారికి పోటీ నిర్వహించి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి భారత రాష్ట్రపతి భవన్లో బస చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులతో అద్భుతమైన ఆలోచనలు, ప్రయోగాలు చేయించి వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాల సమర్పణకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కాసింత స్వేచ్ఛనిస్తే అద్భుతాలు సృష్టించగలరు. తమ మది లోని భావాలను ఆవిష్కరిస్తారు. ప్రతి విద్యార్థి చదువుకుంటూనే విభిన్న రంగాల్లో రాణించాలంటూ భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలామ్ ఎన్నోమార్లు సూచించారు. ఈ దిశలో విద్యార్థులను ప్రయోగాల్లో తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. విద్యార్థులు సృజనాత్మకతతో మంచి ప్రయోగాలను చేయాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. ఉత్తమ ప్రయోగాలు చేసిన విద్యార్థులకు దేశ ప్రథమ పౌరుడు, భారత రాష్ట్రపతి భవన్లో బస చేసే అవకాశాన్ని జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ అవకాశం కల్పిస్తుంది. తాను పొందిన జ్ఞానాన్ని దేశాధ్యక్షుడితో పాటు, కేంద్ర మంత్రులు, శాస్త్రసాంకేతిక రంగాల్లో తలపండిన వారితో సమాలోచనలు, సమాచార మార్పిడికి అవకాశం, వారి నుంచి అభినందనలు అందుతాయి. ఈ అరుదైన అవకాశం ఏ కొద్దిమంది పెద్దలకో లభిస్తుంది. కాని పాఠశాల విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్. భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పదో తరగతి విద్యార్థులు ప్రయోగాలు చేసి వాటిని ఈ నెల 31వ తేదీలోపు IGST@ NIF INDIA.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు విద్యార్థులు జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థను ఇంటర్నెట్ ద్వారా సంప్రదించవచ్చు. అర్హులు ఎవరంటే... పోటీకి దేశంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న అన్ని తరగతులు, ప్రధానంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తు చేసుకోవడం ఎలా..? విద్యార్థులు వివిధ అంశాలకు సం బంధించిన తమ ఆవిష్కరణలు, పరిష్కార మార్గాలను తయారు చేయడమే ప్రాథమిక సమాచారం ఉద్దేశం, ఆవిష్కరణ లక్ష్యం. ఎలాం టి ప్రయోజనాలున్నాయనే విషయాలపై ప్రాథమిక సమాచారాన్ని ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాల నుంచి ఈ మెయిల్ ద్వారా, ఐఎ ఖీః Nఐఊ ఐNఈఐఅ.ౌటజ ఇంటర్నెట్ ద్వారా లేదా తపాలా ద్వారా పంపవచ్చు. తపాలా చిరునామా ఆయా పాఠశాలల నుంచి అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపిక ఇలా... ఇన్స్పైర్ వంటి వేడుకలకు పరిమిత సంఖ్యలోనే ప్రతిపాదనలు ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమానికి అపరిమిత సంఖ్యలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తమకు తోచిన అంశాలపై ప్రతి పాదనలు సిద్ధం చేసి సమర్పించడమే తరువాయి. తొలుత విద్యార్థి పంపిన ఆవిష్కరణలను నిపుణుల కమిటీ ఎంపిక చేసి సమాచారమిస్తుంది. జాతీయ స్థాయిలో పరిశీలనకు తుది ఎంపికకు పంపిస్తారు. అక్కడ కూడా ఎంపికయ్యాక విద్యార్థికి ఆహ్వానం పంపిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు దేశ రాజధానిలోని భారత రాష్ట్రపతి నివాసంలో బస కల్పించి ప్రధానమంత్రి, ఇతర మంత్రులు సహా భారత ప్రభుత్వంలో శాస్త్ర, సాంకేతిక రంగాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశాలు, మేధోమదనానికి అవకాశం కల్పిస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి పది మార్కులు బోనస్‌గా లభిస్తుంది. ఏఏ అంశాలంటే... సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు. ప్రధానంగా వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలపై విద్యార్థి స్పందనను ఆహ్వానిస్తారు. అంశం ఎలాంటిదైనా తమ ఆవిష్కరణ సాధ్యాసాధ్యం విషయంలో కాసింత సానుకూలత ఉంటే సరిపోతుంది. నిత్య జీవితంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు సాంకేతికంగా పరిష్కారం కోసం కృషి చేసే ఆవిష్కరణల కోణం. సమాజంలో తలపండిన వారి అనుభవాలకు సాంకేతికత జోడించి అందుబాటులోకి తెచ్చే అవకాశాల గురించిన ఆలోచనలు. ఇంటి పక్కనే ఉన్న ప్రతిభావంతులు లేదా సమాజం గుర్తించని బాలమేధావుల ఆలోచనలు, వారి ఆవిష్కరణలు గురించిన సమాచారం అందించాలి. పోటీలు ఎలా ఉంటాయి..? సాంకేతిక విద్య పరిశోధనల గురించిన పోటీ ఇది. నాలుగైదు అంశాలకు సంబంధించిన విషయాలపై పాఠశాలల విద్యార్థులు స్పందించి తమ పరిధిలో సొంతంగా ఆలోచించి, ఉన్నంతలో మెరుగైన అంశాల గురించిన సమాచారాన్ని వేదికకు పంపించాలి. ఈ అంశాలకు సంబంధించిన ఆవిష్కరణలు కేవలం స్వతంత్రంగా ఆలోచించినవే కావాలి. ఇంటర్నెట్ లేదా ఇతరత్రా వాటి నుంచి సేకరించి ఉండకూడదు. ఈ విషయమై సదరు విద్యార్థి ఆవిష్కరణ స్వయంగా చేసిందేనని, ఎవరినీ అనుకరించడం లేదా అనుసరించడం లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించలేదని విద్యార్థి, తల్లిదండ్రులు ధ్రువీకరించాలి. -
టమాటా నిల్వ సామర్థ్యం రెట్టింపు!
పండు టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకుండా (గది ఉష్ణోగ్రతలో) ఉంచితే సాధారణంగా వారం గడిచేటప్పటికి ముడతలు వచ్చి కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. అయితే, విశాఖపట్నానికి చెందిన శ్రీమతి దూబ రాజు అనే గృహిణి తయారు చేసిన హెర్బల్ ద్రావణంలో ముంచి తీసి నిల్వ చేసిన టమాటోలు మాత్రం రెండు వారాలకు పైగానే తాజాగా ఉంటున్నాయి. టమాటోల సీజన్లో మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు 10–15 రోజులు రైతులు నిల్వ చేసుకోగలిగితే వారి నికరాదాయం బాగా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఆకుకూరల రసాలను ఉపయోగించి శ్రీమతి రాజు తన సొంత ఆలోచనతో ఒక హెర్బల్ ద్రావణాన్ని రెండేళ్ల క్రితం తయారు చేశారు. లీటరు నీటికి 10 ఎం.ఎల్. ద్రావణం ఈ ద్రావణం 10 ఎం.ఎల్.ను లీటరు నీటిలో కలిపి.. ఆ నీటిలో టమాటోలను 10 నిమిషాలు నానబెట్టి.. బయటకు తీసి ట్రేలలో నిల్వ చేసుకుంటే సాధారణం కన్నా రెట్టింపు రోజులు నిల్వ ఉంటున్నాయని ఆమె తెలిపారు. రాగి, వెండి, ఇత్తడి తదితర పాత్రలు, వస్తువులను సమర్థవంతంగా శుభ్రం చేయగల హెర్బల్ ద్రావణాన్ని శ్రీమతి రాజు గతంలో తయారు చేశారు. అనేక దేవాలయాల్లో వెండి, బంగారం, రాగి, ఇత్తడి పాత్రలను సురక్షితంగా శుభ్రం చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టమాటో రైతులకు ఉపయోగపడేలా ఈ ద్రావణాన్ని తయారు చేశానని ఆమె తెలిపారు. రైతు బజారులో కొనుగోలు చేసి తెచ్చిన టమాటోలను.. ఈ ద్రావణంలో ముంచి తీసి.. వాటిని ప్లాస్టిక్ ట్రేలలో నింపి, వాటిపైన గోనె సంచి లేదా పాత నూలు చీరను పైన కప్పానని ఆమె తెలిపారు. నెల రోజుల వరకు కుళ్లిపోకుండా ఉన్నాయన్నారు. నూటికి నూరు శాతం ఆకుకూరల రసాలతోనే దీన్ని తయారు చేశానని అంటూ.. ఈ ద్రావణంలో ముంచిన టమాటోల నిల్వ సామర్థ్యం రెట్టింపవుతుందే తప్ప వాటిని తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని ఆమె అంటున్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో అధ్యయనం విశాఖపట్నం జిల్లాలోని భాగవతుల చారిటబుల్ ట్రస్టు కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ద్రావణాన్ని ఉపయోగించి టమాటోల నిల్వ సామర్థ్యంపై 2017 ఎండాకాలంలో అధ్యయనం జరిగింది. సెంచూరియన్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఈ ద్రావణాన్ని పరీక్షించి చూడగా.. పండు టమాటోల నిల్వ సామర్థ్యం రెట్టింపైందని కేవీకే అధిపతి డాక్టర్ కుర్రా శైలజ తెలిపారు. పండిన, కరపచ్చిగా ఉన్న, పచ్చిగా ఉన్న టమాటాలను మూడేసి చొప్పున తీసుకొని నెల రోజులపాటు పరిశీలించారు. ద్రావణంలో ముంచి తీసిన టమాటోలతోపాటు సాధారణ టమాటోలను గది ఉష్ణోగ్రతలోను, వరండాలోను ట్రేలలో నిల్వ చేశారు. గదిలో ఉంచిన పండిన టమాటాలు మామూలువి 8–10 రోజులు మార్కెట్లో అమ్మదగినంత తాజాగా ఉండగా, ద్రావణంలో ముంచినవి 16–20 రోజులు తాజాదనాన్ని కోల్పోకుండా ఉన్నాయని డాక్టర్ శైలజ తెలిపారు. దోరగా ఉన్న టమాటోలు మామూలువి 12–14 రోజులు అమ్మదగినంత బాగుంటే.. ద్రావణంలో ముంచినవి 22–24 రోజుల పాటు నిల్వ ఉన్నాయి. గది వెలువల వరండాలో నిల్వ చేసిన టమాటోలు 4 రోజుల ముందే వడలిపోయాయని ఆమె తెలిపారు. కొద్ది పరిమాణంలో టమాటోలనే నిల్వ చేసి చూశామని, భారీ పరిమాణంలో నిల్వ చేసినప్పుడు ఫలితం ఎలా ఉండేదీ పరీక్షించాల్సి ఉందని డా. శైలజ వివరించారు. శ్రీమతి రాజు భర్త కనకారావు తోడ్పాటుతో ఈ ద్రావణాన్ని తయారు చేసి అర లీటరు రూ. వందకు విక్రయిస్తున్నారు. ఈ ద్రావణం టమాటో రైతులతోపాటు వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చని శ్రీమతి రాజు(96421 13002, 95738 19031) అంటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, పల్లెసృజన సంస్థల ద్వారా శాస్త్రీయ పరీక్షలు జరిపించి, పేటెంట్‌కు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె వివరించారు. శ్రీమతి దూబ రాజు -
చెప్పుకోదగ్గ సైంటిస్ట్
వారెవ్వా చిన్నారి! ఇంట్లోని పెద్దవాళ్లకు ఏదైనా సమస్య వచ్చిందంటే... పసివాళ్లపై కూడా ఆ ప్రభావం పడుతుంది. ప్రత్యేకించి ఆరోగ్యసమస్య అయితే దాని తీవ్రత పిల్లలపై మరింత ఎక్కువగా ఉంటుంది. అలా ఆ ఇంట్లో తలెత్తిన ఆ పరిస్థితే ఒక చిన్నారి శాస్త్రవేత్తను తయారు చేసింది. ముజామిల్ పాషా లోని ప్రతిభను ఆవిష్కరించింది. జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న షేక్ ముజామిల్ పాషాను ఇప్పుడు ‘నేషనల్ సైన్స్ ఇగ్నైట్ -2014’ అవార్డు గ్ర హీతగా పరిచయం చెయ్యాలి. మోకాలి నొప్పులతో బాధపడే వారి కోసం ప్రత్యేకమైన షూ ను కనిపెట్టినందుకు గానూ పాషాకు ఈ అవార్డు దక్కింది. ఆ అవార్డు రగిలించిన స్ఫూర్తితో, ఇప్పుడు మరిన్ని ఆవిష్కరణలతో అందరిదృష్టినీ ఆకర్షిస్తున్నాడు ఈ చిన్నారి. పాషా తాతగారికి మోకాళ్ల నొప్పులు. ఆయనను ఫిజియోథెరఫిస్ట్ వద్దకు తీసుకెళితే అసలు మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి, అందుకు కారణాలు ఏమిటో విపులంగా వివరించారు ఆ డాక్టర్. ఆ సమయంలో అక్కడే ఉన్న పాషాకు తాతగారి సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలనే ఆలోచన కలిగింది. ఫిజియోథెరఫీ చికిత్సపై ఏర్పడిన అవగాహనతో మోకాళ్ల నొప్పులకు సరికొత్త రకంగా ‘షూ’కు రూపకల్పన చేశాడు పాషా. సాధారణ షూ కు చిన్న మార్పు చేసి ఈ షూను ఆవిష్కరించాడు. ఆ మార్పు మనిషి నడక తీరులో కొంచెం మార్పు తెస్తుంది. దీంతో మోకాళ్ల నొప్పులు అనే సమస్య మాయం అవుతుంది. తాత విషయంలో ప్రాక్టికల్‌గా ఇది విజయవంతం కావడంతో తండ్రి సహకారంతో పాషా దీని పేటెంట్ కోసం నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్(ఎన్ఐఎఫ్)కు అప్లై చేశాడు. ఆ సంస్థ పాషా ప్రతిభను గుర్తించింది. ఇటీవల ఆహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతుల మీదుగా పాషా అవార్డును అందుకొన్నాడు. తను ఆవిష్కరించిన షూ వచ్చే ఏడాది ప్రోడక్ట్ రూపంలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా.. ఆలోపే పాషా ఎలక్ట్రో మాగ్నటిక్ షీల్డ్‌ను తయారు చేశాడు. ఇది కూడా అందరికీ ఉపయోగపడేదే. మొబైల్ఫోన్ల వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో దాని వల్ల రేడియేషన్ సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. ఆ రేడియేషన్‌ను తగ్గించేందుకు ‘ఎలక్ట్రో మాగ్నటిక్ షీల్డ్’ ను తయారు చేశాడు పాషా. ఈ ప్రయోగానికి నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ప్రోత్సాహం లభించింది. ఈ ఏడాది డిసెంబర్ 27 నుంచి 31 మధ్య బెంగళూరులో జరిగే నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ఫెయిర్‌లో పాషా ఈ షీల్డ్‌ను ప్రదర్శించబోతున్నాడు. ఈ చిన్నారి ఆవిష్కరించిన షూ అయినా... ఎలక్ట్రో మాగ్నటిక్ షీల్డ్ అయినా... విస్తృతంగా అందుబాటులోకి వస్తే చాలా ఉపయుక్తంగా ఉంటాయని చెప్పవచ్చు. ముజామిల్ తండ్రి చాంద్‌పాషా నిజాం కాలేజీలో పనిచేస్తారు. త ల్లి పర్వీన్ గృహిణి. తమ తనయుడు ఇప్పుడు జాతీయ స్థాయిలో పురస్కారాలను అందుకొంటున్నందుకు వీరు అమితానందంతో ఉన్నారు. -
పసుపు తవ్వె యంత్రం రెడీ
వ్యవసాయాన్ని వేధిస్తున్న సమస్యల్లో కూలీల కొరత ప్రధానమైంది. పండించే పంట ఏదైనా మొక్కనాటిన నుంచి కలుపుతీత, సస్యరక్షణ, నూర్పిడి వరకు మనిషి ప్రమేయం ఉండాల్సిందే. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సాగు చేయాలంటే దేశీ మార్కెట్లో అందుబాటులో ఉన్న యంత్రాలు సాధారణ రైతాంగానికి అందుబాటు ధరల్లో లేవు. ఐదారెకరాల్లోపు కమతాలున్న రైతులు లక్షలు వెచ్చించి భారీ యంత్రాలను కొనుగోలు చేసి వినియోగించే పరిస్థితి లేదు. పసుపు తవ్వకం వ్యయప్రయాసలతో కూడుకున్న పని. దీన్ని సులభతరం చేయ డానికి తమిళ రైతు రామరాజు కొత్త యంత్రాన్నే తయారు చేశారు. తమిళనాడులో పసుపు పండించే ప్రాంతాల్లో ఈరోడ్ జిల్లా ఒకటి. పసుపుసాగులో ముఖ్యఘట్టం దుంపల తవ్వకం. దుంపలు తవ్వి ఉడికించి ఎండబెట్టాలి. అప్పుడే మార్కెట్‌కు అనుగుణమైన పసుపు కొమ్ములు సిద్ధమవు తాయి. దుంపలు తవ్వితీయడమే అత్యంత కష్టమైన పని. దీనికి ఎక్కువ మంది కూలీల అవసరం ఉంటుంది. ఆ సమయంలో కూలీల కొరత వల్ల కూలీ రేట్లు కూడా పెరుగుతాయి. దీంతో ఖర్చు అసలుకన్నా కొసరుకెక్కువన్నట్లు పంటకాలం మొత్తానికి చేసిన ఖర్చుకన్నా దుంప తవ్వకానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. 2009లో తొలి ప్రయత్నం.. ఈరోడ్ జిల్లా కొత్తూంగర్ తోట్టోర్ పుదుపాల్యంకు చెందిన రైతు రామరాజు సేద్యంలో ఈ సమస్యలన్నిటినీ ఎదుర్కొన్నాడు. బాల్యం నుంచి వ్యవసాయ వృత్తిలోనే ఉన్న రామరాజుకు వివిధ పంటల సాగులో వివిధ దశల్లో వచ్చే సమస్యల పట్ల సవ్యమైన అవగాహన ఉంది. ఈ పరిస్థితిలో సాగు ఖర్చును తగ్గించేందుకు యంత్రపరికరాలను ఉపయోగించడమే శరణ్యమని భావించిన రామరాజు.. స్వ యంగా పసుపు తవ్వే యంత్రాన్ని తయారు చేయడానికి పూనుకున్నాడు. తొలుత 2009లో పది ఆశ్వ శక్తి గల పవర్ టిల్లర్‌ను ఉపయోగించి, దానికి ఒక బ్లేడ్ మూడు కర్రులు జత చేసి తవ్వకం పని చేశాడు. అయితే ఇది అనుకున్నంత మెరుగైన ఫలితం ఇవ్వలేదు. దీంతో 2011లో మరోప్రయత్నం చేశాడు. పాత యంత్రాన్ని ఆధునీకరించి మరో కొత్త పరికరాన్ని రూపొందించాడు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. దీనితో 95% దుంపలు, కొమ్ములు ఏమా త్రం దెబ్బతినకుండా తవ్వగలిగాడు. మినీ టిల్లర్‌తో కూడి న ఈ హర్వెస్టర్‌ను చూసిన రైతులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. మైరాడ కృషి విజ్ఞాన కేంద్రం ఈ పరికరాన్ని పరిశీలించి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రామరాజుకు ఫౌండేషన్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. - సాగుబడి డెస్క్ రైతులు నేరుగా రామరాజును గానీ లేదా ఫౌండేషన్‌ను గానీ సంప్రదించవచ్చు: నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, శాటిలైట్ కాంప్లెక్స్, ఎన్ఆర్ మన్సీ క్రాస్‌రోడ్స్, అహ్మదాబాద్ - 380015, గుజరాత్. bd@nifindia.org 22 అంగుళాల వెడల్పున తవ్వుతుంది.. పవర్ టిల్లర్ పీటీఓ షాఫ్ట్‌కు, పుల్లి, బెల్ట్ ద్వారా ఈ పరికరం అనుసంధానమై ఉంటుంది. ఓ పొడవైన బ్లేడ్‌కు మొనదేలి ఉండే కర్రులాంటి మూడు కమ్ములు బిగించి ఉంటాయి. టిల్లర్‌ను నడపడం మొదలు కాగానే పీటీఓ షాఫ్ట్ ద్వారా శక్తిని అందుకొని పుల్లీ ద్వారా హర్వెస్టింగ్ బ్లేడ్‌కు శక్తిని సరఫరా చేస్తుంది. నేల స్వభావాన్ని బట్టి ఈ యంత్రాన్ని రెండు వేగ పరిమితులతో వినియోగించుకోవచ్చు. ఒకేసారి 22 అంగుళాల వెడల్పున తవ్వుకుంటూ వెళ్లగలుగుతుంది. నేల స్వభావాన్ని బట్టి యంత్రం కర్రులు నేలలోకి దిగేలోతును సవరించుకోవచ్చు. కిందికి మీదికి కదులుతూ సాగే కర్రులు పసుపు దుంపలను తవ్వగా బ్లేడ్ వేరుచేస్తుంది. కనిష్టంగా గంటకు 20 సెంట్ల విస్తీర్ణంలో పసుపు దుంపలను దీని ద్వారా తవ్వుకోవచ్చు. గంటకు 1.5 లీటర్ల డీజిల్‌ను వినియోగించుకుంటుంది. పరికరం ఖరీదు రూ. 32 వేలవుతుంది. రైతులు ఆర్డరు ఇచ్చిన 15 రోజుల్లో ఈ పసుపు తవ్వే యంత్రాన్ని తయారు చేసి అందించగలను. - పి. రామరాజు,కొత్తూంగార్ తోట్టోర్ పుదుపాల్యం,కెట్టిసుమిందరం పోస్టు, భవానీ తాలుకా,ఈరోడ్ జిల్లా, తమిళనాడు ఫోన్: 04256 291941, 098651 71790