చెప్పుకోదగ్గ సైంటిస్ట్ | Significant Scientist | Sakshi
Sakshi News home page

చెప్పుకోదగ్గ సైంటిస్ట్

Published Thu, Dec 11 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

చెప్పుకోదగ్గ సైంటిస్ట్

చెప్పుకోదగ్గ సైంటిస్ట్

వారెవ్వా చిన్నారి!
 
ఇంట్లోని పెద్దవాళ్లకు ఏదైనా సమస్య వచ్చిందంటే... పసివాళ్లపై కూడా ఆ ప్రభావం పడుతుంది. ప్రత్యేకించి ఆరోగ్యసమస్య అయితే దాని తీవ్రత పిల్లలపై మరింత ఎక్కువగా ఉంటుంది. అలా ఆ ఇంట్లో తలెత్తిన ఆ పరిస్థితే ఒక చిన్నారి శాస్త్రవేత్తను తయారు చేసింది. ముజామిల్ పాషా లోని ప్రతిభను ఆవిష్కరించింది. జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది.

హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న షేక్ ముజామిల్ పాషాను ఇప్పుడు ‘నేషనల్ సైన్స్ ఇగ్నైట్ -2014’ అవార్డు గ్ర హీతగా పరిచయం చెయ్యాలి. మోకాలి నొప్పులతో బాధపడే వారి కోసం ప్రత్యేకమైన షూ ను కనిపెట్టినందుకు గానూ పాషాకు ఈ అవార్డు దక్కింది. ఆ అవార్డు రగిలించిన స్ఫూర్తితో, ఇప్పుడు మరిన్ని ఆవిష్కరణలతో అందరిదృష్టినీ ఆకర్షిస్తున్నాడు ఈ చిన్నారి.
 పాషా తాతగారికి మోకాళ్ల నొప్పులు. ఆయనను ఫిజియోథెరఫిస్ట్ వద్దకు తీసుకెళితే అసలు మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి, అందుకు కారణాలు ఏమిటో విపులంగా వివరించారు ఆ డాక్టర్. ఆ సమయంలో అక్కడే ఉన్న పాషాకు తాతగారి సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలనే ఆలోచన కలిగింది. ఫిజియోథెరఫీ చికిత్సపై ఏర్పడిన అవగాహనతో మోకాళ్ల నొప్పులకు సరికొత్త రకంగా ‘షూ’కు రూపకల్పన చేశాడు పాషా. సాధారణ షూ కు చిన్న మార్పు చేసి ఈ షూను ఆవిష్కరించాడు. ఆ మార్పు మనిషి నడక తీరులో కొంచెం మార్పు తెస్తుంది. దీంతో మోకాళ్ల నొప్పులు అనే సమస్య మాయం అవుతుంది. తాత విషయంలో ప్రాక్టికల్‌గా ఇది విజయవంతం కావడంతో తండ్రి సహకారంతో పాషా దీని పేటెంట్  కోసం నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్(ఎన్‌ఐఎఫ్)కు అప్లై చేశాడు. ఆ సంస్థ పాషా ప్రతిభను గుర్తించింది. ఇటీవల ఆహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతుల మీదుగా పాషా అవార్డును అందుకొన్నాడు.
  తను ఆవిష్కరించిన షూ వచ్చే ఏడాది ప్రోడక్ట్ రూపంలో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా.. ఆలోపే పాషా ఎలక్ట్రో మాగ్నటిక్ షీల్డ్‌ను తయారు చేశాడు. ఇది కూడా అందరికీ ఉపయోగపడేదే.

మొబైల్‌ఫోన్ల వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో దాని వల్ల రేడియేషన్ సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. ఆ రేడియేషన్‌ను తగ్గించేందుకు ‘ఎలక్ట్రో మాగ్నటిక్ షీల్డ్’ ను తయారు చేశాడు పాషా. ఈ ప్రయోగానికి నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ప్రోత్సాహం లభించింది. ఈ ఏడాది డిసెంబర్ 27 నుంచి 31 మధ్య బెంగళూరులో జరిగే నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ఫెయిర్‌లో పాషా ఈ షీల్డ్‌ను ప్రదర్శించబోతున్నాడు. ఈ చిన్నారి ఆవిష్కరించిన షూ అయినా... ఎలక్ట్రో మాగ్నటిక్ షీల్డ్ అయినా... విస్తృతంగా అందుబాటులోకి వస్తే చాలా ఉపయుక్తంగా ఉంటాయని చెప్పవచ్చు. ముజామిల్ తండ్రి చాంద్‌పాషా నిజాం కాలేజీలో పనిచేస్తారు. త ల్లి పర్వీన్ గృహిణి. తమ తనయుడు ఇప్పుడు జాతీయ స్థాయిలో పురస్కారాలను అందుకొంటున్నందుకు వీరు అమితానందంతో ఉన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement