పసుపు తవ్వె యంత్రం రెడీ | Turmeric excavation machine ready | Sakshi
Sakshi News home page

పసుపు తవ్వె యంత్రం రెడీ

Published Sun, Sep 7 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

పసుపు తవ్వె యంత్రం రెడీ

పసుపు తవ్వె యంత్రం రెడీ

వ్యవసాయాన్ని వేధిస్తున్న సమస్యల్లో కూలీల కొరత ప్రధానమైంది. పండించే పంట ఏదైనా మొక్కనాటిన నుంచి కలుపుతీత, సస్యరక్షణ, నూర్పిడి వరకు మనిషి ప్రమేయం ఉండాల్సిందే. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సాగు చేయాలంటే దేశీ మార్కెట్లో అందుబాటులో ఉన్న యంత్రాలు సాధారణ రైతాంగానికి అందుబాటు ధరల్లో లేవు. ఐదారెకరాల్లోపు కమతాలున్న రైతులు లక్షలు వెచ్చించి భారీ యంత్రాలను కొనుగోలు చేసి వినియోగించే పరిస్థితి లేదు. పసుపు తవ్వకం వ్యయప్రయాసలతో కూడుకున్న పని. దీన్ని సులభతరం చేయ డానికి తమిళ రైతు రామరాజు కొత్త యంత్రాన్నే తయారు చేశారు.

తమిళనాడులో పసుపు పండించే ప్రాంతాల్లో ఈరోడ్ జిల్లా ఒకటి. పసుపుసాగులో ముఖ్యఘట్టం దుంపల తవ్వకం. దుంపలు తవ్వి ఉడికించి ఎండబెట్టాలి. అప్పుడే మార్కెట్‌కు అనుగుణమైన పసుపు కొమ్ములు సిద్ధమవు తాయి. దుంపలు తవ్వితీయడమే అత్యంత కష్టమైన పని. దీనికి ఎక్కువ మంది కూలీల అవసరం ఉంటుంది. ఆ సమయంలో కూలీల కొరత వల్ల కూలీ రేట్లు కూడా పెరుగుతాయి. దీంతో ఖర్చు అసలుకన్నా కొసరుకెక్కువన్నట్లు పంటకాలం మొత్తానికి చేసిన ఖర్చుకన్నా దుంప తవ్వకానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.
 
2009లో తొలి ప్రయత్నం..
ఈరోడ్ జిల్లా కొత్తూంగర్ తోట్టోర్ పుదుపాల్యంకు చెందిన రైతు రామరాజు సేద్యంలో ఈ సమస్యలన్నిటినీ ఎదుర్కొన్నాడు. బాల్యం నుంచి వ్యవసాయ వృత్తిలోనే ఉన్న రామరాజుకు వివిధ పంటల సాగులో వివిధ దశల్లో వచ్చే సమస్యల పట్ల సవ్యమైన అవగాహన ఉంది. ఈ పరిస్థితిలో సాగు ఖర్చును తగ్గించేందుకు యంత్రపరికరాలను ఉపయోగించడమే శరణ్యమని భావించిన రామరాజు.. స్వ యంగా పసుపు తవ్వే యంత్రాన్ని తయారు చేయడానికి పూనుకున్నాడు. తొలుత 2009లో పది ఆశ్వ శక్తి గల పవర్ టిల్లర్‌ను ఉపయోగించి, దానికి ఒక బ్లేడ్ మూడు కర్రులు జత చేసి తవ్వకం పని చేశాడు.
 
అయితే ఇది అనుకున్నంత మెరుగైన ఫలితం ఇవ్వలేదు. దీంతో  2011లో మరోప్రయత్నం చేశాడు. పాత యంత్రాన్ని ఆధునీకరించి మరో కొత్త పరికరాన్ని రూపొందించాడు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. దీనితో 95% దుంపలు, కొమ్ములు ఏమా త్రం దెబ్బతినకుండా తవ్వగలిగాడు. మినీ టిల్లర్‌తో కూడి న ఈ హర్వెస్టర్‌ను చూసిన రైతులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. మైరాడ కృషి విజ్ఞాన కేంద్రం ఈ పరికరాన్ని పరిశీలించి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రామరాజుకు ఫౌండేషన్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది.     
- సాగుబడి డెస్క్
 
రైతులు నేరుగా రామరాజును గానీ లేదా ఫౌండేషన్‌ను గానీ సంప్రదించవచ్చు: నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, శాటిలైట్ కాంప్లెక్స్, ఎన్‌ఆర్ మన్సీ క్రాస్‌రోడ్స్, అహ్మదాబాద్ - 380015, గుజరాత్.  bd@nifindia.org
 
22 అంగుళాల వెడల్పున తవ్వుతుంది..
పవర్ టిల్లర్ పీటీఓ షాఫ్ట్‌కు, పుల్లి, బెల్ట్ ద్వారా ఈ పరికరం అనుసంధానమై ఉంటుంది. ఓ పొడవైన బ్లేడ్‌కు మొనదేలి ఉండే కర్రులాంటి మూడు కమ్ములు బిగించి ఉంటాయి. టిల్లర్‌ను నడపడం మొదలు కాగానే పీటీఓ షాఫ్ట్ ద్వారా శక్తిని అందుకొని పుల్లీ ద్వారా హర్వెస్టింగ్ బ్లేడ్‌కు శక్తిని సరఫరా చేస్తుంది. నేల స్వభావాన్ని బట్టి ఈ యంత్రాన్ని రెండు వేగ పరిమితులతో వినియోగించుకోవచ్చు. ఒకేసారి 22 అంగుళాల వెడల్పున తవ్వుకుంటూ వెళ్లగలుగుతుంది. నేల స్వభావాన్ని బట్టి యంత్రం కర్రులు నేలలోకి దిగేలోతును సవరించుకోవచ్చు. కిందికి మీదికి కదులుతూ సాగే కర్రులు పసుపు దుంపలను తవ్వగా బ్లేడ్ వేరుచేస్తుంది. కనిష్టంగా గంటకు 20 సెంట్ల విస్తీర్ణంలో పసుపు దుంపలను దీని ద్వారా తవ్వుకోవచ్చు. గంటకు 1.5 లీటర్ల డీజిల్‌ను వినియోగించుకుంటుంది. పరికరం ఖరీదు రూ. 32 వేలవుతుంది. రైతులు ఆర్డరు ఇచ్చిన 15 రోజుల్లో ఈ పసుపు తవ్వే యంత్రాన్ని తయారు చేసి అందించగలను.

- పి. రామరాజు,కొత్తూంగార్ తోట్టోర్ పుదుపాల్యం,కెట్టిసుమిందరం పోస్టు, భవానీ తాలుకా,ఈరోడ్ జిల్లా, తమిళనాడు
ఫోన్: 04256 291941, 098651 71790

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement