సామాజిక తెలంగాణ కోసం రథయాత్ర
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
సాక్షి, హైదరాబాద్: సామాజిక పునాదులపై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రథయాత్ర చేయనున్నారు. జనాభా దామాషా పద్ధతిన అన్నివర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యారంగాల్లో ప్రాతినిధ్యం కల్పించే ‘సామాజిక తెలంగాణ’ కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల 26న వరంగల్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆస్తుల పరిరక్షణకోసమే ‘సమైక్యం’: ఆస్తుల పరిరక్ష రక్షణ కోసమే రాజకీయ నేతలు సమైక్య ఉద్యమం చేస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు వంద నుంచి 10వేల ఎకరాల వరకు భూములను కలిగి ఉన్నారని, వాటి విలువే వేలకోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. రాష్ట్రం విడిపోవడం వారికి సమస్యే కాదని, ఆస్తులను కాపాడుకోవడమే సమస్య అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి, యూటీ, శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేసే కుట్ర చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని మంద కృష్ణ హెచ్చరించారు.