రేషన్ పక్కదారి | Ration by the wayside | Sakshi
Sakshi News home page

రేషన్ పక్కదారి

Published Fri, Jul 18 2014 2:29 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

Ration by the wayside

సాక్షి, అనంత పురం : చౌక దుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయి. పలువురు డీలర్లు పేదల పొట్ట కొడుతూ చౌక బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కిరోసిన్, చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోధుమలు, గోధుమపిండి అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతుండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చౌక బియ్యాన్ని జిల్లా నుంచి పొరుగునే ఉన్న కర్ణాటకకు తరలిస్తున్నారు. అక్కడ రీసైక్లింగ్ చేస్తూ సన్న బియ్యంగా మారుస్తున్నారు.
 
 బియ్యం అక్రమ రవాణాకు ఉరవకొండ కేంద్ర బిందువుగా ఉంది. గుంతకల్లు, అనంతపురం, శింగనమల, గుత్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల నుంచి కూడా అక్రమ రవాణా సాగుతోంది. మూడు నెలల క్రితం ఉరవకొండలోని టీడీపీ నేత గోదాములో దాదాపు మూడు వేల బస్తాల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన పప్పుశనగను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ.136 కోట్లుగా తేల్చారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసు నుంచి బయట పడటంతో పాటు సరుకును విడిపించుకోవడానికి ఆ నాయకుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
 
 గ్యాస్‌దీ అదే బాట : సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు కూడా పక్కదారి పడుతున్నాయి. సిలిండర్ల అక్రమ రవాణాకు కదిరి కేంద్ర బిందువుగా మారింది. తనకల్లులో డీలర్‌షిప్పు పొందిన ఓ గ్యాస్ డీలర్ కదిరి కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్నాడు. అతను మూడు నెలల క్రితం 20 సిలిండర్లను కదిరిలోని అడపాలవీధిలో తన బంధువుల ఇంట్లో అక్రమంగా నిల్వ చేసివుండగా పౌర సరఫరాల అధికారులు సీజ్ చేశారు. అయితే.. ఓ టీడీపీ నాయకుని ఒత్తిడితో ఆ కేసును నీరుగార్చారు. ఇలాంటి అక్రమాలను ఆ డీలర్ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు.
 502 కేసులు నమోదు : జిల్లాలో 2012 నుంచి 2014 మే మాసం వరకు నిత్యావసర సరుకుల అక్రమ రవాణా, నిల్వలపై పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి 502 కేసులు నమోదు చేశారు.
 
 191 కోట్ల 51 లక్షల 84 వేల 381 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను, వాటి రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. అయితే.. ఇప్పటి వరకు 200 కేసులను మాత్రమే పరిష్కరించారు. కొన్ని కేసులు రాజకీయ జోక్యంతో నీరుగారిపోయాయి. మరికొన్ని విచారణలో ఉన్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పీడీయాక్ట్ కింద కేసులు పెడతామని గతంలో అధికారులు హెచ్చరించారు. తర్వాత ఆ ఊసే లేదు. 6ఏ కేసులు మాత్రమే నమోదు చేస్తున్నారు. అక్రమార్కులు జరిమానాలతో బయటపడుతున్నారు తప్ప శిక్ష అనుభవించిన దాఖలాలు పెద్దగా లేవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement