బియ్యం కార్డులు మాయం
కడప నగరం భవానీనగర్‌కు చెందిన కె.రాఘవేంద్రరావు సరుకుల కోసం ప్రభుత్వ చౌక దుకాణానికి వెళ్లాడు. రద్దీ ఎక్కువగా ఉండడంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. తీరా ఆయన వంతు వచ్చింది. బియ్యం, చక్కెర తీసుకెళ్లేందుకు తెచ్చుకున్న సంచి ఓమారు విదిలించాడు. ఇంతలో నీ కార్డు కీరిజిష్టర్ నుంచి తొలగించారు....నీకు సరుకులు ఇవ్వడం కుదరదంటూ ఎఫ్‌పీ షాపు డీలర్ పిడుగులాంటి వార్త చెప్పడంతో హతాశుడయ్యాడు. చేసేది లేక దిగాలుగా ఇంటిముఖం పట్టాడు.
ఒక్క రాఘవేంద్రరావే కాదు.. జిల్లాలో వేలాది మంది పేదలకు ఇదే చేదు అనుభవం ఎదురవుతున్న పరిస్థితి. ఎందుకు తొలగిస్తున్నారో విషయం తెలియదు. ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఇదీ మన పౌరసరఫరాలశాఖ, ప్రభుత్వ తీరు.
కడప సెవెన్‌రోడ్స్: చాలారోజుల నుంచి తమకున్న రేషన్‌కార్డులను అర్ధంతరంగా ఎందుకు రద్దు చేశారో అర్థం కాక తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ వందలాది మంది పేదలు తిరుగుతున్నారు. ఇలాంటి బాధితులతో తహసీల్దార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్డులు డైనమిక్ కీ రిజిష్టర్ నుంచి ఎందుకు
తొలగించారో స్థానిక పౌరసరఫరాల సిబ్బంది కూడా చెప్పలేకపోతున్నారు. కడప నగరంలో 1,807 కార్డులను ఏ కారణం చెప్పకుండానే తొలగించారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో వివరణ కోసం రాష్ట్ర పౌరసరఫరాల అధికారులకు రాశారు. అయితే ఇప్పటిదాక ఎలాంటి సమాచారం అందలేదు.
ఇచ్చారు..రద్దుచేశారు
పోతే మూడవ విడత జన్మభూమి, ప్రజావాణి వంటి కార్యక్రమాల్లో తమకు రేషన్‌కార్డులు మంజూరు చేయాలంటూ వేలాది మంది ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. కార్డుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన నాల్గవ విడత జన్మభూమిలో ప్రభుత్వం జిల్లాలో సుమారు 57 వేల కొత్తకార్డులు పంపిణీ చేసింది. కడపలో 7 వేలకుపైగా కొత్త కార్డులు ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి బియ్యం, చక్కెర, కిరోసిన్ తదితర నిత్యావసరసరుకులు పొందవచ్చని కార్డుదారులు ఎంతో సంతోషించారు.
అయితే వీరి సంతోషం ఆవిరై పోవడానికి ఎంతో సమయం పట్టలేదు. నగరంలో 1,370 కొత్తకార్డులను రద్దు చేశారు. ప్రజా సాధికారసర్వే ఆధారంగా సేకరించిన వివరాల మేరకు వీరంతా అర్హులు కాదని పేర్కొంటూ కార్డులను తొలగించినట్లు చెబుతున్నారు. కార్డుల రద్దుకు దారితీసిన కారణాలను పరిశీలిస్తే ఏమాత్రం సహేతుకంగా లేవని పలువురు విమర్శిస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నారంటూ కొందరికి కార్డులు రద్దు చేశారు. అయితే తమకు ఎలాంటి ప్రాపర్టీ లేదని, ఉంటే ఎక్కడుందో చూపించాలని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకుండా తహసీల్దార్ కార్యాలయంలోని పౌరసరఫరాల సిబ్బంది తలలు బాదుకుంటున్నారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలున్నా..రద్దే
ఔట్‌సోర్సింగ్ కింద చిన్నా, చితకా ఉద్యోగాలు చేస్తున్న కొందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటూ కార్డులు తొలగించారు. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలు చేసుకుని జీవిస్తున్న తమ కార్డులు రద్దు చేయడం అన్యాయమని పలువురు వాపోతున్నారు. సరైన కారణం చూపకుండా ఎలా పడితే అలా ఇష్టానుసారంగా కార్డులు రద్దు చేయడంపై పేదలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పెద్ద సంఖ్యలో వస్తున్న ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించి సమాచారం ఇచ్చేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా కొంతమంది సిబ్బందిని నియమించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.
బియ్యం ఇవ్వం పొమ్మన్నారు:
నాకు రేషన్‌కార్డు ఇచ్చారు. ఏడాది కాలంగా చౌక దుకాణానికి వెళ్లి బియ్యం, ఇతర సరుకులు తెచ్చుకుంటున్నాను. గతనెల కూడా ఇలాగే రేషన్‌షాపు వద్దకు వెళ్లాను. నీ కార్డు తీసేశారని డీలర్ చెప్పడంతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను.
– పఠాన్ బీబీ, రామకృష్ణనగర్, కడప
రెండు నెలలుగా బియ్యం ఇవ్వలేదు
నేను చాలా పేదరాలిని. ప్రభుత్వం మాకు గతంలో బియ్యం కార్డు ఇచ్చింది. అయితే ఉన్నట్లుండి కార్డు తొలగించారు. దీంతో రెండు నెలల నుంచి బియ్యం అందలేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. – షేక్ బీబీ, మోచంపేట, కడప