శేఖర్‌బాబు, సరోజిని, చినవెంకటరెడ్డి కుటుంబాలే కాదు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఇలాంటి ఎందరో బాధితులు అధికారుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూలి పనులు చేసుకుని పొట్ట పోసుకునే పేదలు ఉద్యోగుస్తులంటూ రేషన్ సరుకులు కోల్పోవడంతో పాటు పింఛన్ పోతుందనే భయంతో తహశీల్దార్ కార్యాలయాలకు తరలివస్తున్నారు.
సాక్షి, చీరాల (ప్రకాశం): ప్రజాపంపిణీ వ్యవస్థలో అధికారులు చేస్తున్న తప్పుల కారణంగా కూలీనాలి చేసుకునే అమాయకులు బలవుతున్నారు. కూలి పనులు చేసుకునే వారు ఉద్యోగులుగా ప్రజా సాధికార సర్వేలో నమోదు కావడంతో వారికిప్పుడు రేషన్ సరుకులు అందడం లేదు. ప్రస్తుతం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ఉద్యోగుల ఆధార్ సంఖ్యను రేషన్ కార్డుల జాబితాతో సరిపోల్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తెల్లరేషన్‌కార్డున్న వారి వివరాలు బయటపడడంతో ఆయా కార్డులను ఈనెలలో తొలగించే జాబితాలో చేర్చారు. గతంలో రేషన్ కార్డులకు ఆధార్‌కార్డు అనుసంధానం చేసిన సమయంలో పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. రేషన్ డీలర్లు లబ్ధిదారుల ఆధార్ నంబర్లు సేకరించి రెవెన్యూ కార్యాలయంలో సమర్పించారు.
ఆయా కార్డులకు ఆధార్ సంఖ్యలను అనుసంధానం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి ఆధార్ నంబర్లు రేషన్‌కార్డులకు తప్పుగా అనుసంధానమయ్యాయి. ప్రజాసాధికార సర్వేలో పలువురు నిరక్షరాస్యులు తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేరుగా ఉన్నా తెలియక తమ కుటుంబంలోనే ఉన్నట్లు నమోదు చేయించారు. ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగం అంటూ రేషన్ కార్డు తొలగించిన వాటిలో పలువురు పేద ప్రజలు కూడా ఉన్నారు. దీంతో ఈనెల రేషన్ షాపుల్లో నిత్యవసర సరుకులు వారు తీసుకునేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో కార్డులు చేతపట్టుకుని తహశీల్దార్ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు.
తాము కూలి పనులు చేసుకునే వారమని, ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెబుతూ ఆధార్ కార్డు అందించినా ప్రయోజనం ఉండడం లేదు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపడం వలన రేషన్ సరుకులు తీసుకోలేకపోయామని వాపోతున్నారు. అధికారులు చేస్తున్న లోపాల కారణంగా అర్హులైన వారు కూడా రేషన్ సరుకులు అందుకోలేకపోతున్నారు. కూలి పనులు చేసుకుంటూ పొట్ట నింపుకునే పేదలు, చిన్నా చితక పనులు చేసుకుంటూ రోజువారీ జీతం తీసుకునే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు తీసుకుంటూ పొట్టనింపుకునే వారు. అయితే సాధికార సర్వేలో జరిగిన తప్పిదాల వలన వారంతా రేషన్ సరుకులను అందుకోలేని పరిస్థితి.
ఈ సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకుని సరిదిద్దుకునే లోపు ప్రజలు రేషన్ సరుకులు అందుకోలేకపోయారు. ఈ తప్పును ఎలా సరిదిద్దుతారో అధికారులే చెప్పాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారులు మాత్రం అర్హులైన వారి కార్డులు ఇన్ యాక్టివేట్‌లో ఉన్నప్పటికీ వాటిని యాక్టివేషన్ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
తప్పిదాలు ఎన్నెన్నో..
► చీరాల శాంతినగర్ నివాసి కోలా శేఖర్‌బాబు. ఇతనికి భార్య రత్నకుమారి, శిరీష, అనూష అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను ఉద్యోగం చేస్తున్నాడంటూ ఈనెలలో రేషన్ సరుకులు ఇవ్వలేదు. ఇదేమని డీలర్‌ను ప్రశ్నిస్తే నువ్వు ఉద్యోగస్తుడవు అని సర్వేలో తేలిందని బదులిచ్చాడు. కూలి పని చేసే తాను ఎప్పుడు ఉద్యోగి అయ్యానంటూ లబోదిబోమన్నాడు. సోమవారం స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు.
► చీరాల 8వ వార్డుకు చెందిన ఆట్ల సరోజినికి భర్త లేడు. కొడుకు, కోడలు కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరికి ఉద్యోగం ఉందంటూ రేషన్ కట్ చేశారు. డీలర్ మాటలకు నోరెళ్లబెట్టిన వీరు కూడా స్పందనలో అధికారులను ఆశ్రయించారు.
► పొదిలి మండలం ఈగలపాడు మారం చినవెంకటరెడ్డి దంపతులు వ్యవసాయ కూలీలు. కుమార్తెలు పెళ్లిళ్లయి మెట్టినింటికి వెళ్లిపోగా దంపతులిద్దరూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రతి నెలలాగే ఈ సారి కూడా రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు చౌకధరల దుకాణానికి వెళ్లారు. కార్డు ఆగిపోయిందని రేషన్ ఇవ్వడం కుదరదని డీలర్ చెప్పడంతో కంగుతిన్నారు. ఉన్నట్టుండి తమ కార్డు ఎందుకు పనిచేయడం లేదో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు.
అర్జీ పెడితే డీఎస్‌వోకు పంపుతాం..
అర్హులైన కొందరి రేషన్ కార్డులు తొలగింపు జాబితాలోకి వెళ్లాయి. తాము ప్రస్తుతం ఏ సర్వే చేపట్టలేదు. ఎవరివైనా రేషన్ కార్డులు ఇన్ యాక్టివ్‌లో ఉన్నట్టు గుర్తిస్తే అర్జీ పెట్టుకుంటే వాటిని డీఎస్‌ఓకు పంపి వాటిని యాక్టివ్ అయ్యేలా చేస్తాం.
– విజయలక్ష్మి, తహశీల్దార్, చీరాల
Comments
Please login to add a commentAdd a comment