రేషన్ డీలర్లపై కేసులు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు డీలర్లపై తహశీల్దార్ వెంకటిశివ కేసులు నమోదు చేయించారు. ఆయన సోమవారం దొప్పెర్ల, నునపర్తి, గండివానిపాలెం, మడుతూరు రేషన్‌డిపోలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. గండివానిపాలెంలో డీలర్ నాగులపల్లి కన్నయ్య బియ్యం పంపిణీలో చేతివాటం చూపించారు. బియ్యం తూయడానికి కిలో బరువైన ఇనుప డబ్బాని వినియోగించారు.
డబ్బా బరువును తూనిక రాళ్లవైపు చూపించడానికి గుడ్డలతో తయారు చేసిన మూటను కట్టారు. చూసేవారికి సక్రమంగా ఉన్నట్టు కనిపించింది. తూనికలో కిలో తరుగు వస్తోంది. పదికిలోలు ఇచ్చేవారికి ఐదుకిలోల వంతున రెండుదఫాలు తూయడంతో లబ్దిదారుడికి ఎనిమిది కిలోలే అందాయి. మడుతూరులో డీలర్ శ్రీను ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఇక్కడ ప్లాస్టిక్ డబ్బా, ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుపడబ్బా ఉన్నాయి. ప్లాస్టిక్ డబ్బాతో 20 గ్రాముల తరగు వచ్చింది.
ఇనుప డబ్బాతో కిలో తరుగు వచ్చింది. తనిఖీ సమయంలో ఇనుపడబ్బా వినియోగించి అడ్డంగా దొరికిపోయారు. మడుతూరు, దోసూరు పంచాయతీల రేషన్‌డిపోలను ఈయన నిర్వహిస్తున్నారు. తహశీల్దార్ ఇద్దరి డిపోలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తుపాను బాధితులకు సరుకుల పంపిణీ బాధ్యత విఆర్‌ఓలకు అప్పగించారు. ఇద్దరిపై కేసు పెట్టినట్టు ఎస్‌ఐ నర్సింగరావు తెలిపారు.
విజిలెన్స్ తనిఖీలు
సోమవారం మాకవరపాలెం మండల కేంద్రంతోపాటు శెట్టిపాలెం గ్రామాల్లో ఉన్న రేషన్‌డిపోలను విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. మండల కేంద్రంలోని షాపు నంబర్ 17లో డీలర్ బియ్యం కొలతల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. దీనిపై రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేశారు. శెట్టిపాలెంలో రేషన్‌డిపోలో కాకుండా వేరొక ప్రదేశంలో సరుకులు నిల్వచేసినట్టు గుర్తించి డీలర్‌ను హెచ్చరించారు. దీంతో డీలర్ అక్కడి నుంచి సరుకులను డిపోకు తరలించారు.
డీలర్ సస్పెన్షన్
నక్కపల్లి మండలం బంగారయ్యపేట రేషన్‌డిపో డీలర్ చేపల జ్యోతిపై సస్పెన్షన్ వేటుపడింది. డీలర్ కార్డుదారుల నుంచి రూ.20లు చొప్పున వసూలు చేయడం, బియ్యంలో కోత విధించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆదివారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్‌డీవో విచారణకు ఆదేశించారు. సోమవారం డిప్యూటీ తహశీల్దార్‌లు లక్ష్మీనరసమ్మ, రమాదేవి, ఆర్‌ఐ రమలు గ్రామంలో విచారణ చేపట్టారు. గ్రామస్తులంతా డీలర్ పాల్పడుతున్న అక్రమాలను విచారణాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డిపోలో స్టాకు పరిశీలించగా ఏడు క్వింటాళ్ల 80 కిలోల బియ్యం తక్కువ ఉన్నట్టు గుర్తించారు. డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసి సస్పెండ్ చేసినట్టు విచారణాధికారులు తెలిపారు. బంగారయ్యపేటకు ఇన్‌చార్జ్‌గా డీఎల్‌ఫురం డీలర్‌కు బాధ్యతలు అప్పగించినట్టు వారు తెలిపారు.
తూనికల్లో తేడా
కె.కోటపాడు మండలంలోని ఆనందపురం, కె.సంతపాలెం, గొల్లలపాలెం, చంద్రయ్యపేట, కింతాడ, ఆర్లి గ్రామాలలో గల రేషన్ డిపోలలో విజిలెన్స్ ఎస్‌ఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఆనందపురం, కె.సంతపాలెం గ్రామాల రేషన్ డిపోల్లో తూనికల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. విషయాన్ని విజిలెన్స్ ఎస్పీ వి.సురేష్‌బాబు దృష్టికి తీసుకువెళ్లి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.