సెప్టెంబర్‌ 1 నుంచి బియ్యం డోర్‌ డెలివరీ | Ration Rice Door Delivery In AP From 1st September | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 1 నుంచి బియ్యం డోర్‌ డెలివరీ

Published Fri, May 8 2020 7:48 PM | Last Updated on Fri, May 8 2020 7:56 PM

Ration Rice Door Delivery In AP From 1st September - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌ డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు రావాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సమీక్షల్లో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో నాణ్యమైన బియ్యం రాష్ట్రవ్యాప్తంగా డోర్‌ డెలివరీ చేయడానికి పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది.
(రూ.30 కోట్లు ఎక్స్‌‌గ్రేషియా విడుదల)

ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి..
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రభుత్వం  ప్రత్యేక దృష్టిసారించింది. రేషన్‌ పంపిణీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది అవినీతిని రూపుమాపడంతో పాటు పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీని కోసం ప్రత్యేకంగా బియ్యం కార్డులను తీసుకు వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన వారందరికీ కార్డులు మంజూరుచేసే వ్యవస్థనూ మొదలుపెట్టింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం అందించడానికి సామాజిక తనిఖీలో భాగంగా సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ఉంచడమే కాకుండా, పేరులేని వారు ఎవరికి దరఖాస్తు చేయాలన్నదానిపై కూడా వివరాలు ఉంచింది. వాటి ఆధారంగా దరఖాస్తు చేసిన వారివి కూడా పరిశీలించి వారికి బియ్యం కార్డులను అధికారులు మంజూరు చేశారు.  దీన్ని ఇంతటితో వదిలేయకుండా.. అర్హత ఉన్న వారికి బియ్యం కార్డులు మంజూరు అన్నది నిరంతర ప్రక్రియగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
(‘మనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌’) 

బియ్యం నాణ్యతపై..
అంతేకాకుండా బియ్యం నాణ్యతపైన కూడా ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం తినలేని విధంగా ఉండడంతో  ఆ బియ్యాన్ని దళారులకు అమ్ముకునేవారు. మళ్లీ ఆ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి మరలా మార్కెట్లోకి తీసుకు వచ్చేవారు. దీంతో పేదలకు నాణ్యమైన బియ్యం అందకపోవడంతోపాటు, అవినీతి చోటుచేసుకునేది. ఎన్నికల హామీల్లో భాగంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే తాజా ఆదేశాలు ఇచ్చారు. 

పకడ్బందీగా..
రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టింది. నాణ్యమైన బియ్యాన్ని సేకరించడం, ఆ బియ్యాన్ని ప్యాక్‌ చేయడం, ఇంటికే డోర్‌ డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. నాణ్యమైన బియ్యాన్ని అందుకుంటున్న వారి నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం అమల్లో ఎదురవుతున్న సమస్యలు, వాటిని పరిష్కరించి మరింత మెరుగ్గా, పటిష్టంగా అమలు చేయడంపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష చేసుకుని ఇప్పుడు పకడ్బందీ విధానాన్ని రూపొందించుకున్నారు. ఎక్కడెక్కడ ధాన్యం సేకరించాలి, వాటిని శుద్ధిచేయడమెలా, అదేసమయంలో కల్తీ లేకుండా చూసుకునేలా ఈ విధానాన్ని తీర్చిదిద్దారు. 

ఇలా డోర్‌ డెలివరీ చేస్తాం..
నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీని శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ మొదలుపెట్టామని సివిల్‌ సప్లైస్‌ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు 6 నుంచి ఆ జిల్లాలో ఇది అమలవుతోంది. పైలట్‌ ప్రాజెక్టులో మాకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని డోర్‌డెలివరీ చేయబోతున్నాం. పర్యావరణ సంబంధిత అంశాలనూ పరిగణలోకి పరిగణలోకి తీసుకున్నాం. లబ్ధిదారులకు పారదర్శక పద్ధతిలో, అవినీతికి తావులేకుండా, నాణ్యమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గోడౌన్ల నుంచి వచ్చే ప్రతి గన్నీ బ్యాగుపై కూడా స్ట్రిప్‌ సీల్‌ ఉంటుంది. అలాగే ప్రతి బ్యాగుపైనా బార్‌ కోడ్‌ ఉంటుందని తెలిపారు.

కల్తీ లేకుండా, రవాణాలో అక్రమాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండేలా 13,370 మొబైల్‌ యూనిట్లను పెడుతున్నాం. ఇందులోనే ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషిన్‌ ఉంటుంది. ఈ మొబైల్‌ యూనిట్ల ద్వారా ప్రతి లబ్దిదారుని ఇంటికివెళ్లి బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తాం. లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్‌ను ఓపెన్‌చేసి వారికి నిర్దేశించిన కోటా ప్రకారం బియ్యాన్ని అందిస్తాం. బియ్యాన్ని తీసుకోవడంకోసం లబ్ధిదారునికి నాణ్యమైన సంచులను ఉచితంగా అందిస్తున్నాం. ప్రతినెలా 2.3లక్షల మెట్రిక్‌ టన్నుల నాణ్యమైన బియ్యాన్ని డోర్‌డెలివరీ చేయడానికి నిర్ణయించామని కోన శశిధర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement