ఆగని రేషన్ బియ్యం అక్రమ రవాణా
Published Mon, Feb 24 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ :పేదల బియ్యాన్ని అక్రమంగా తరలించుకుపోతున్న రేషన్ మాఫియాపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విజిలెన్స్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి సీరియస్‌గా తీసుకున్నా.. ఇతర శాఖల అధికారులు కలసి రాకపోవడంతో అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో స్థానికులు నేరుగా విజిలె న్స్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నారు. పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రూ.1 కిలోబియ్యం పథకం పక్కదారి పడుతోంది. మూడురోజుల్లోనే పట్టణంలో రెండుసార్లు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. చట్టంలోని లొసుగులను సొమ్ముచేసుకుంటున్న అక్రమార్కులు ఎన్నిసార్లు పట్టుబడినా యధేచ్ఛగా తమ కార్యకలాపాలు, వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
ఉదాహరణకు జానపాడు పంచాయతీ పరిధిలో ఉన్న బత్తుల వెంకటేశ్వర్లు మిల్లులో రేషన్‌బియ్యం ఎన్నిసార్లు పట్టుబడ్డాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పట్టణానికే చెందిన బత్తుల బాలయ్య, అతని అనుచరులు అధికారులకు పట్టుబడుతున్నా మళ్లీ మళ్లీ తమ వ్యాపారాలను కొనసాగిస్తుండడం గమనార్హం! దాచేపల్లికి చెందిన మందపాటి నరసింహారావుతోపాటు మరికొందరు, రెంటచింతలకు చెందిన కొందరు పల్నాడులో యధేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. అధికారులు మాత్ర ం నామమాత్రపు కేసులతో సరిపుచ్చుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఓ వైపు రేషన్‌బియ్యం అక్రమ రవాణాపై కలెక్టర్‌తోపాటు జేసీ, ఇతర ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నా కిందిస్థాయి అధికారుల అలసత్వం, అవినీతి వల్ల అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోతోంది.
అక్రమార్కులపై చర్యలేవీ ?
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులను జిల్లావ్యాప్తంగా గుర్తించామని, వారిపై బహిష్కరణ వేటువేస్తామని గతంలో బియ్యం పట్టుబడ్డ సమయంలో విజిలెన్స్ ఎస్పీ ప్రకటించారు. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో అక్రమ రవాణాదారులు పేట్రేగిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెల్లకార్డుదారులు కోరుతున్నారు. ఈ విషయంపై విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి వివరణ కోరగా.. రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులపై పీడీ యాక్టు విధించాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి కలెక్టర్‌కు ఆదేశాలువచ్చాక పీడీ యాక్టు విధిస్తామని తెలిపారు.
Advertisement
Advertisement