నేటి నుంచి రావాలి జగన్‌.. కావాలి జగన్‌ | Ravali Jagan Kavali Jagan Programme In Prakasam | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రావాలి జగన్‌.. కావాలి జగన్‌

Published Mon, Sep 17 2018 11:59 AM | Last Updated on Mon, Sep 17 2018 11:59 AM

Ravali Jagan Kavali Jagan Programme  In Prakasam - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో గ్రామ గ్రామాన మరోమారు ప్రచారం నిర్వహించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. రావాలి జగన్‌–కావాలి జగన్‌ పేరుతో సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. పార్టీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను, వాటివల్ల ప్రజలకు జరిగే మేలును ఈ సందర్భంగా  ప్రజలకు వివరించనున్నారు. అదే సమయంలో అధికార పార్టీ శాసన సభ్యులు, ముఖ్యనేతలతో పాటు  గ్రామస్థాయి నేతల దోపిడీని ఎత్తి చూపనున్నారు. పనులు చేయకుండానే ప్రజాధనాన్ని దోచుకుతినడం, సంక్షేమ పథకాలను అర్హులకు కాకుండా అనర్హులకు అప్పగించడం, ప్రతి పనిలోనూ కమీషన్లు పుచ్చుకోవడం తదితర అక్రమాలను ప్రజల ముందుంచనున్నారు. ఎన్నికల సమయంలోనూ ఆ తరువాత  స్థానిక నేతలతోపాటు ముఖ్యమంత్రి జిల్లాకు ఇచ్చిన వందలాది హామీలను పట్టించుకోకపోవడాన్ని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రజలకు గుర్తు చేయనున్నారు.

ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన  పనులు తప్ప నాలుగున్నరేళ్ల పాలనలో మిగిలి ఉన్న అరకొర పనులను  చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోకపోవడాన్ని ప్రజలకు వివరించనున్నారు. రామాయపట్నం పోర్టు, దొనకొండ, కనిగిరిలో పరిశ్రమలు నెలకొల్పుతామన్న హామీలను తుంగలో తొక్కడం, మూడు సంవత్సరాలవుతున్నా కనీసం ట్రిపుల్‌ ఐటీకి భవనాలు కూడా  ప్రభుత్వం నిర్మించకపోవడాన్ని  వైఎస్సార్‌ సీపీ నేతలు  ప్రజల ముందుంచనున్నారు. ఒంగోలు డెయిరీని పతనావస్థకు చేర్చడం, పీడీసీసీబీని నిర్వీర్యంచేయడం, కరువు రైతులను పట్టించుకోకపోవడం, సాగర్‌ జలాలు వచ్చినా సకాలంలో నీళ్లివ్వకపోవడం, రైతులకు వరి విత్తనాలను  అందించకపోవడంతో పాటు జిల్లాకు ఇచ్చిన వందలాది హామీలను టీడీపీ సర్కార్‌ తుంగలో తొక్కడాన్ని  వైఎస్సార్‌సీపీ నేతలు  ఎత్తి చూపనున్నారు. జిల్లాలో సోమవారం నుంచి మూడు నెలల పాటు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో  కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి నెలా 20 రోజులకు తగ్గకుండా నేతలు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పార్టీ నేతలు ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లి జనంలో ఉండి ప్రచారం చేస్తారు.  రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి  పిలుపునిచ్చారు. ప్రజలు సైతం  కార్యక్రమంలో పాల్గొని మద్దతు పలకాలని ఆయన కోరారు.

జగన్‌ సీఎం అయితేనే జిల్లా అభివృద్ధి: మాజీ మంత్రి బాలినేని
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే తిరిగి వైఎస్‌ పాలన వస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి  పేర్కొన్నారు. వైఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. జిల్లాకు సంబంధించి ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ సర్కార్‌ నెరవేర్చలేదన్నారు. వెలిగొండపై బాబు మాయమాటలు చెబుతున్నాడన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. ప్రజలు పాల్గొని కార్యక్రమాన్న విజయవంతం చేయాలన్నారు.  వైఎస్సార్‌ సీపీకి  రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ వైఎస్సార్‌ సీపీకి మద్దతు పలకాలని బాలినేని పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement