పోలీసు కస్టడీకి రావెల సుశీల్
హైదరాబాద్: మహిళను వేధించిన కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్, అతని డ్రైవర్ రమేష్‌లను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 3న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేడ్కర్ బస్తీకి చెందిన టీచర్ ఫాతిమా బేగంను వెంబడించి, వేధించిన ఘటనలో సుశీల్, రమేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నిందితులను విచారించేందుకు కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు మధ్యాహ్నం 2.30 గంటలకు నిందితులిద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు.
ఇది ప్రతిపక్ష కుట్ర: సుశీల్
తనపై కేసు నమోదు చేయడం వెనక ప్రతిపక్ష పార్టీ హస్తముందని రావెల సుశీల్ ఆరోపించారు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుశీల్ మాట్లాడుతూ.. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. ఆ ఘటనలో కేసు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. తాను మంత్రి కుమారుడినైనందునే కేసు పెద్దదైందన్నారు.