ravela Sushil
-
రావెల సుశీల్‌పై కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి రాజా ఇలంగో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుశీల్ డ్రైవర్ మణికొండ రమేష్‌బాబుపై నమోదైన కేసును కూడా కొట్టి వేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారు ఫాతిమా బేగంతో రాజీ కుదిరిందని పేర్కొంటూ సుశీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ ఇలంగో విచారించారు. పిటిషనర్లు, ఫిర్యాదుదారులు రాజీకి రావడంతో కే సును కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫాతిమా బేగం పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు పోలీసులు సుశీల్, అతని డ్రైవర్‌పై గత నెలలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
రావెల సుశీల్‌పై కేసు కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్ కారు నడుపుతూ ఓ ముస్లిం యువతి చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చిన విషం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. దీనిపై పోలీసులు సుశీల్ పై కేసులు కూడా పెట్టారు. అయితే ఈ కేసులో బాధితురాలుగా ఉన్న మహిళ కోర్టుకు వచ్చి రావెల కిశోర్ ఎవరో తనకు తెలియదని అఫిడవిట్ ఇచ్చింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సుశీల్ పై పెట్టిన కేసును తొలగిస్తున్నట్టు హైకోర్టు వెల్లడించింది. తనపై పోలీసులు మోపిన అభియోగాలు తప్పుడువని చెబుతూ, ఇటీవల కోర్టులో సుశీల్ తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా, బాధితురాలిగా పోలీసులు పేర్కొన్న మహిళ తనకు సుశీల్ ఎవరో తెలియదని చెప్పడంతో కేసు వీగిపోయింది. -
ముగిసిన రావెల సుశీల్ పోలీస్ కస్టడీ
హైదరాబాద్: మహిళా టీచర్‌ను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్(24)కు రెండు రోజుల పోలీస్ కస్టడీ శుక్రవారం ముగిసింది. ఈ ఘటనలో మరింత సమాచారం రాబట్టేందుకు బంజారాహిల్స్ పోలీసులు సుశీల్‌ను కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ రవీందర్‌లు సుశీల్‌తో పాటు అతని డ్రైవర్ మణికొండ రమేష్(22)ను ప్రశ్నించారు. ఘటనా స్థలంలో ఉపయోగించిన కారు ఎవరిది, దానిపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అంటించారు, మహిళా టీచర్ ఫాతిమా బేగం వెళ్లిన మార్గంలో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది తదితర అంశాలపై పోలీసులు ఆరా తీశారు. తాను వెళుతుండగా ముద్దొచ్చే ఓ కుక్కపిల్ల కనిపించిందని, దాన్ని ఆడించేందుకు వెనక్కి వచ్చానని సుశీల్ చెప్పినట్టు సమాచారం. కుక్కపిల్లతో ఆడుతుండగానే దాదాపు పది మంది తనను కొట్టారని పేర్కొన్నారు. కారు తన సన్నిహితుడు నారాయణ స్వామిదని, కొద్ది రోజులు వాడుకునేందుకు తీసుకున్నానని వెల్లడించినట్టు తెలిసింది. బాధితురాలి వాంగ్మూలం, ప్రత్యక్ష సాక్షులను విచారించిన పోలీసులు ఈ కేసులో సుశీల్ పాత్రపై ఆధారాలు మరిన్ని సేకరించినట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో సుశీల్, ఆయన కారు డ్రైవర్ రమేష్‌ను శుక్రవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
కోర్టుకు రావెల కుమారుడు
హైదరాబాద్: మహిళను వేధించిన కేసులో మంత్రి రావెల కుమారుడు సుశీల్‌ను బంజారా హిల్స్ పోలీసులు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అతడికి అంతకు ముందు విధించిన రెండు రోజుల కస్టడీ ముగియడంతో కోర్టుకు తీసుకొచ్చారు. మహిళను వేధించిన కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్, అతని డ్రైవర్ రమేష్‌లను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 3న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేడ్కర్ బస్తీకి చెందిన టీచర్ ఫాతిమా బేగంను వెంబడించి, వేధించిన ఘటనలో సుశీల్, రమేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిని విచారించేందుకు కోర్టు రెండు రోజులపాటు పోలీసు కస్టడీ విధించింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని శుక్రవారం కోర్టుకు తరలించారు. కోర్టులో విచారణ అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. -
పోలీసు కస్టడీకి రావెల సుశీల్
హైదరాబాద్: మహిళను వేధించిన కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్, అతని డ్రైవర్ రమేష్‌లను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 3న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేడ్కర్ బస్తీకి చెందిన టీచర్ ఫాతిమా బేగంను వెంబడించి, వేధించిన ఘటనలో సుశీల్, రమేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నిందితులను విచారించేందుకు కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు మధ్యాహ్నం 2.30 గంటలకు నిందితులిద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. ఇది ప్రతిపక్ష కుట్ర: సుశీల్ తనపై కేసు నమోదు చేయడం వెనక ప్రతిపక్ష పార్టీ హస్తముందని రావెల సుశీల్ ఆరోపించారు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుశీల్ మాట్లాడుతూ.. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. ఆ ఘటనలో కేసు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. తాను మంత్రి కుమారుడినైనందునే కేసు పెద్దదైందన్నారు.