ముగిసిన రావెల సుశీల్ పోలీస్ కస్టడీ
హైదరాబాద్: మహిళా టీచర్‌ను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్(24)కు రెండు రోజుల పోలీస్ కస్టడీ శుక్రవారం ముగిసింది. ఈ ఘటనలో మరింత సమాచారం రాబట్టేందుకు బంజారాహిల్స్ పోలీసులు సుశీల్‌ను కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ రవీందర్‌లు సుశీల్‌తో పాటు అతని డ్రైవర్ మణికొండ రమేష్(22)ను ప్రశ్నించారు. ఘటనా స్థలంలో ఉపయోగించిన కారు ఎవరిది, దానిపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అంటించారు, మహిళా టీచర్ ఫాతిమా బేగం వెళ్లిన మార్గంలో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది తదితర అంశాలపై పోలీసులు ఆరా తీశారు.
తాను వెళుతుండగా ముద్దొచ్చే ఓ కుక్కపిల్ల కనిపించిందని, దాన్ని ఆడించేందుకు వెనక్కి వచ్చానని సుశీల్ చెప్పినట్టు సమాచారం. కుక్కపిల్లతో ఆడుతుండగానే దాదాపు పది మంది తనను కొట్టారని పేర్కొన్నారు. కారు తన సన్నిహితుడు నారాయణ స్వామిదని, కొద్ది రోజులు వాడుకునేందుకు తీసుకున్నానని వెల్లడించినట్టు తెలిసింది. బాధితురాలి వాంగ్మూలం, ప్రత్యక్ష సాక్షులను విచారించిన పోలీసులు ఈ కేసులో సుశీల్ పాత్రపై ఆధారాలు మరిన్ని సేకరించినట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో సుశీల్, ఆయన కారు డ్రైవర్ రమేష్‌ను శుక్రవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు.