న్యాయం చేయండి
♦ చెంచయ్య మృతదేహంతో కుటుంబసభ్యులు, గిరిజన సమాఖ్య నాయకుల రాస్తారోకో
♦ మంత్రి రావెల రాజీనామా చేయాలని డిమాండ్
నెల్లూరు(సెంట్రల్) : కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న కొడుకు చనిపోయాడని, ఇక మాకు దిక్కెవరని పొర్లుకట్ట ఘనటలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన తిరువాది చెంచయ్య తల్లి జానకమ్మ ఆవేదన వ్యక్తంచేసింది. చెంచయ్య కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరులోని పొర్లుకట్ట వద్ద బాణసంచా గోదాము జరిగిన ప్రమాదంలో 14 మంది మృతి చెందితే కనీసం పరామర్శకు కూడా రాని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సమాఖ్య నాయకులు చెంచయ్య మృతదేహాన్ని నెల్లూరులోని వీఆర్సీ వద్ద ఉంచి రాస్తారోకో నిర్వహించారు.
సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంధళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ దళిత, గిరిజనుల అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పుకునే సీఎం చంద్రబాబునాయుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఇప్పటివరకు బాధితుల కుటుంబాలను పరామర్శించక పోవడం సిగ్గుచేటన్నారు. మంత్రి రావెల వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రమాదకర ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుని జీవిస్తున్న గిరిజనులకు ఆ శాఖ ద్వారా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. బాణసంచా పేలుడు ఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మృతదేహాన్ని రెండు గంటలకు పైగా ఉంచి రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయారుు.కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ సంఘటన స్థలానికి వచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని నాయకులు హెచ్చరించారు. దీం తో పోలీసులు కొందరు ఎస్పీతో ఫోన్లో నాయకులకు హామీ ఇప్పించడంతో రాస్తారోకో విరమించారు. తొలుత పొర్లుకట్ల ప్రాంతంలో మృతుల కుటుంబాలకు న్యా యం చేయాలని ధర్నా నిర్వహించారు. సమాఖ్య గౌరవాధ్యక్షుడు బషీర్, నాయకులు మానికల ఏడుకొండలు, అరవ పార్వతయ్య, తుపాకుల మునెమ్మ, సత్యవతి, శ్రీనివాసులు పాల్గొన్నారు.