పట్టిసీమతో సీమ సస్యశ్యామలం: సీఎం
8 నెలల్లో 70 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తీసుకొస్తాం
కర్నూలు ప్రజలు నాకు ఓట్లేయలేదు
సాక్షి, కర్నూలు: కేవలం కాల్వ గట్లపై నిద్రపోవడమే కాకుండా రాష్ట్రానికి తాగు, సాగు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పట్టిసీమ ద్వారా నీరు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. 8 నెలల్లో పోలవరం కుడి కాల్వ ద్వారా 70 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తీసుకొస్తామని చెప్పారు. బుధవారం కర్నూలు జిల్లాలోని అవుకు మండలం సంగపట్నం కొత్తవాని చెరువులో నీరు- చెట్టుపై అవగాహన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం పోతిరెడ్డిపాడు సమీపంలో ఉన్న బానకచెర్ల హెడ్‌రెగ్యులేటరీ విస్తరణ పనులను పరిశీలించారు.
తర్వాత పాణ్యం మండలంలోని గోరుకల్లు రిజర్వాయర్ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అక్కడినుంచి హెలికాప్టర్ ద్వారా అవుకు మండలంలోని సంగపట్నం చేరుకుని నీరు- చెట్టు కార్యక్రమం పురస్కరించుకుని బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. సమావేశానంతరం బాబు రోడ్డు మార్గాన వెళ్లి అవుకు రిజర్వాయర్‌ను పరిశీలించారు. రాత్రికి అక్కడే బస చేసి ఉదయం వెలుగొండ ప్రాజెక్టు సందర్శనార్థం వెళ్లనున్నారు.
పవర్‌ప్లాంట్‌ను అడ్డుకుంటే కేసులు
వేంపెంట పవర్‌ప్లాంట్‌ను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామంటూ ముఖ్యమంత్రి ఆ గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ ప్లాంటు నిర్మాణాన్ని నిలిపివేయాలని గ్రామస్తులు కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. పవర్‌ప్లాంటును రద్దుచేసే ప్రసక్తేలేదన్నారు. ఇలావుండగా కర్నూలు జిల్లా ప్రజలు తనకు ఓట్లు వేయలేదని గోరుకల్లు గ్రామంలో రైతులతో ముఖాముఖి సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఓట్లేయకపోయినా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఏడాదిలోగా గోరుకల్లులో ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేస్తామన్నారు. తమ సమస్యలు వినేందుకు సీఎం సమయం కేటాయించకపోవడంతో రైతులు నిరుత్సాహానికి గురయ్యారు.