నాలుగేళ్ల పోరాటానికి తొలి విజయం | Razia Sultana's first Victory for justice | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల పోరాటానికి తొలి విజయం

Published Sat, Feb 15 2014 12:44 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

నాలుగేళ్ల పోరాటానికి తొలి విజయం - Sakshi

నాలుగేళ్ల పోరాటానికి తొలి విజయం

 నాలుగేళ్ల పాటు కొనసాగించిన  పోరాటానికి తొలి విజయం లభించింది. అన్యాయం జరిగిందని ఆక్రోశించిన రజియా సుల్తానాకు అధికారులు అండగా నిలబడ్డారు. ప్రేమ పేరుతో ఖాకీ ముసుగులో మోసానికి పాల్పడ్డ ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌పై వేటు వేశారు. గుంటూరు రేంజి ఐజీ పి.వి.సునీల్‌కుమార్ అతడ్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం జిల్లా పోలీస్ వర్గాల్లో సంచలనమైంది. అదేస్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది.


 పొన్నూరుకు చెందిన రజియా సుల్తానాకు ఇంటర్ చదివే రోజుల్లో (2009, జూలైలో) అప్పటి ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత తనను రంగనాథ్ ప్రేమపేరుతో మోసం చేశాడని అప్పటి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ కేసు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో జిల్లా పోలీస్ అధికారులు రంగనాథ్‌గౌడ్‌ను సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. కొన్నాళ్ల తరువాత అరెస్టయిన రంగనాథ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేశాక నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యాడు.

 

అప్పటి నుంచి రజియా సుల్తానా న్యాయపోరాటం సాగిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఒక సందర్భంలో ఆమె సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వెళ్లబోసుకుంది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకుంది. దీనికితోడు గుంటూరు రేంజి ఐజీ సునీల్‌కుమార్ కూడా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకటికి రెండుసార్లు రజియాసుల్తానా ఆవేదనను విన్నారు. ఒంగోలు డీఎస్పీ జాషువాను న్యాయవిచారణ జరపాలని ఏడాది కిందట ఆదేశాలు జారీ చేశారు.

 

గత డిసెంబరులో గుంటూరు వచ్చిన డీఎస్పీ జాషువా రంగనాథ్, రజియా సుల్తానాలతో విడివిడిగా మాట్లాడి వారి వాదనలను విన్నారు. ఆయన నుంచి నివేదిక అందుకున్న ఐజీ సునీల్‌కుమార్ కేసులోని వాస్తవాలను గుర్తించారు. విచారణలో వాస్తవాలు వెలుగు చూసిన క్రమంలో ఎస్‌ఐ రంనాథ్‌గౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఐజీ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొంది. రజియా సుల్తానా కేసుతో పాటు మరో నాలుగు కేసుల్లోనూ రంగనాథ్‌గౌడ్ పాత్ర ఉన్నట్లు విచారణలో రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐజీ పేర్కొన్నారు.


 జిల్లా అంతటా చర్చే...
 కాగా రంగనాథ్‌గౌడ్‌పై పోలీస్ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ జరిగింది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌వర్గాలు, మహిళా సంఘాలు, కళాశాల విద్యార్థినులు ఇదే విషయంపై చర్చించుకోవడం కేసు ప్రాధాన్యతను తేటతెల్లం చేసింది. రంగనాథ్‌గౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన విషయంపై బాధితురాలు రజియా సుల్తానా స్పందిస్తూ పోలీసులు పరంగా తనకు న్యాయం జరిగినట్లే, కోర్టు పరంగానూ న్యాయం జరగాలని, రంగనాథ్‌పై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కోరింది. కష్టకాలంలో తనకు వె న్నంటే ఉండి ధైర్యాన్నిచ్చిన కుటుంబ పెద్దలు, స్నేహితులకు రజియా కృతజ్ఞతలు తెలిపింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement